మార్కెట్ల సరికొత్త రికార్డ్స్
75,000 దాటి నిలిచిన సెన్సెక్స్
354 పాయింట్లు హైజంప్
22,754కు నిఫ్టీ– 111 పాయింట్లు ప్లస్
రూ. 400 లక్షల కోట్లకు మార్కెట్ విలువ
ఒక్క రోజు గ్యాప్‌లో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దుమ్మురేపాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 75,000 పాయింట్లపైన నిలవగా.. నిఫ్టీ 22,754 వద్ద ముగిసింది. వెరసి బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మళ్లీ రూ. 400 లక్షల కోట్లను అధిగమించింది. తాజా ట్రేడింగ్‌లో చిన్న షేర్లకు సైతం కొనుగోళ్ల మద్దతు లభించింది.
అమెరికాలో ద్రవ్యోల్బణం మరోసారి కట్టుతప్పడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆలోచనకు చెక్‌పడే వీలుంది. దీంతో యూఎస్ మార్కెట్లు 1.3 శాతం డీలాపడి ట్రేడవుతున్నాయి.
ముంబై: ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో రెండోసారి సరికొత్త రికార్డులను సాధించాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు జంప్‌చేసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 75,038 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం 111 పాయింట్ల వృద్ధితో కొత్త గరిష్టం 22,754 వద్ద ముగిసింది. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 75,105 వద్ద, నిఫ్టీ 22,776 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ ప్రభావంతో బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 1–0.5 శాతం మధ్య బలపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు రూ. 2,27,025 కోట్లు జమయ్యింది. మొత్తం విలువ రూ. 402 లక్షల కోట్ల(4.83 ట్రిలియన్ డాలర్లు) ఎగువకు చేరింది.
ఫార్మా మినహా..
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, ప్రభుత్వ బ్యాంక్స్, చమురు, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ 1.5 శాతంస్థాయిలో పుంజుకోగా.. ఫార్మా 0.3 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐటీసీ, కొటక్ బ్యాంక్, హిందాల్కో, ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, అదానీ ఎంటర్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్‌జీసీ, ఐషర్, టెక్‌ఎం, ఆర్‌ఐఎల్ 3.6–1% మధ్య లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, సిప్లా, మారుతీ, దివీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2–1% మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మొత్తం ట్రేడైన షేర్లలో 1,904 లాభపడితే.. 1,939 బలహీనపడ్డాయి. నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 2,778 కోట్లు, దేశీ ఫండ్స్ సైతం రూ. 163 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశాయి.
మూడోరోజూ మెరిసిన పసిడి, వెండి
పసిడి, వెండి ధరలు న్యూఢిల్లీలో వరుసగా మూడవ రోజు బుధవారం కూడా రికార్డుల ర్యాలీ చేశాయి. పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర ఒక దశలో లైఫ్‌టైమ్ హై రూ.72,000 తాకింది. అటు తర్వాత క్రితం ముగింపుతో పోలి్చతే రూ.200 లాభంతో రికార్డు స్థాయి రూ.71,840 వద్ద ముగిసింది. వెండి కూడా కేజీకి రూ.200 ఎగసి రూ.84,700 వద్ద ముగిసింది.
పసిడి ధర గడచిన మూడు రోజుల్లో రూ.690 పెరగ్గా, వెండి ధర ఇదే కాలంలో రూ.1,500 పెరిగింది. కాగా, అంతర్జాతీయ బులిష్ ధోరణులు ఈ రెండు మెటల్స్ తాజా పెరుగుదలకు కారణంకాగా, బుధవారం వెలువడిన అమెరికాలో తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాలు, వడ్డీరేట్లు తగ్గకపోవచ్చని భయాలతో బంగారం, వెండి తక్షణ ర్యాలీకి బ్రేక్ పడవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా, జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లు క్రితం ముగింపుతో పోల్చితే మైనస్‌లో ట్రేడవుతుండడం ఇక్కడ గమనార్హం.
నకిలీ వీడియోలతో తస్మాత్ జాగ్రత్త!
ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ స్టాక్ రికమండేషన్లు ఇస్తున్నట్లు అవాస్తవ(డీప్‌ఫేక్) వీడియోల సృష్టి జరిగినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం తాజాగా పేర్కొంది. ఆధునిక సాంకేతికతను తప్పుడు మార్గంలో వినియోగించడం ద్వారా ఎన్‌ఎస్‌ఈ లోగోసహా.. ఆశిష్‌కుమార్ ముఖం లేదా గొంతుతో షేర్ల సిఫారసులు చేస్తున్న ఫేక్ వీడియోలను నమ్మొద్దని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment