నష్టాలు ఒకరోజుకే పరిమితం
సూచీలకు రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల దన్ను
రాణించిన బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు
ముంబై: ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాల నమోదుతో బ్యాంకింగ్, ఆటో, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 526 పాయింట్లు పెరిగి 72,996 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు బలపడి 22,100 స్థాయిపైన 22,124 వద్ద నిలిచింది. అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(1%), రిలయన్స్ ఇండస్ట్రీస్(4%), మారుతీ సుజుకీ(2%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.
రోజంతా లాభాలే..
ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో రోజంతా లాభాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 668 పాయింట్లు బలపడి 73,139 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు ఎగసి 22,193 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి.
మళ్లీ రూ.20 లక్షల కోట్లపైకి రిలయన్స్ మార్కెట్ క్యాప్
రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేరు 3.60% లాభపడి రూ.2988 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ గోల్డ్‌మెన్ శాక్స్ రిలయన్స్ కంపెనీ షేరు టార్గెట్ ధరను పెంచడంతో పాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడం ఈ షేరుకు డిమాండ్ లభించింది. ట్రేడింగ్‌లో 4% లాభపడి రూ.3000 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.70,039 కోట్లు పెరిగి రూ.20.21 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ ఫిబ్రవరి 13న కంపెనీ రిలయన్స్ క్యాప్ రూ.20 లక్షల కోట్ల స్థాయిని అందుకుంది. దేశంలో టాప్–5 మార్కెట్ క్యాప్ కలిగిన సంస్థల్లో రిలయన్స్ అగ్రస్థానంలో నిలవగా.., టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
► జ్యువెలరీ రిటైల్ కంపెనీ పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.
► బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా కంపెనీ 10 బిలియన్ డాలర్ల(రూ. 83,000 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
► మారుతీ సుజుకీ రూ.12,256 జీవిత కాల గరిష్టాన్ని తాకింది. దీనితో ఇంట్రాడేలో మార్కెట్ క్యాప్ రూ.4 లక్షల కోట్లను అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment