సరికొత్త గరిష్టాలకు మార్కెట్లు
ముంబై: ప్రధానంగా బ్లూచిప్స్‌లో కొనుగోళ్లతో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హైజంప్ చేశాయి. వెరసి ప్రామాణిక ఇండెక్సులు సరికొత్త గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 494 పాయింట్లు ఎగసి 74,742 వద్ద ముగిసింది. నిఫ్టీ 153 పాయింట్లు జమ చేసుకుని 22,666 వద్ద స్థిరపడింది. ఒక దశలో సెన్సెక్స్ 621 పాయింట్లు పురోగమించి 74,869ను తాకింది. ఇక నిఫ్టీ 183 పాయింట్లు బలపడి 22,697 వద్ద గరిష్టాన్ని అందుకుంది. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ర్యాలీ సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వారాంతాన యూఎస్ మార్కెట్లు లాభపడిన సంగతి తెలిసిందే.
.
మార్కెట్ విలువ రికార్డ్
ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలి సెషన్‌లో రూ. 401 లక్షల కోట్లను అధిగమించింది. మార్కెట్ చరిత్రలో ఇది తొలిసారికాగా.. డాలర్లలో 4.81 ట్రిలియన్లను తాకింది. చివరికి బీఎస్‌ఈ మార్కెట్ విలువ రూ. 4,00,86,722 వద్ద స్థిరపడింది. గతేడాది జులైలో తొలిసారి బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 300 లక్షల కోట్లను తాకిన విషయం విదితమే.
బ్లూచిప్స్ దన్ను
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, ఆయిల్, రియల్టీ, మెటల్ రంగాలు 2.2–1.2 శాతం మధ్య పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, ఐటీ 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, ఎంఅండ్‌ఎం, మారుతీ, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ, గ్రాసిమ్, టాటా కన్జూమర్, ఎల్‌అండ్‌టీ, ఆర్‌ఐఎల్, యాక్సిస్, హీరోమోటో, ఎయిర్‌టెల్ 4–1 శాతం మధ్య ఎగశాయి. అయితే అదానీ పోర్ట్స్, నెస్లే, అపోలో హాస్పిటల్, విప్రో, సన్ ఫార్మా 1.6–0.6 శాతం మధ్య నీరసించాయి.
ఆధార్ హౌసింగ్ ఐపీవోకు రెడీ
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది.
మే 20న మార్కెట్లకు సెలవు
ముంబైలో సాధారణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మే 20న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 11న ఈద్(రంజాన్), 17న శ్రీరామ నవమి, మే 1న మహారాష్ట్ర డే సందర్భంగా సైతం స్టాక్ మార్కెట్లు పనిచేయవు.
Comments
Please login to add a commentAdd a comment