సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పనులకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన వారికి ఎకరాకు రూ.6 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సేకరిస్తున్న భూముల విషయంలో మార్కెట్ ధరను ఎకరాకు రూ.85 వేలుగానే నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ఎంత మాత్రం కొనసాగరాదంటూ ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.
సింగిల్ జడ్జి ఉత్తర్వుల వల్ల స్వచ్ఛందంగా భూమి ఇచ్చేందుకు ముందుకొచ్చిన వారికి చెల్లిస్తున్న రూ.6 లక్షలను మార్కెట్ విలువగా నిర్ణయించినట్లవుతుందని, మార్కెట్ విలువను కోర్టులు నిర్ణయించజాలవని ధర్మాసనం స్పష్టం చేసింది. మార్కెట్ విలువల నిర్ణయం పూర్తిగా అధికారుల పరిధిలోని వ్యవహారమని, ఇందులో న్యాయస్థానాల జోక్యం ఎంత మాత్రం సరికాదని పేర్కొంది.
అయితే సిద్దిపేట జిల్లా కలెక్టర్ మార్కెట్ విలువల సవరణకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. ఆ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సింగిల్ జడ్జి వద్దే స్టే ఎత్తివేతకు పిటిషన్ దాఖలు చేసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మార్కెట్ విలువలను సవరిస్తూ సిద్దిపేట కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రైతులు నర్సింహారెడ్డి మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి, కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేశారు. కాగా, సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీలును విచారించిన ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment