న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ).. అదానీ గ్రూప్ స్టాక్స్‌లో చేపట్టిన పెట్టుబడుల విలువ పుంజుకుంది. డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్‌నకు చెందిన ఏడు స్టాక్స్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ తాజాగా రూ. 44,670 కోట్లను తాకింది. ఏప్రిల్ నుంచి చూస్తే రూ. 5,500 కోట్ల విలువ జత కలిసింది. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నివేదిక తదుపరి పతన బాట పట్టిన అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు కొద్ది రోజులుగా జోరు చూపుతున్నాయి.
ఇటీవల సుప్రీం కోర్టు నియమిత నిపుణుల కమిటీ గ్రూప్ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిన దాఖలాలు లేవంటూ స్పష్టం చేసింది. దీంతో ఇన్వెస్టర్లు అదానీ షేర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో గత మూడు రోజుల్లో 10 కంపెనీలతో కూడిన అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ. 1,77,927 కోట్లమేర ఎగసి రూ. 10,79,498 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే.
అదానీ పోర్ట్స్ జూమ్
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లో ఎల్‌ఐసీకి అత్యధికంగా 9.12 శాతం వాటా ఉంది. బుధవారం షేరు ధర రూ. 718తో చూస్తే వీటి విలువ రూ. 14,145 కోట్లు. ఇక అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో గల 4.25 శాతం వాటా విలువ రూ. 12,017 కోట్లకు చేరింది. షేరు రూ. 2,477 వద్ద ముగిసింది. ఎల్‌ఐసీకి అదానీ టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్‌లో కలిపి రూ. 10,500 కోట్ల విలువైన పెట్టుబడులున్నాయి. ఈ బాటలో అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏసీసీలలోనూ ఎల్‌ఐసీ వాటాలను కలిగి ఉంది. అదానీ గ్రూప్ స్టాక్స్‌లో రూ. 30,127 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఈ ఏడాది జనవరి 30న ఎల్‌ఐసీ వెల్లడించింది. జనవరి 27కల్లా ఈ పెట్టుబడుల విలువ రూ. 56,142 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. అయితే తదుపరి హిండెన్‌బర్గ్ నివేదిక తదుపరి అదానీ స్టాక్స్ పతన బాట పట్టడంతో ఫిబ్రవరి 23కల్లా ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ. 27,000 కోట్లకు పడిపోయింది.
వాటాల వివరాలిలా
2023 మార్చి చివరికల్లా ఎల్‌ఐసీకి అదానీ పోర్ట్స్‌లో 9.12 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 4.26 శాతం, ఏసీసీలో 6.41 శాతం, అంబుజా సిమెంట్స్‌లో 6.3 శాతం, అదానీ టోటల్ గ్యాస్‌లో 6.02 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 3.68 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 1.36 శాతం చొప్పున వాటాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment