ఇన్ఫీని బీట్ చేసిన సుజుకీ..దేనిలో?
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ను, చమురు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఓఎన్జీసీని ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతీ సుజుకీ అధిగమించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ లో ఈ రెండు సంస్థలను మారుతీసుజుకీ మించి పోయింది. శుక్రవారం ట్రేడింగ్ లో సుజుకీ స్టాక్ 3 శాతం పైకి ఎగియడంతో, అదనంగా దాని మార్కెట్ విలువకు రూ.6,563 కోట్లు వచ్చి చేరాయి. నిన్నటి మార్కెట్లో స్టాక్ 3 శాతం లాభపడి రూ.7,451 వద్ద ముగిసింది. 52 వారాల గరిష్ట స్థాయిలో ఇంట్రాడేలో 3.25 శాతం మేర పైకి ఎగిసింది. బీఎస్ఈ బెంచ్ మార్కు సెన్సెక్స్ లో టాప్ గెయినర్ గా మారుతీ సుజుకీ లాభాలు పండించింది.
ఇక నిఫ్టీలో 2.97 శాతం లాభపడిన మారుతీ సుజుకీ షేరు రూ.7,464.85 వద్ద క్లోజైంది. ఈ లాభాలతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,562.85 కోట్ల పెరిగి, రూ.2,25,079.85 కోట్లకు చేరుకున్నాయి. దీంతో టాప్-10 మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్ ఛార్ట్ లో మారుతీ సుజుకీ ఇన్ఫోసిస్, ఓఎన్జీసీలను బీట్ చేసి ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకుంది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,17,899.66 కోట్లు కాగ, ఓఎన్జీసీది రూ.2,17,074.17 కోట్లు. ఆటో దిగ్గజాలన్నింటిల్లో కెల్లా కూడా మారుతీ సుజుకీ క్యాపిటలైజేషనే భారీగా పెరిగింది. టాటా మోటార్స్ కు రూ.1,34,896.92 కోట్లు ఉండగా.. మహింద్రా అండ్ మహింద్రాకు రూ.88,598.83కోట్ల క్యాపిటలైజేషన్ ఉంది.