ఫేస్‌బుక్‌ షేర్ల భారీ పతనం | Facebook Loses Over $110 Billion in Market Value | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ షేర్ల భారీ పతనం

Published Fri, Jul 27 2018 12:01 AM | Last Updated on Fri, Jul 27 2018 4:51 PM

Facebook Loses Over $110 Billion in Market Value - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్‌ షేర్లు తన చరిత్రలోనే అత్యంత భారీ పతనాన్ని గురువారం చవిచూశాయి. షేరు ధర 20 శాతం మేర పడిపోగా, కంపెనీ మార్కెట్‌ విలువ ఒక్క రోజులోనే 120 బిలియన్‌ డాలర్లకు పైగా ఆవిరైపోయింది. న్యూయార్క్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.41 గంటలకు షేరు 179.92 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. విక్రయాలు, యూజర్ల వృద్ధి జూన్‌ క్వార్టర్‌(రెండో త్రైమాసికం)లో  విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో షేర్లను విక్రయించడానికి పోటీ పడ్డారు. ఫలితం... షేరు ధర భారీగా పడిపోయింది. గురువారం ట్రేడింగ్‌ మొదలయ్యేటప్పటికి కంపెనీ మార్కెట్‌ విలువ దాదాపు 619 బిలియన్‌ డాలర్లుండగా... కాసేపటికే 120 బిలియన్‌ డాలర్లను కోల్పోయింది. 120 బిలియన్‌ డాలర్లంటే మన కరెన్సీలో దాదాపు రూ.8 లక్షల కోట్లు. భారత్‌లో నంబర్‌–1 లిస్టెడ్‌ కంపెనీగా ఉన్న టీసీఎస్‌ మార్కెట్‌ విలువకన్నా ఇది ఎక్కువ. 2018 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు త్రైమాసికాల్లోనూ ఆదాయ వృద్ధి తగ్గొచ్చని ఫేస్‌బుక్‌ సీఎఫ్‌వో డేవిడ్‌ వెహ్నెర్‌ ప్రకటించడం కూడా ప్రభావం చూపించింది.  గతంలోనూ 2015లో మొదటి త్రైమాసికం (జనవరి–మార్చి) ఫలితాలు అంచనాలను తప్పాయి. యూజర్ల డేటా లీకవ్వడం, ప్రకటనదారులకు అనుగుణంగా విధానాలను మార్చడం వంటి చర్యలతో ఫేస్‌బుక్‌ ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.  

యాక్టివ్‌ యూజర్లు 147 కోట్లు 
ఫేస్‌బుక్‌కు జూన్‌ నెలలో 147 కోట్ల మంది రోజువారీ యాక్టివ్‌ యూజర్లుగా ఉన్నారు. కానీ, బ్లూంబర్గ్‌ పోల్‌లో విశ్లేషకులు మాత్రం 148 కోట్ల మేర ఉండొచ్చనే అంచనాలు వ్యక్తం చేశారు. అతిపెద్ద మార్కెట్లయిన అమెరికా, కెనడాలో ఏ మాత్రం పెరుగుదల లేకుండా 185 మిలియన్ల యూజర్లు యథాతథంగా ఉండగా... యూరోప్‌లో ఒక శాతం తగ్గి 179 మిలియన్లకు చేరారు. అయితే, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే మాత్రం ఫేస్‌బుక్‌ను సగటున రోజువారీగా వినియోగించే వారి సంఖ్యలో 11 శాతం పెరుగుదల ఉంది. విశ్లేషకులు 13.3 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేయగా, వాస్తవంగా 13.2 బిలియన్‌ డాలర్ల మేర నమోదైంది. జూన్‌ చివరికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 30,275 మంది. ఫలితాలకు ముందు రోజు బుధవారం ఫేస్‌బుక్‌ షేరు జీవితకాల రికార్డు స్థాయి 217.50 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ధర ప్రకారం కంపెనీ మార్కెట్‌ విలువ 619 బిలియన్‌ డాలర్లు. ఈ ఏడాదిలో ఈ షేరు ఇప్పటి వరకు 23 శాతం పెరిగింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement