ప్రశ్న: నేను హైదరాబాద్‌లో నా ఫ్లాట్‌ని అమ్ముతున్నాను. రూ. 18 లక్షలకు ఒప్పందం కుదిరింది. కానీ, సబ్–రిజిస్ట్రార్ కార్యాలయం వాళ్లు మార్కెట్ విలువ రూ. 23,00,000 అంటున్నారు. – ఎ. సత్యప్రసాద్, హైదరాబాద్
జ. స్థిరాస్తుల క్రయవిక్రయ విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. ఇటు అమ్మే వ్యక్తి, అటు కొనే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..
♦ ఎటువంటి పరిస్థితుల్లోనూ కాస్త వైట్, కాస్త బ్లాక్ జోలికి పోకండి.
♦ ఏ పరిస్థితుల్లోనూ నగదు వ్యవహారం వద్దు.
♦ నగదు తప్పనిసరి అయితే రూ. 2,00,000 లోపలే ఉండేలా చూసుకోండి.
♦ 2001 ఆర్థిక సంవత్సరానికి ముందు కొన్న ఆస్తి విలువ 01-040-2001 నాటి మార్కెట్ విలువను ప్రామాణికంగా ఫెయిర్ మార్కెట్ విలువగా తీసుకుంటారు. జాగాకి గజం ఇంత అని, చదరపు అడుగుకు ఇంత అని సబ్–రిజిస్ట్రార్ సర్టిఫికెట్ ఇస్తారు.
♦ అలా నిర్ధారించిన విలువను ఇండెక్సింగ్ ద్వారా పెంచుతారు. 2001-02 నుండి 2002–03 వరకు ఒక టేబుల్ ఆన్‌లైన్‌లో దొరుకుతుంది.
♦ ఉదాహరణకు 2001–02లో మార్కెట్ విలువ 100 అనుకుంటే అది ఇప్పుడు 331కి సమానం అవుతుంది. మీరు గతంలో ఎంతకు కొన్నా 01–04–2001 నాటు మార్కెట్ విలువ రూ. 5,00,000 అనుకోండి 5,00,000/100 X331 = రూ. 16,55,000గా భావిస్తారు.
♦ పైన లెక్కించిన రూ. 16,55,000ని కొన్న ధరగా పరిగణిస్తారు.
♦ ఒప్పందంలో ఉన్న మొత్తం, మార్కెట్ విలువ ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని అమ్మకపు విలువుగా పరిగణిస్తారు. మీరు చెప్పిన కేసులో ఒప్పందపు విలువ రూ. 18,00,000, సబ్–రిజిస్ట్రార్ కట్టిన విలువ రూ. 23,00,000. సబ్–రిజిస్ట్రార్ విలువనే పరిగణిస్తారు. కొనే వ్యక్తి దీని మీదే రిజిస్ట్రేషన్ రుసుం, వగైరాలు చెల్లించాలి.
♦ ఈ ప్రకారం రూ. 23 లక్షలను ప్రాతిపదికగా తీసుకుని, అందులో నుంచి రూ. 16,55,000ని తీసివేయగా మిగిలిన రూ. 6,45,000ని దీర్ఘకాలిక మూలధన లాభంగా లెక్కిస్తారు.
♦ మీరు నిజంగా రూ. 18,00,000లే తీసుకున్నా, ఆ మేరకు అన్ని సాక్షాలు ఉన్నప్పటికీ రూ. 23,00,000నే పరిగణనలోకి తీసుకుంటారు.
♦ సాధారణంగా ఒప్పందం విలువ ఎక్కువగా ఉండి, మార్కెట్ విలువ తక్కువగా ఉంటుంది. ఆ అదనపు మొత్తం నగదుగా తీసుకుంటూ ఉంటారు. అలా ససేమిరా చేయవద్దు. కొంత మంది అదనపు మొత్తాన్ని విడిగా నాలుగైదు చెక్కులుగా ఇస్తాం.. మీరు వేరే అకౌంటులో వేసుకోండి అంటూ ఉంటారు. అలాంటివి చేయొద్దు.
♦ మీరు ఎలా అయితే క్యాపిటల్ గెయిన్‌కి గురి అవుతారో అలాగే ప్రతిఫలం ఇచ్చిన వ్యక్తి సదరు మొత్తానికి ’సోర్స్’ చూపించాలి. అలా చూపించకపోతే ఆ మొత్తం మీద 30 శాతం పన్ను చెల్లించాలి.
♦ ‘ఇద్దరం లబ్ధి పొందాలి, ఉభయతారకంగా ఉండాలి‘ అని ఆలోచించకండి.
నల్లధనంపై ఉంది ఆంక్ష .. కొంత మంది పెడతారు పరీక్ష .. కానీ మనకు పడేను శిక్ష .. మీ నిజాయితీయే మీకు శ్రీరామరక్ష! స్థిరాస్తి క్రయవిక్రయాల్లో .. జాగ్రత్త
Comments
Please login to add a commentAdd a comment