జీవో 157ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: భూములు తదితర స్థిరాస్తుల మార్కెట్ విలువ పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఆస్తుల మార్కెట్ విలువ పెంచుతూ ఈ ఏడాది మార్చి 30న జారీ చేసిన జీవో 157ను రద్దు చేస్తూ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ కేసీ భానులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇలా విలువ అనేది పెంపు నిబంధనల ప్రకారం ఆగస్టు 1 నుంచి అమలు చేయాల్సి ఉండగా, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇలా షెడ్యూల్‌ను మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఏకపక్షంగా జారీ చేసిన జీవో 157ను కొట్టివేయాలని అభ్యర్థిస్తూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎన్.రాజారెడ్డి, మహ్మద్ సర్దార్ ఆలీ, మరికొందరు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిని గతంలో విచారించిన ధర్మాసనం... జీవో 157పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వ్యాజ్యాలపై సోమవారం తీర్పు వెలువరించింది.
పాత విలువల ప్రకారమే రిజిస్ట్రేషన్లు?
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు తీర్పుతో రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్తుల కొనుగోలు రిజిస్ట్రేషన్లకు పాత రిజిస్ట్రేషన్ (మార్కెట్) విలువలను అమలు చేయక తప్పేలా లేదు. జీవో రద్దు ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కోర్టు స్పష్టం చేసినందున ఇకపై జరిగే రిజిస్ట్రేషన్లకు ఈ ఏడాది మార్చి 31కి ముందున్న రిజిస్ట్రేషన్ విలువలనే అమలు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి జీవో 157 అమల్లోకి రావడంతో కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలవుతున్నాయి. కోర్టు తాజా ఉత్తర్వులతో తర్జనభర్జన పడుతున్న అధికారులు మూడు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం పాత రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేయడం మొదటిది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయడం రెండోది. సుప్రీంకోర్టులో సవాల్ చేసినా ఇప్పుడు మాత్రం పాత మార్కెట్ విలువలను అమలు చేయకతప్పదు.
ఆగస్టు ఒకటో తేదీ నుంచి పెంపు వర్తించేలా తక్షణం జీవో జారీ చేయడం మూడో ప్రత్యామ్నాయం. ఇలా చేసినా ఇబ్బంది తప్పదని అధికారులు చెబుతున్నారు. ‘‘ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువల పెంపు వర్తించేలా ఇప్పుడు జీవో జారీ చేస్తే మార్చి 30న జారీ చేసిన 157 జీవో తప్పని ప్రభుత్వం అంగీకరించినట్లవుతుంది. ఫలితంగా ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేయడంవల్ల తాము నష్టపోయామని, అధికంగా వసూలు చేసిన ఫీజును వెనక్కు ఇవ్వాలని ఎవరైనా కోర్టుకు వెళ్లవచ్చు. దీనివల్ల ఆ మొత్తాన్ని వెనక్కు ఇవ్వాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వానికి తలనొప్పి అవుతుంది. అడ్వొకేట్ జనరల్ సలహా తీసుకొని ఆ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పాత రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేస్తారా? అనే అంశంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి వీకే అగర్వాల్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా... ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో లేనని, మంగళవారం వచ్చి పరిశీలించి ఏమి చేయాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
స్థిరాస్తుల ‘విలువ’ పెంపు రద్దు
Published Tue, Sep 24 2013 2:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
Advertisement
Advertisement