బస్తీ ఆస్తి..ఇకపై భారం జాస్తి
కాకినాడ లీగల్ :పట్టణ భూములను మరింత ప్రియం చేసేందుకు జిల్లా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో భూముల మార్కెట్ విలువను ఒకేసారి 50 శాతం వరకు పెంచేందుకు కసరత్తు జరగడం సామాన్య, మధ్యతరగతి వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్థికంగా గడ్డు పరిస్థితిలో ఉన్నట్టు చెపుతున్న టీడీపీ ప్రభుత్వం ఖజానాను నింపుకోవడానికి అనుసరిస్తున్న మార్గాల్లో ఇదొకటి. అయితే ఈ పెంపు నింద తమపై పడకుండా జిల్లా అధికారులపై నెట్టేసింది. గతంలో ఎప్పుడు ధరలను పెంచినా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసేది. ఆ మేరకు కసరత్తు చేశాక రూపొందించిన ప్రతిపాదనలు ప్రభుత్వామోదం పొందాకే అమలులోకి వచ్చేవి. కానీ ఈసారి పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అధికారం జిల్లా అధికారులకు కట్టబెట్టగా.. వారు కూడా ప్రజలకు బరువైనా ప్రభుభక్తిని చాటుకోవడానికి సిద్ధమవుతున్నారు.
రిజిస్ట్రార్ల ప్రతిపాదనలు 10 శాతం పెంపునకే..
ఆగస్టు ఒకటి నుంచి నగర, పట్టణ పరిధుల్లోని భూములు, భవనాలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ చార్జీలు పదిశాతం పెంచేందుకు వీలుగా.. ప్పటిలాగే సబ్ రిజిస్ట్రార్లు తమ పరిధిలోని భూముల మార్కెట్ విలువలను నిర్ధారిస్తూ రూపొందించిన నివేదికను సవరణల కమిటీ చైర్మన్, జేసీ ఆర్.ముత్యాలరాజుకు సమర్పించారు. ప్రభుత్వాదేశాల మేరకు సమావేశమైన కమిటీ మార్కెట్ విలువల పెంపుపై సమీక్షించింది. పదిశాతం పెంపు ప్రతిపాదనలపై జేసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో భూములు, భవనాలకు ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ విలువను గజానికి రూ.వెయ్యి పెంచాలని, అపార్ట్‌మెంట్ చదరపు అడుగుకు రూ.1500 ఉంటే రూ.1800లకు, రూ.1800 ఉంటే రూ.రెండువేలుకు పెంచాలని సబ్ రిజిస్ట్రార్లు ప్రతిపాదనలు ఇచ్చినట్టు తెలిసింది.
అయితే ప్రభుత్వాదేశాలతో జేసీ ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ విలువకు 40 నుంచి 50 శాతం పెంచాలని, అపార్ట్‌మెంట్ చదరపు అడుగుకు రూ.1500 నుంచి రూ.మూడువేలకు పెంచాలని సూచించినట్టు తెలిసింది. అయితే ఈ దిశగా ప్రభుత్వం కనీస విధివిధానాలు జారీచేయక పోవడంతో ఏ ప్రాతిపదికన స్థిరాస్తుల విలువలు సవరించాలో అర్థం కాక సబ్ రిజిస్ట్రార్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్లు తమ పట్టణాల్లో భూముల విలువలను భారీగా పెంచితే తప్ప ఆర్థిక పరిపుష్టి సాధించలేమని చెప్పారు. నగర, పట్టణాల వారీగా మార్కెట్ విలువలను అడిగి తెలుసుకున్న జేసీ కమిషనర్లు ప్రతిపాదించిన మేరకు పెంచాలని సబ్‌రిజిస్ట్రార్లకు సూచించారు. దీంతో ‘మీరు ఏ మేరకు పెంచి ప్రతిపాదనలు రూపొందిస్తే వాటినే జిల్లా సవరణల కమిటీ ముందుంచుతా’మని సబ్‌రిజిస్ట్రార్లు పెంపు బాధ్యతను మున్సిపల్ కమిషనర్లపైనే పెట్టారు.
కమిషనర్లకు కత్తి మీద సామే..
గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రతిపాదనలు రూపొందించని కమిషనర్లకు ఇప్పుడా కసరత్తు కత్తిమీద సాములా మారింది. 50 శాతానికి తగ్గకుండా పెంచాలని జేసీ అంటుండగా, మార్కెట్ విలువలను భారీగా పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న భావన కొత్తగాా బాధ్యతలు చేపట్టిన స్థానిక సంస్థల పాలకవర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి వారిని ఇరకాటంలో పెడుతోంది. మరోవైపు ఇదే అదనుగా కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు పట్టణాలకే వర్తింపచేయాల్సి ఉన్న పెంపుదలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ ప్రతిపాదనలు రూపొందించడం వివాదస్పదమవుతోంది. ఏది ఏమైనా మరో రెండురోజుల్లో పెంపు ప్రతిపాదనలు జేసీకి సమర్పించి, సవరణల కమిటీ నుంచి ఆమోదంతో ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి తీసుకురావాల్సి ఉండడంతో కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వాదేశాల మేరకు ఈ నెల 31 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.
క్షీణించనున్న రిజిస్ట్రేషన్లు
పట్టణాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌లో భూములు, భవనాలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విలువలు భారీగానే పెరిగాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకేసారి 40 నుంచి 50 శాతం పెంచితే రిజిస్ట్రేషన్లు బాగా తగ్గిపోతాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై స్టాంపులు రిజిస్ట్రేషన్ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా రిజిస్ట్రేషన్ల విలువల పెంపుపై ప్రస్తుతానికి కొంత అయోమయం నెలకొన్న మాట వాస్తవమేనని, జేసీ ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు కసరత్తు జరుగుతోందని, ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని చెప్పారు. కాగా భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ ఖర్చును తప్పించుకోవడానికి ఈనెలాఖరులోగానే ఆ తంతు పూర్తి చేయించుకోవాలని పలువురు ఆరాటపడుతున్నారు.