తగ్గిన స్టాంపు డ్యూటీ
సాక్షి, హైదరాబాద్: కొన్ని రకాల స్థిరాస్తి కొనుగోళ్ల రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీని తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గింపు సోమవారంనుంచి అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలు...
- వారసత్వపు ఆస్తి హక్కు కలిగిన వ్యక్తి కుటుంబంలోని వ్యక్తి నుంచి స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే (సెటిల్‌మెంటు)కు ప్రస్తుతం మార్కెట్ విలువలో 3 శాతంగా విధించే స్టాంపు డ్యూటీ ఒక శాతానికి తగ్గింది.
- స్వార్జిత ఆస్తిని కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించే సెటిల్‌మెంట్‌కు మార్కెట్ విలువలో స్టాంపు డ్యూటీ 6 శాతం నుంచి రెండు శాతానికి తగ్గింది.
- రక్త సంబంధీకులకు (కొడుకు, కూతురు తదితరులకు) బహుమతి కింద చేసే రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీ 5 శాతం నుంచి ఒక శాతానికి తగ్గింది.
- రక్త సంబంధీకులు కాని ఇతర కుటుంబ సభ్యులకు (అల్లుడు, కోడలు తదితరులకు) బహుమతి కింద చేసే రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీ 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది.
- కుటుంబ సభ్యులకు సంబంధించి భాగ పరిష్కార ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీ ఒక శాతం నుంచి అర శాతానికి తగ్గింది. ఇలా చేసుకునే దస్తావేజులలో ఆస్తి విలువకు అరశాతం స్టాంపు డ్యూటీ ఎంత ఎక్కువైనా, గరిష్టంగా రూ. 20 వేలు చెల్లిస్తే సరిపోతుంది.
- కుటుంబేతరుల భాగ పరిష్కార ఒప్పందాల రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీ 3 నుంచి ఒక శాతానికి తగ్గింది.
- భాగస్వామ్య సంస్థ పునరుద్ధరణ దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీ 5 శాతం నుంచి 3 శాతానికి తగ్గింది.
- భాగస్వామ్య సంస్థ రిజిస్ట్రేషన్ రద్దుకు స్టాంపు డ్యూటీ 5 శాతం నుంచి 3 శాతానికి తగ్గింది.
- అధీనంలో ఉన్న ఆస్తికి తనఖా దస్తావేజు రిజిస్ట్రేషన్‌కు 5 శాతంగా ఉన్న స్టాంపు డ్యూటీ 2 శాతానికి తగ్గింది.
- సర్టిఫికెట్ ఆఫ్ సేల్, ఆస్తి బదలాయింపు తదితరాలకు స్టాంపు డ్యూటీ 5 శాతం బదులు 4 శాతం అయింది.