వుడా డీఎఫ్‌వో ఇళ్లపై ఏసీబీ దాడులు | Vuda diephvo esibi house raids | Sakshi
Sakshi News home page

వుడా డీఎఫ్‌వో ఇళ్లపై ఏసీబీ దాడులు

Published Thu, Sep 5 2013 3:51 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM

Vuda diephvo esibi house raids

 సాక్షి, విశాఖపట్నం:  ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న అభియోగంపై వుడా డివిజినల్ ఫారెస్ట్ అధికారి (డీఎఫ్‌వో) శంబంగి రామ్మోహన్ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఆయన కార్యాలయం, స్నేహితులు, బంధువుల ఇళ్లపైనా ఏకకాలంలో పది బృందాలు తనిఖీలు చేయడం ఉత్తరాంధ్రలో సంచలనమైంది. విశాఖలోని శాంతిపురం రోడ్డు అక్షయ ఎన్‌క్లేవ్ (జీ-2)లో ఉత్తరాంధ్ర జిల్లాల ఏసీబీ డీఎస్సీ ఎం నర్సింగరావు ఆధ్వర్యంలో సోదాలు ప్రారంభమయ్యాయి.

ఈ సమయంలో రామ్మోహన్ ఇంటి వద్దే ఉన్నారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న పావుకేజీ బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, రూ.7లక్షల విలువైన బీమా పత్రాలు, రూ.3 లక్షల నగదుతో పాటు కీలక పత్రాలు, హోండా కారును స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాలనుంచి ఏసీబీ అధికారులు విజయనగరం, శ్రీకాకుళం, పొదిలి, ప్రకాశం తదితర ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలకు దిగారు. రాత్రయినా తనిఖీలు కొనసాగాయి. రామ్మోహన్ కార్యాలయం, ఇళ్లపైనా సోదాలు ఇంకా పూర్తికాలేదని, ఇప్పటివరకూ తేలిన స్థిర, చర ఆస్తుల విలువ సుమారు రూ.1కోటిపైనే ఉంటుందని ఏసీబీ డీఎస్పీ నర్సింహరావు తెలిపారు.

మార్కెట్ విలువ ప్రకారం రూ.5 కోట్లు ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. నగరంలోని శాంతిపురం, మర్రిపాలెం, మిథిలాపురం కాలనీ ప్రాంతాల్లో ఆస్తుల విలువ ఇంకా మదింపు కావాల్సి ఉందన్నారు. బ్యాంకు లాకర్లు తనిఖీ చేయాల్సి ఉందని తెలిపారు. రామ్మోహన్ అరెస్టుకు రంగం సిద్ధమైందని తెలిసింది. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన రామ్మోహన్ 1990లో ఉద్యానవనశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టి అంచెలంచెలుగా ఎదిగారు.

అటవీశాఖ నుంచి డెప్యుటేషన్‌పై గత మేలోనే వుడాలో చేరారు. గతంలో ఆయన డ్వామా పీడీ, మైక్రోవాటర్ స్కీం వంటి కీలక విభాగాల్లో పనిచేశారు. వుడాలోని రామ్మోహన్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులకు దిగడంతో ఆ విభాగంలోని ఇతర శాఖల సిబ్బంది, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.
 
 ఇతర ఆస్తులివి
 మధురవాడ స్టేడియం సమీపంలో తన స్నేహితుడు, బిల్డర్ వై. సత్యనారాయణ ఆధ్వర్యంలో డెవలప్ చేస్తున్న 16 ప్లాట్లు.
     
 విజయనగరం జిల్లా సాలూరులో రెండంతస్తుల భవనం. విశాఖలోని టీపీటీకాలనీలో త్రీబెడ్‌రూం ఫ్లాట్.
     
 విశాఖ జిల్లా వి. మాడుగులలో తన భార్య శ్రీదేవి పేరిట కొనుగోలు చేసిన 10ఎకరాల స్థలంలో ప్రస్తుతం పామాయిల్ తోటల్ని పెంచుతున్నారు.
     
 ప్రకాశం జిల్లాలో ఖాళీ స్థలం. విశాఖలోని పరదేశీపాలెంలో 2001లో మూడెకరాల స్థలం కొనుగోలు చేశారు.
     
 విశాఖలోని మిథిలాపూర్ కాలనీలో విలువైన భవనం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement