insurance documents
-
భార్యకు బీమా పత్రాలు, డెత్‌నోట్ వాట్సాప్ చేసి..
సాక్షి, యశవంతపుర: ఇంటికి ఆలస్యంగా వస్తానని భార్యకు చెప్పాడు, తరువాత బీమా పత్రాలను, డెత్‌నోట్‌ను వాట్సప్ చేసి నడుస్తున్న రైలు కిందకు దూకి కేంద్ర ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఇన్స్పెక్టర్ ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర దూబె 10 ఏళ్ల నుంచి బెంగళూరులో ఐటీ శాఖలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. ఆయన యశవంతపురలోని బీడీఏ ఆఫీసు వద్ద నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక పోలీసులు శనివారం తెలిపారు. సుమారు 10 రోజుల కిందటే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెప్పారు. దూబె చివరిసారిగా యూపీలో ఉంటున్న తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి తరువాత బెంగళూరులో భార్య ఆరతి మాళవికి కాల్ చేసి మాట్లాడి, ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పాడు. కొంతసేపటికి తన ఇన్సూరెన్స్ పత్రాల కాపీలను, సూసైడ్ నోట్‌ను భార్యకు వాట్సాప్ చేశాడు. నా మరణానికి నాదే బాధ్యత అని డెత్‌నోటులో రాశాడు. తన భర్త కనిపించడం లేదంటూ భార్య యశవంతపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గాలించగా రైలు పట్టాల వద్ద మృతదేహం కనిపించింది. మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అనుమానిత ఉగ్రవాది బెంగళూరులో అరెస్టు) -
బీమా పత్రాలకు భరోసా!
ఉమెన్ ఫైనాన్స్ / ఇ-ఇన్సూరెన్స్ ఖాతా డబ్బును ఎలక్ట్రానిక్ రూపంలో బ్యాంకులో ఎలా భద్రపరుస్తామో; షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు, బాండ్స్ తదితర పెట్టుబడులను డీ-మ్యాట్ ఖాతాలో ఎలాగైతే ఎలక్ట్రానిక్, డిజిటల్ రూపేణా పొందుపరుస్తారో.. అదే విధంగా ఇన్సూరెన్స్ పాలసీలను ఎలక్ట్రానిక్ పద్దతిలో నమోదు చేయడానికి వీలుపడేలా ఏర్పాటైనదే ఇ-ఇన్సూరెన్స్ ఖాతా. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో, ఈ.. ఇ-ఇన్సూరెన్స్ ఖాతాను ఎలా తెరవాలో తెలుసుకుందాం. * సంస్థలు ఏవైతే కంపెనీస్ యాక్టు 1956 కింద రిజిస్టర్ అయి, ఐ.ఆర్.డి.ఎ. (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) వారి చేత ఇన్సూరెన్స్ పాలసీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించడానికి అనుమతి పొందుతాయో వాటి ద్వారా ఇ-ఇన్సూరెన్స్ ఖాతాను ప్రారంభించవచ్చు. * ఇలాంటి సంస్థలను ఇన్సూరెన్స్ రెపాజిటరీ అంటారు. ఇవి ఏ విధమైనటువంటి పాలసీలనూ అమ్మడానికి వీలు లేదు. కేవలం పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో పొందుపరచడానికి మాత్రమే ఇవి ఉద్దేశించినవి. * ఈ ఇన్సూరెన్స్ రెపాజిటరీలు కొంతమందిని తమ కంపెనీ ప్రతినిధులుగా నియమించుకుని తమ విధులను నిర్వర్తిస్తాయి. * ఇ-ఇన్సూరెన్స్ ఖాతా ఒక ఇన్సూరెన్స్ రెపాజిటరీ వద్ద మాత్రమే కలిగి ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలను అనుమతించరు. * ఈ ఖాతాను ప్రారంభించడానికి గానీ, నిర్వహించడానికి గానీ ఖాతాదారులు ఎటువంటి చార్జీలు చెల్లించనవసరం లేదు. * ఈ ఖాతా అప్లికేషన్‌ను ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి గానీ, ఇన్సూరెన్స్ రెపాజిటరీ /ఇన్సూరెన్స్ రెపాజిటరీ అధికారిక ప్రతినిధి నుంచి గానీ పొందవచ్చు. అప్లికేషన్‌ను పొందుపరిచిన వారం లోగా ఖాతా ప్రారంభం అవుతుంది. * ఈ ఖాతాను ఏ పాలసీలు లేకపోయినా ప్రారంభించవచ్చు. భవిష్యత్తులో ఎప్పుడైతే పాలసీలు తీసుకుంటారో అప్పుడు ఆ పాలసీని ఎలక్ట్రానిక్ రూపంలో పొందవచ్చు. పాలసీలు ఉన్నట్లయితే వాటిని ఈ ఖాతాలో నమోదు చేయవచ్చు. * ఈ ఖాతాను ఒక ఇన్సూరెన్స్ రెపాజిటరీ నుండి మరొక ఇన్సూరెన్స్ రెపాజిటరీకి బదలీ చేసుకునే వెసులుబాటు ఉంది. * ఒకవేళ ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న పాలసీని పాలసీ బాండ్ రూపేణా పేపర్ రూపంలో తీసుకోవాలంటే మళ్లీ మార్చుకునే సౌకర్యం ఉంది. * ప్రతి ఇన్సూరెన్స్ రెపాజిటరీలో తప్పనిసరిగా ఖాతాదారుల ఫిర్యాదుల విభాగం ఉంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే ఈ విభాగం ద్వారా పరిష్కారం పొందవచ్చు. ఇ-ఇన్సూరెన్స్ ఖాతా ఉపయోగాలు సురక్షితం : ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి కాబట్టి పాలసీ బాండ్ పోతుందనీ, డామేజీ జరుగుతుందనీ భయపడనవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలసీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సులభతరం: అడ్రస్, ఫోన్ నెంబరు తదితరాలు మార్చాలి అనుకున్నప్పుడు ప్రతి పాలసీకి మార్పులు చేయకుండా ఈ ఖాతాకు మాత్రమే చేస్తే సరిపోతుంది. * ఒకేచోట ఆన్లైన్లో పాలసీలు అన్నింటినీ సమీక్షించుకోవచ్చు. * పాలసీ బెనిఫిట్స్ అన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో బ్యాంకు ఖాతాకు బదలీ అవుతాయి కనుక త్వరగా చేతికి అందుతాయి. * ఈ ఖాతాకు ‘ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్’ను పెట్టుకునే సౌకర్యం ఉంది. ఈ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఖాతాదారుని మరణానంతరం లేదా ఖాతాదారుడు ఖాతాను నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఖాతాను నిర్వహించడానికి అర్హుడు. అయితే ఆ రిప్రజెంటేటివ్‌కు పాలసీ బెనిఫిట్స్ పొందడానికి ఎటువంటి అధికారమూ ఉండదు. అవి నామినీకి మాత్రమే చెందుతాయి. నామినీ, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కూడా ఒకే వ్యక్తి అయి ఉండవచ్చు. మనం ఎన్నో రకాలుగా మన కుటుంబ సభ్యుల భద్రత కోసం పెట్టుబడులు పెడుతుంటాం, ఇన్సూరెన్స్‌లు తీసుకుంటూ ఉంటాం. ఈ వివరాలన్నీ కుటుంబలోని వారికి తెలియకపోతే, అనుకోని సంఘటన జరిగినప్పుడు మనం కష్టపడి పొదుపు చేసినదంతా వృథాగా మరుగున పడిపోతుంది. కనుక పాలసీలకు ఇ-ఇన్సూరెన్స్ తీసుకుని, అన్నిటినీ ఒకేచోట భద్రపరిస్తే సులభంగా ఉంటుంది. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
బీమా పత్రాలు కాస్త భద్రం!
భౌతికంగానే కాక... డిజిటల్ కాపీలూ ఉంచుకోండి అవసరాలకు తగిన పాలసీని ఎంచుకోవడం, కొనుక్కోవడం అంత సులువేమీ కాదు. ప్రస్తుతం బోలెడన్ని కంపెనీలు అనేక రకాల పాలసీలు అందిస్తున్నాయి. పాలసీ తీసుకోవాలంటే దాని టర్మ్, ప్రీమి యం, కవరేజీ, మినహాయింపులు మొదలైనవన్నీ చూసుకోవడం తప్పనిసరి. దీనికే సమయం సరిపోతుంది. ఈ హడావుడిలో పడి పాలసీ కొనుక్కునేటప్పుడు కీలకమైన నియమ, నిబంధనలను, డాక్యుమెంటేషన్‌ను చాలా మంది పట్టించుకోరు. బీమా పాలసీ తీసుకుంటున్నప్పుడు నియమ, నిబంధనలన్నింటినీ క్షుణ్నంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక డాక్యుమెంటేషన్ విషయానికొస్తే... కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇదొక్కటే ఆధారం. ఎంత ప్రీమియం కడతాం? ఎంత కవరేజి ఉండబోతోంది? వంటి కీలకమైన సమాచారమంతా ఇందులోనే ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడే పట్టించుకోకపోతే.. ఆ తర్వాత ఇవే సమస్యలై కూర్చుంటాయి. అంతే కాదు! పాలసీని జాగ్రత్తగా భద్రపర్చుకోవడం కూడా కీలకమే. ఇందుకోసం తీసుకోతగిన జాగ్రత్తల్లో కొన్ని.. ♦ దరఖాస్తు నింపేటప్పుడే అన్ని సూచనలు సరిగ్గా చదువుకుని నింపాలి. అవసరమైన పత్రాలన్నింటినీ జత చేయాలి. కొన్ని కంపెనీలు ఎలక్ట్రానిక్ రూపంలోనూ అడుగుతుంటాయి.. కాబట్టి ముందుగానే నిర్దేశిత పత్రాలను స్కాన్ చేసి పెట్టుకుంటే పాలసీ తీసుకోవడంలో సమయం వృథా కాదు. ♦ వైద్య బీమా పాలసీలకు సంబంధించి కంపెనీలు ప్రస్తుతం ఫ్రీ లుక్ పీరియడ్ ఇస్తున్నాయి. ఇది సుమారు పది-పదిహేను రోజులుంటుంది. తనకు జారీ అయిన పాలసీపై సంతృప్తి చెందని పక్షంలో పాలసీదారు ఈ వ్యవధిలో దాన్ని రద్దు చేసుకోవచ్చు. ఫ్రీ లుక్ పీరియడ్‌లో రద్దు చేసుకున్నా పాలసీదారు కట్టిన మొత్తం ప్రీమియం వెనక్కి వచ్చేస్తుంది. ఎటువంటి పెనాల్టీలు ఉండవు. అయితే, ఈ వ్యవధిలో ఎటువంటి క్లైమ్ దాఖలవకుండా ఉండాలి. ఈ ఆప్షన్ ఉపయోగించుకోదల్చుకుంటే.. బీమా కంపెనీకి రాతపూర్వకంగా రిక్వెస్ట్ ఫారం సమర్పించాలి. దీన్ని ఆయా కంపెనీల వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పాలసీని వద్దనుకుంటే.. పాలసీ డాక్యుమెంటు అందిన తేదీ, ఏజంటు సమాచారం, రద్దు చేసుకుంటున్నందుకు కారణాలు మొదలైన వివరాలన్నీ ఫారంలో పొందుపర్చాలి. అలాగే ప్రీమియం రీఫండ్ కోసం చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి. రూ. 1 రెవెన్యూ స్టాంపును ఫారంపై అతికించి, పాలసీదారు సంతకం చేసి అందజేయాలి. ♦ ఫ్రీ లుక్ పీరియడ్ అంశాన్ని పక్కన పెట్టి.. పాలసీ పత్రాల విషయానికొస్తే, వీలైనంత వరకూ పాలసీ డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలు తీసి పెట్టుకోవడం మంచిది. మీకు నమ్మకమైన బంధువులెవరైనా ఉంటే వారి దగ్గరా ఒక కాపీ ఉంచవచ్చు. అలాగే, పాలసీని స్కాన్ చేసి డిజిటల్ రూపంలో భద్రపర్చుకోవచ్చు. ఒరిజినల్ పత్రాలను ల్యామినేట్ చేసి బ్యాంక్ సేఫ్ డిపాజిట్లో కూడా ఉంచవచ్చు. అగ్ని ప్రమాదాలో లేక ప్రకృతి వైపరీత్యాల్లోనో ఇంటికి ఏదైనా జరిగినా కూడా క్లెయిమ్ చేసుకునేందుకు మీ పాలసీ పత్రాలు భద్రంగా ఉంటాయి. ♦ సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా వచ్చే చోట నివసించే వారికి ఇలాంటి జాగ్రత్తలు చాలా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఇటీవ ల చెన్నైను వరదలు ముంచెత్తినప్పుడు బీమా క్లెయిమ్‌లు దాదాపు రూ. 2,500 కోట్లకు పైగా వచ్చాయి. కాబట్టి, ఇలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు బీమా పత్రాలన్నీ జాగ్రత్తగా ఉంచుకుంటేనే అసలు ప్రయోజనాలు పొందగలరు. టూకీగా చెప్పాలంటే.. పాలసీ దరఖాస్తులో ఎటువంటి తేడాలు లేకుండా నిజాయితీగా నింపాలి. నియమ నిబంధనలన్నింటినీ క్షుణ్నంగా చదువుకోవాలి. పాలసీ జారీ అయ్యాక బ్యాకప్ కాపీలను కనీసం రెండు సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపర్చుకోవాలి. -
వుడా డీఎఫ్‌వో ఇళ్లపై ఏసీబీ దాడులు
సాక్షి, విశాఖపట్నం: ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న అభియోగంపై వుడా డివిజినల్ ఫారెస్ట్ అధికారి (డీఎఫ్‌వో) శంబంగి రామ్మోహన్ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఆయన కార్యాలయం, స్నేహితులు, బంధువుల ఇళ్లపైనా ఏకకాలంలో పది బృందాలు తనిఖీలు చేయడం ఉత్తరాంధ్రలో సంచలనమైంది. విశాఖలోని శాంతిపురం రోడ్డు అక్షయ ఎన్క్లేవ్ (జీ-2)లో ఉత్తరాంధ్ర జిల్లాల ఏసీబీ డీఎస్సీ ఎం నర్సింగరావు ఆధ్వర్యంలో సోదాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో రామ్మోహన్ ఇంటి వద్దే ఉన్నారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న పావుకేజీ బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, రూ.7లక్షల విలువైన బీమా పత్రాలు, రూ.3 లక్షల నగదుతో పాటు కీలక పత్రాలు, హోండా కారును స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాలనుంచి ఏసీబీ అధికారులు విజయనగరం, శ్రీకాకుళం, పొదిలి, ప్రకాశం తదితర ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలకు దిగారు. రాత్రయినా తనిఖీలు కొనసాగాయి. రామ్మోహన్ కార్యాలయం, ఇళ్లపైనా సోదాలు ఇంకా పూర్తికాలేదని, ఇప్పటివరకూ తేలిన స్థిర, చర ఆస్తుల విలువ సుమారు రూ.1కోటిపైనే ఉంటుందని ఏసీబీ డీఎస్పీ నర్సింహరావు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.5 కోట్లు ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. నగరంలోని శాంతిపురం, మర్రిపాలెం, మిథిలాపురం కాలనీ ప్రాంతాల్లో ఆస్తుల విలువ ఇంకా మదింపు కావాల్సి ఉందన్నారు. బ్యాంకు లాకర్లు తనిఖీ చేయాల్సి ఉందని తెలిపారు. రామ్మోహన్ అరెస్టుకు రంగం సిద్ధమైందని తెలిసింది. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన రామ్మోహన్ 1990లో ఉద్యానవనశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టి అంచెలంచెలుగా ఎదిగారు. అటవీశాఖ నుంచి డెప్యుటేషన్‌పై గత మేలోనే వుడాలో చేరారు. గతంలో ఆయన డ్వామా పీడీ, మైక్రోవాటర్ స్కీం వంటి కీలక విభాగాల్లో పనిచేశారు. వుడాలోని రామ్మోహన్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులకు దిగడంతో ఆ విభాగంలోని ఇతర శాఖల సిబ్బంది, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఇతర ఆస్తులివి మధురవాడ స్టేడియం సమీపంలో తన స్నేహితుడు, బిల్డర్ వై. సత్యనారాయణ ఆధ్వర్యంలో డెవలప్ చేస్తున్న 16 ప్లాట్లు. విజయనగరం జిల్లా సాలూరులో రెండంతస్తుల భవనం. విశాఖలోని టీపీటీకాలనీలో త్రీబెడ్‌రూం ఫ్లాట్. విశాఖ జిల్లా వి. మాడుగులలో తన భార్య శ్రీదేవి పేరిట కొనుగోలు చేసిన 10ఎకరాల స్థలంలో ప్రస్తుతం పామాయిల్ తోటల్ని పెంచుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఖాళీ స్థలం. విశాఖలోని పరదేశీపాలెంలో 2001లో మూడెకరాల స్థలం కొనుగోలు చేశారు. విశాఖలోని మిథిలాపూర్ కాలనీలో విలువైన భవనం.