బీమా పత్రాలు కాస్త భద్రం!
భౌతికంగానే కాక... డిజిటల్ కాపీలూ ఉంచుకోండి
అవసరాలకు తగిన పాలసీని ఎంచుకోవడం, కొనుక్కోవడం అంత సులువేమీ కాదు. ప్రస్తుతం బోలెడన్ని కంపెనీలు అనేక రకాల పాలసీలు అందిస్తున్నాయి. పాలసీ తీసుకోవాలంటే దాని టర్మ్, ప్రీమి యం, కవరేజీ, మినహాయింపులు మొదలైనవన్నీ చూసుకోవడం తప్పనిసరి. దీనికే సమయం సరిపోతుంది. ఈ హడావుడిలో పడి పాలసీ కొనుక్కునేటప్పుడు కీలకమైన నియమ, నిబంధనలను, డాక్యుమెంటేషన్‌ను చాలా మంది పట్టించుకోరు. బీమా పాలసీ తీసుకుంటున్నప్పుడు నియమ, నిబంధనలన్నింటినీ క్షుణ్నంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక డాక్యుమెంటేషన్ విషయానికొస్తే... కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇదొక్కటే ఆధారం. ఎంత ప్రీమియం కడతాం? ఎంత కవరేజి ఉండబోతోంది? వంటి కీలకమైన సమాచారమంతా ఇందులోనే ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడే పట్టించుకోకపోతే.. ఆ తర్వాత ఇవే సమస్యలై కూర్చుంటాయి. అంతే కాదు! పాలసీని జాగ్రత్తగా భద్రపర్చుకోవడం కూడా కీలకమే.
ఇందుకోసం తీసుకోతగిన జాగ్రత్తల్లో కొన్ని..
♦ దరఖాస్తు నింపేటప్పుడే అన్ని సూచనలు సరిగ్గా చదువుకుని నింపాలి. అవసరమైన పత్రాలన్నింటినీ జత చేయాలి. కొన్ని కంపెనీలు ఎలక్ట్రానిక్ రూపంలోనూ అడుగుతుంటాయి.. కాబట్టి ముందుగానే నిర్దేశిత పత్రాలను స్కాన్ చేసి పెట్టుకుంటే పాలసీ తీసుకోవడంలో సమయం వృథా కాదు.
♦ వైద్య బీమా పాలసీలకు సంబంధించి కంపెనీలు ప్రస్తుతం ఫ్రీ లుక్ పీరియడ్ ఇస్తున్నాయి. ఇది సుమారు పది-పదిహేను రోజులుంటుంది. తనకు జారీ అయిన పాలసీపై సంతృప్తి చెందని పక్షంలో పాలసీదారు ఈ వ్యవధిలో దాన్ని రద్దు చేసుకోవచ్చు. ఫ్రీ లుక్ పీరియడ్‌లో రద్దు చేసుకున్నా పాలసీదారు కట్టిన మొత్తం ప్రీమియం వెనక్కి వచ్చేస్తుంది. ఎటువంటి పెనాల్టీలు ఉండవు. అయితే, ఈ వ్యవధిలో ఎటువంటి క్లైమ్ దాఖలవకుండా ఉండాలి. ఈ ఆప్షన్ ఉపయోగించుకోదల్చుకుంటే.. బీమా కంపెనీకి రాతపూర్వకంగా రిక్వెస్ట్ ఫారం సమర్పించాలి. దీన్ని ఆయా కంపెనీల వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పాలసీని వద్దనుకుంటే.. పాలసీ డాక్యుమెంటు అందిన తేదీ, ఏజంటు సమాచారం, రద్దు చేసుకుంటున్నందుకు కారణాలు మొదలైన వివరాలన్నీ ఫారంలో పొందుపర్చాలి. అలాగే ప్రీమియం రీఫండ్ కోసం చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి. రూ. 1 రెవెన్యూ స్టాంపును ఫారంపై అతికించి, పాలసీదారు సంతకం చేసి అందజేయాలి.
♦ ఫ్రీ లుక్ పీరియడ్ అంశాన్ని పక్కన పెట్టి.. పాలసీ పత్రాల విషయానికొస్తే, వీలైనంత వరకూ పాలసీ డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలు తీసి పెట్టుకోవడం మంచిది. మీకు నమ్మకమైన బంధువులెవరైనా ఉంటే వారి దగ్గరా ఒక కాపీ ఉంచవచ్చు. అలాగే, పాలసీని స్కాన్ చేసి డిజిటల్ రూపంలో భద్రపర్చుకోవచ్చు. ఒరిజినల్ పత్రాలను ల్యామినేట్ చేసి బ్యాంక్ సేఫ్ డిపాజిట్‌లో కూడా ఉంచవచ్చు. అగ్ని ప్రమాదాలో లేక ప్రకృతి వైపరీత్యాల్లోనో ఇంటికి ఏదైనా జరిగినా కూడా క్లెయిమ్ చేసుకునేందుకు మీ పాలసీ పత్రాలు భద్రంగా ఉంటాయి.
♦ సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా వచ్చే చోట నివసించే వారికి ఇలాంటి జాగ్రత్తలు చాలా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఇటీవ ల చెన్నైను వరదలు ముంచెత్తినప్పుడు బీమా క్లెయిమ్‌లు దాదాపు రూ. 2,500 కోట్లకు పైగా వచ్చాయి. కాబట్టి, ఇలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు బీమా పత్రాలన్నీ జాగ్రత్తగా ఉంచుకుంటేనే అసలు ప్రయోజనాలు పొందగలరు. టూకీగా చెప్పాలంటే.. పాలసీ దరఖాస్తులో ఎటువంటి తేడాలు లేకుండా నిజాయితీగా నింపాలి. నియమ నిబంధనలన్నింటినీ క్షుణ్నంగా చదువుకోవాలి. పాలసీ జారీ అయ్యాక బ్యాకప్ కాపీలను కనీసం రెండు సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపర్చుకోవాలి.