వీసా షాక్: టాప్ ఐటీ కంపెనీల నష్టమెంతంటే!
హెచ్-1బీ వీసా ఆందోళనతో టాప్ ఐటీ కంపెనీల మార్కెట్ విలువ భారీగా తుడిచిపెట్టుకుపోయింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్లు, రూ.22వేల కోట్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయినట్టు తెలిసింది. దీంతో బీఎస్ఈలో ఐటీ సబ్-ఇండెక్స్ సుమారు 3 శాతం వరకు పతనమైంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ 3.5 శాతం, ఇన్ఫోసిస్ 2.5 శాతం, టీసీఎస్ 2 శాతం, విప్రో 2 శాతం నష్టపోయినట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. హెచ్-1బీ వీసాల్లో దుర్వినియోగాలను అరికట్టడానికి వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు అమెరికా ముమ్మురం ప్రయత్నాలు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో హెచ్1బి వీసాల్లో కీలక మార్పులు చేసేందుకు ఉద్దేశించిన ‘అమెరికా ఉద్యోగాల పరిరక్షణ, పెంపు చట్టం (ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్)’ బిల్లును కాంగ్రెస్లో మళ్లీ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో వీసా దుర్వినియోగాన్ని ఆపివేయొచ్చని బిల్లును ప్రవేశపెట్టిన యూఎస్ కాంగ్రెస్ సభ్యులు చెప్పారు. అమెరికా ఉద్యోగాలు అమెరికాకే అనే నినాదంతో అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన బాధ్యతలు చేపట్టేందుకు కొన్ని రోజుల ముందు నుంచే వీసా నిబంధనలపై కఠిన చర్యలను ప్రారంభించేశారు. వీసా నిబంధనలు కఠినతరం చేస్తే అగ్రశ్రేణి టెక్ కంపెనీలకు లాభాలు గండికొట్టే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెప్పారు. దీంతో దేశీయ ఐటీ కంపెనీల్లో హెచ్-1బీ వీసా ఆందోళనలు నెలకొన్నాయి. ఐటీ షేర్ల పతనానికి ప్రధాన కారణం హెచ్-1బీ వీసాలో నెలకొన్న ఆందోళనలే ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యురిటీసీ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ చెప్పారు. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే, ఐటీ కంపెనీ ఈబీఐటీడీఏ మార్జిన్లపై 150 బేసిస్ పాయింట్ల వరకు ప్రభావం చూపనుందని పేర్కొన్నారు..