ఒక్క రోజులోనే లుపిన్ కు రూ.5500 కోట్ల లాస్
ఒక్క రోజులోనే లుపిన్ కు రూ.5500 కోట్ల లాస్
Published Thu, May 25 2017 6:52 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM
దేశంలో మూడో అతిపెద్ద డ్రగ్ తయారీదారి లుపిన్ మార్కెట్ విలువ భారీగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్కరోజులోనే దీని మార్కెట్ విలువ సుమారు రూ.5500 కోట్ల మేర తగ్గిపోయింది. ధరల ఒత్తిడి పెరగడంతో పాటు, ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కేర్ మార్కెట్ అయిన అమెరికాలో పోటీవాతావరణం తీవ్రంగా పెరుగడంతో కంపెనీ రెవెన్యూ వృద్ధి స్తబ్దుగా నమోదైంది. దీంతో లుపిన్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. ఫలితాలను కూడా చాలా బలహీనంగా కంపెనీ ప్రకటించింది. కంపెనీ నికర లాభం 49 శాతం క్షీణించి రూ.380 కోట్లకు పరిమితమయ్యాయి.
దీంతో గురువారం ట్రేడింగ్ లో ఈ కంపెనీ షేర్లు 10 శాతం మేర నష్టపోయాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ విలువ కూడా భారీగా క్షీణించింది. ఉత్తర అమెరికా అమ్మకాలు లుపిన్ కు నాలుగో క్వార్టర్ లో 13 శాతం పడిపోయాయి. దీంతో గతేడాది రూ.780 కోట్లగా ఉన్న లాభాలు ఈ ఏడాది రూ.380 కోట్లగా నమోదయ్యాయి. అమెరికా వ్యాపారాలు అంచనావేసిన దానికంటే తక్కువగా ఉండటంతో, ఒక్కోషేరుపై ఆర్జించే ఆదాయాలపై కూడా బ్రోకరేజ్ సంస్థలు కోత పెడుతున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి లుపిన్ షేర్లు 7.18 శాతం దిగువకు 1,140.20గా ఉన్నాయి.
Advertisement