‘చైనా యాపిల్’ మార్కెట్ విలువ రూ.2.83 లక్షల కోట్లు
బీజింగ్: చైనా యాపిల్‌గా పేరు తెచ్చుకున్న షియోమి కంపెనీ మార్కెట్ విలువ రూ. 2.83 లక్షల కోట్లు (45 బిలియన్ డాలర్లు) దాటింది. గత వారం ఐదో విడత నిధుల సేకరణ తర్వాత కంపెనీ విలువ 45 బిలియన్ డాలర్లకు చేరినట్లు షియోమి ఫౌండర్ సీఈవో లే జన్ తెలిపారు. గత వారం షియోమి 1.1 బిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. ఈ నిధులతో కొత్త ప్రోడక్టులను అభివృద్ధి చేయనున్నామని, జనవరిలో మరింత అధునాతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు జన్ తెలిపారు.
ఈ స్మార్ట్ ఫోన్ వివరాలను మాత్రం ఆయన తెలియచేయలేదు. స్థానిక మీడియా కధనాల ప్రకారం షియోమీ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 5.3% వాటాతో షియోమీ మూడో స్థానంలో ఉంది. 23.8% వాటాతో సామ్‌సంగ్ మొదటి స్థానంలో, 12% వాటాతో యాపిల్ రెండో స్థానంలో ఉన్నాయి.