China Apple
-
సై అంటున్న చైనా యాపిల్
చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి కార్పొరేషన్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించేందుకు సై అంటోంది. ఎంఐ మాక్స్ పేరుతో ఏకంగా 6.44 అంగుళాల భారీ స్క్రీన్ ఉన్న ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇది 7.5 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఇందులో అధిక సామర్థ్యం కలిగిన 4850 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. దీనివల్ల ఫోన్ బ్యాటరీ బ్యాకప్ త్వరగా అయిపోతుందన్న భయం అక్కర్లేదు. ఈ కొత్త ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. అవి 32 జీబీ, 64 జీబీ, 128 జీబి. బేస్ మోడల్ ఒక్కదాంట్లో స్నాప్‌డ్రాగన్ 650 చిప్సెట్ ఉండగా, మిగిలిన రెండింటిలో స్నాప్‌డ్రాగన్ 652 చిప్సెట్ ఉంటుంది. 128 జీబీ మోడల్లో 4 జీబీ ర్యామ్ ఉండగా మిగిలిన రెండింటికీ 3జీబీ ర్యామ్ ఉంటుంది. దీని స్క్రీన్ సైజు, ఇతర పారామీటర్లకు అనుగుణంగానే ధర కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. 32 జీబీ మోడల్ రూ. 15350, 64 జీబీ మోడల్ అయితే రూ. 17,400, 128 జీబీ మోడల్ అయితే రూ. 20,450 చొప్పున ధర నిర్ణయించారు. వీటన్నింటిలోనూ 16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. వీటితోపాటు ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జి డ్యూయల్ సిమ్, 4850 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా మూడు వేరియంట్లలోను ఉన్నాయి. తెలుపు, బంగారు, ఊదా రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ఇందులో ఎంఐయుఐ వెర్షన్ 8 ఉండటంతో.. కొత్త డిజైన్ ఉంటుందని, దాంతోపాటు గ్యాలరీ, నోట్స్, కాలిక్యులేటర్, స్కానర్ లాంటి అన్నీ అప్ డేట్ అయ్యాయని అంఉటన్నారు. అయితే ఇది మార్కెట్లలోకి ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం ఇంకా తెలియలేదు. -
షియోమి ఎంఐ4 ధర రూ. 2వేలు తగ్గింపు
చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి కంపెనీ తన ఎంఐ4 ఫోన్ ధరను భారతీయ మార్కెట్లలో రూ. 2 వేలు తగ్గించింది. ఎంఐ4 16 జిబి వేరియంట్ ధర రూ. 19,999 ఉండగా.. దాన్ని రూ. 17,999కి తగ్గించారు. అలాగే 64 జిబి వేరియంట్ ధర రూ. 23,999 ఉండగా దాన్ని కూడా 2 వేలు తగ్గించి రూ. 21,999 చేశారు. ఈ కొత్త ధరలు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మొబైల్ స్టోర్‌లో కూడా అమలవుతాయి. ఈ విషయాన్ని షియోమి ఇండియా అధినేత మను కుమార్ జైన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. -
షియోమి నుంచి రెడ్ ఎంఐ 2 విడుదల
చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి కంపెనీ కొత్తగా మరో రెండు డివైజ్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. రెడ్ ఎంఐ2 అనే స్మార్ట్ ఫోన్‌తో పాటు.. ఎంఐ ప్యాడ్ టాబ్లెట్ పేరుతో మొట్టమొదటి టాబ్‌ను కూడా విడుదల చేసింది. వీటింలో రెడ్ ఎంఐ 2 ధరను రూ. 6999గా నిర్ణయించారు. దీని రిజిస్ట్రేషన్ గురువారం సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 24వ తేదీన ఫ్లాష్ అమ్మకాలు ఉంటాయి. మొదటి విడతలో 30 వేల నుంచి 40 వేల ఫోన్లు అమ్మే అవకాశం ఉన్నట్లు షియోమి ఇండియా హెడ్ మను జైన్ చెప్పారు. ఇందులో 4.7 అంగుళాల డిస్ప్లే, క్వాడ్ కోర్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 4జి డ్యూయల్ సిమ్ ఉంటాయి. వెనుక కెమెరా 8 మెగాపిక్సెల్స్, ఫ్రంట్ కెమెరా 2 మెగాపిక్సెల్స్ ఉన్నాయి. ఇక ఎంఐ ప్యాడ్ ధరను రూ. 12,999గా నిర్ణయించారు. దీనికి 7.9 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా మార్చి 24నే అమ్మకానికి వస్తుంది. అయితే వీటిలో కేవలం వై-ఫై ఆధారంగానే నెట్ అందుబాటులోకి వస్తుంది. -
షియోమీ ఎంఐ4 మొబైల్ రూ. 19,999
ఫిబ్రవరి 10 నుంచి విక్రయాలు న్యూఢిల్లీ: చైనా ‘యాపిల్’గా పేరొందిన షియోమీ... తాజాగా దేశీ మార్కెట్లో ఎంఐ4 ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 19,999. ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి షియోమీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎంఐ4లో 5 అంగుళాల తెర, 2.5 గిగాహెట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్, 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 3,080 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇందులో అదనపు ప్రత్యేకతలు. జనవరి 28 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా విక్రయాలు ఫిబ్రవరి 10 నుంచి మొదలవుతాయి. తమ యూజర్ ఇంటర్‌ఫేస్‌కి కొత్త అప్డేట్ ఎంఐయూఐ 6ని రూపొందించనున్నట్లు షియోమీ ఇండియా హెడ్ మనూ జైన్ తెలిపారు. మరోవైపు, బెంగళూరులో తమ పరిశోధన , అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చప్పారు. సొంత పోర్టల్‌తో విక్రయాలు.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా తమ స్మార్ట్‌ఫోన్స్‌ను విక్రయిస్తున్న షియోమీ ఇకపై తమ సొంత వెబ్సైట్ ద్వారా అమ్మకాలు జరపాలని యోచిస్తున్నట్లు మను జైన్ చెప్పారు. ఇందులో భాగంగా తమ ఎంఐడాట్‌కామ్ పోర్టల్‌ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో భారత్‌లోనూ అందుబాటులోకి తేనున్నట్లు ఆయన వివరించారు. -
‘చైనా యాపిల్’ మార్కెట్ విలువ రూ.2.83 లక్షల కోట్లు
బీజింగ్: చైనా యాపిల్‌గా పేరు తెచ్చుకున్న షియోమి కంపెనీ మార్కెట్ విలువ రూ. 2.83 లక్షల కోట్లు (45 బిలియన్ డాలర్లు) దాటింది. గత వారం ఐదో విడత నిధుల సేకరణ తర్వాత కంపెనీ విలువ 45 బిలియన్ డాలర్లకు చేరినట్లు షియోమి ఫౌండర్ సీఈవో లే జన్ తెలిపారు. గత వారం షియోమి 1.1 బిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. ఈ నిధులతో కొత్త ప్రోడక్టులను అభివృద్ధి చేయనున్నామని, జనవరిలో మరింత అధునాతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు జన్ తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్ వివరాలను మాత్రం ఆయన తెలియచేయలేదు. స్థానిక మీడియా కధనాల ప్రకారం షియోమీ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 5.3% వాటాతో షియోమీ మూడో స్థానంలో ఉంది. 23.8% వాటాతో సామ్సంగ్ మొదటి స్థానంలో, 12% వాటాతో యాపిల్ రెండో స్థానంలో ఉన్నాయి. -
ఇక షాపుల్లో షియోమీ ఫోన్లు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న చైనా కంపెనీ షియోమీ ఆఫ్‌లైన్ బాట పడుతోంది. ఇప్పటి వరకు కేవలం ఆన్లైన్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా వివిధ మోడళ్లను భారత్‌లో విక్రయించిన ఈ చైనా ఆపిల్.. కొద్ది రోజుల్లో దేశీయ మార్కెట్లో రిటైల్ షాపుల్లోనూ దర్శనమీయనుంది. భారత్‌తోపాటు పలు దేశాల్లో హల్చల్ చేస్తున్న షియోమీ మొబైళ్లు సంప్రదాయ దుకాణాలకు చేరితే సంచలనాలు నమోదవడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. తమ కంపెనీ ఫోన్ల కోసం ప్రతివారం 2 నుంచి 3 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయని షియోమీ ఇండియా హెడ్ మను జైన్ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే రోజున 1.75 లక్షల పీసులు విక్రయించామన్నారు. అయితే ఇటీవల ఆవిష్కరించిన రెడ్మి నోట్ 4జీ మోడల్ ఎయిర్టెల్ ఔట్లెట్లలో డిసెంబర్ నుంచి లభించనున్న సంగతి తెలిసిందే. రెడ్మి నోట్, మి 3, రెడ్మి 1ఎస్ కంపెనీ ఇతర మోడళ్లు. అభిమానులు పెరుగుతున్నారు.. షియోమీ అభిమానులు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నారని సంస్థ వైస్ ప్రెసిడెంట్ హ్యూగో బరా అంటున్నారు. భారత్‌లో ఆఫ్‌లైన్ అమ్మకాల్లోకి త్వరలోనే ప్రవేశిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక్కడి స్టార్టప్, అప్లికేషన్ డెవలపర్లు, సర్వీస్ ప్రొవైడర్లతో కలసి పని చేస్తామని చెప్పారు. ఇండోనేసియాలో గురువారం జరిగిన స్టార్టప్ ఆసియా జకార్తా 2014 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఇండోనేసియాలోని ఇరాజయకు చెందిన రెండు స్టోర్లలో ఒకే రోజు 2,000 ఫోన్లు విక్రయించాం. ఆఫ్లైన్లోనూ స్పందన ఉందనడానికి ఇదే నిదర్శనం’ అని చెప్పారు. గూగుల్ వన్ ఫోన్ తయారీ ప్రాజెక్టులో పాలుపంచుకోవడం ఖాయమన్నారు. కాగా, ఒక ఉత్పత్తిని కొన్ని గంటలు మాత్రమే విక్రయించే ఫ్లాష్ సేల్స్/డీల్ ఆఫ్ ద డే విధానం అన్ని సందర్భాల్లోనూ భారత్‌లో విజయవంతం కాదన్నది పరిశీలకుల మాట. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌టెల్‌తో షియోమీ జత కలిసిందని వారంటున్నారు. -
చైనా యాపిల్.. షియోమి వచ్చేసింది
న్యూఢిల్లీ: చైనా యాపిల్‌గా పేరు గాంచిన షియోమి కంపెనీ మంగళవారం భారత మార్కెట్లోకి అడుగిడింది. ఎంఐ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. చైనాలో బాగా ప్రాచుర్యం పొందిన ఎంఐ స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,999కు అందిస్తోంది. వీటి విక్రయాలను ఈ నెల 22 నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. ఈ ఫోన్ల కొనుగోళ్లకు ముందస్తు రిజిస్ట్రేషన్లు ఇప్పటికే మొదలయ్యాయని, ఈ నెల 21 వరకూ రిజిస్టర్ చేసుకున్న వారే ఎంఐ 3 కొనుగోళ్లకు అర్హులని వివరించింది. ఎంఐ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్ ఆధారంగా షియోమి కస్టమైజ్ చేసిన ఎంఐయూఐ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్లో 5 అంగుళాల ఫుల్ హెచ్డీ 1080పి ఐపీఎస్ డిస్ప్లే, 2.3 గిగా హెర్ట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్, 800 ఏబీ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇం టర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3,050ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం ఉత్పత్తుల విక్రయాల కోసం షియోమి కంపెనీ ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా 35 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మరికొన్ని వారాల్లో రెడ్ఎంఐ 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను, రెడ్ఎంఐ నోట్(ఫ్యాబ్లెట్)లను అందించనున్నామని తెలిపింది. 4.7 అంగుళాల రెడ్ఎంఐ 1ఎస్ ఫోన్‌ను రూ.6,999కు, 5.5 అంగుళాల డిస్ప్లే ఉన్న రెడ్ఎంఐ నోట్‌ను రూ.9,999కు విక్రయిస్తామని పేర్కొంది. షియోమి రెడ్ ఎంఐ 1 ఎస్ ఫోన్లో 4.7 అంగుళాల డిస్ప్లే, 1.6 గిగా హెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1. 6 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఇక రెడ్ఎంఐ నోట్ ఫ్యాబ్లెట్‌లో 5.5 అంగుళాల డిస్ప్లే, 1.7 గిగా హెర్ట్జ్మీడియా టెక్ ఆక్టకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. రానున్న నెలల్లో 4 కే అల్ట్రా హెచ్డీ టీవీలను, సౌండ్ బార్లను, పవర్ బ్యాంక్లనూ ఈ కంపెనీ భారత మార్కెట్లోకి తేనుంది.