ముంబై: ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ షేరు సోమవారం కొత్త రికార్డు నెలకొల్పింది. బీఎస్‌ఈలో 1.2% లాభపడటం ద్వారా చరిత్రాత్మక గరిష్టం రూ. 2,048 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) తొలిసారి రూ. 4 లక్షల కోట్లను అధిగమించింది. ఒక దేశీయ కంపెనీ ఈ స్థాయి మార్కెట్ విలువను సాధించడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతక్రితం అంటే 2007 అక్టోబర్‌లో ముకేశ్ అంబానీ గ్రూప్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) మాత్రమే ఈ ఫీట్‌ను సాధించింది. కాగా, సోమవారం ట్రేడింగ్ ముగిసేసరికి టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 4,00,868 కోట్లకు చేరగా, ఆర్‌ఐఎల్ విలువ రూ. 2.85 లక్షల కోట్లుగా నమోదైంది.