
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్న జిల్లా కేంద్రాల్లో స్థిరాస్తి మార్కెట్ విలువల్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరించనుంది. జిల్లాల నోటిఫికేషన్ వెలువడి నూతన జిల్లా కేంద్రాలు ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ మార్కెట్ విలువలు మారేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధారణంగా ఏటా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో మార్కెట్ విలువల్ని సవరిస్తారు. గతేడాది కోవిడ్ నేపథ్యంలో సవరణను వాయిదా వేశారు. 2022 ఏప్రిల్ వరకు సవరణ ఉండదని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు ఆ గడువు ముగుస్తుండడంతో సవరణ కోసం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి రెండు విడతలుగా మార్కెట్ విలువల సవరణపై కసరత్తు మొదలు పెట్టారు. మొదట కొత్తగా ఏర్పడుతున్న జిల్లా కేంద్రాల్లో మార్కెట్ విలువలపై కసరత్తు చేశారు. ఆ తర్వాత వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ విలువల సవరణపైనా కసరత్తు పూర్తి చేశారు.
వృద్ధి ఆధారంగా మార్కెట్ విలువల సవరణ
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏ ప్రాంతంలో ఎంత పెంచాలి? ఆ ప్రాంతాల్లో జరిగిన వృద్ధి, కొత్తగా వచ్చిన పరిశ్రమలు, పెరిగిన వ్యాపారం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్ విలువల్ని ప్రతిపాదించారు. వాటికి జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలు తాత్కాలిక అనుమతులు ఇచ్చాయి. వాటిని రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు.
ఆ తర్వాత కొద్దిపాటి మార్పులు చేసి మార్కెట్ విలువల్ని నిర్ధారించారు. ఆ విలువలకు జేసీ కమిటీల నుంచి తుది ఆమోదం కూడా తీసుకున్నారు. ఏ క్షణమైనా మార్కెట్ విలువల్ని సవరించడానికి అనువుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ కూడా చేసుకుని అమలు చేయడానికి రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లా కేంద్రాల పరిధిలో స్థిరాస్తి మార్కెట్ విలువల సవరణ అమలవుతుందని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లా కేంద్రాలు ప్రకటించాక ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, స్థిరాస్తి లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.