జిల్లా కానుందని తొందరొద్దు!
సాక్షి, హైదరాబాద్ : స్థిరాస్తి మార్కెట్ చిత్రమైంది. అభివృద్ధికి సంబంధించిన వార్తలు వెలువడిన ప్రతీసారి ధరలకు రెక్కలొస్తాయి. ఆ తర్వాత అంతే జోరుగా పడిపోతాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు ర చించింది. దీంతో రాత్రికి రాత్రే జిల్లా కేంద్రాల్లో స్థిరాస్తి ధరలు హద్దులు దాటేశాయి. ఇంకా చెప్పాలంటే వరంగల్, కరీంనగర్ వంటి జిల్లాల్లో హైదరాబాద్‌లోని ప్రైమ్ లొకేషన్‌లో లేనంత రేట్లు చెబుతున్నారు స్థానిక డెవలపర్లు. అయితే స్థిరాస్తి మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని.. అదే సమయంలో గతంలో భాగ్యనగర స్థిరాస్తి మార్కెట్ అనుభవాలనూ గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు కొనకపోతే ఇక భవిష్యత్తులో కొనలేమనే తొందర్లో.. అప్పు తెచ్చి మరీ అసలే కొనొద్దని సలహా ఇస్తున్నారు.
విమానాశ్రయం పేరిట..
గతంలో హైదరాబాద్‌లో కొత్త విమానాశ్రయం ఏర్పాటవుతుందనే వార్త కొన్ని ప్రాంతాల్లో షికారు చేసింది. ముందుగా కరీంనగర్ రోడ్డులో వస్తుందన్నారు.. ఆ తర్వాత దుండిగల్ విమానాశ్రయం పక్కనే అన్నారు.. మరికొంతకాలమయ్యాక పటాన్‌చెరు వద్ద ఇక్రిశాట్.. ఆ తర్వాత కీసర.. ఇలా పుకార్లు వ్యాపించిన ప్రాంతాల్లో భూముల ధరలు రెండు, మూడు రెట్లు అమాంతం పెరిగాయి. తర్వాత త గ్గుముఖం పట్టాయి. కాకపోతే అధిక ధరకు స్థలం కొన్నవారు.. మరింత రేటు పెరగడానికి చాలా కాలం ఎదురుచూశారు. కొన్ని ప్రాంతాల్లో నేటికీ కొందరు వేచి చూస్తున్నారు.
నేటికీ హైటెక్‌సిటీలో అదే ధర..
మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ ఆరంభమైంది 1995లో. అప్పట్లో గజం ధర రూ.5 వేలు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా తక్కువే ఉండేది. దాదాపు ఏడేళ్ల వరకూ ఇంచుమించు ఇదే ధర కొనసాగింది. 2003లో సంస్థలు పెరిగాయి. ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది. వేరే రాష్ట్రాల నుంచి నిపుణులు రావటం మొదలైంది. ఇతర వ్యాపారాలు జోరందుకున్నాయి. ఇక అప్పట్నుంచి స్థలం ధర పెరుగుతూ 2006 నాటికి గజం రేటు రూ.50 వేలు అయ్యింది. కాకపోతే అప్పట్నుంచి రేటు పెరిగిన దాఖలాల్లేవు. ప్రస్తుతమూ ఇదే ధర కొనసాగుతోంది.
మహేశ్వరంలో ఎదురుచూపులు..
మహేశ్వరంలో.. మార్కెట్ పెద్దగా లేనప్పుడు 1997లో ఎకరం ధర లక్ష వరకుండేది. 2005లో బూమ్ ఏర్పడింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, హార్డ్‌వేర్ పార్క్, ఫ్యాబ్‌సిటీ, ముచ్చర్ల ఐటీ పార్క్ వంటివి వస్తున్నాయనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో మహేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది భూములు కొనడానికి తిరిగేవారు. ఉదయమున్న రేటు సాయంత్రం ఉండేది కాదు. అగ్రిమెంట్ల మీద ఒప్పందాలు జరిగేవి. యజమానులెవరో తెలియదు. అసలు అవి ఎలాంటి భూములో తెలియదు. అయినా కొనేశారు. ఈ క్రమంలో ఎకరం ధర రూ.60 లక్షల నుంచి కోటి రూపాయలు దాటింది. అక్కడ కొనకపోతే ఏదో జాక్‌పాట్ పోయినట్టు భావించేవారు. వేలంవెర్రిగా ఫ్లాట్లను కొన్నారు. ఇప్పుడేమో ధర ఎప్పుడు పెరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు.