రూ.32,000 కోట్లు! | Assess the value of the public lands | Sakshi
Sakshi News home page

రూ.32,000 కోట్లు!

Published Mon, Apr 13 2015 3:54 AM | Last Updated on Sun, Sep 3 2017 12:13 AM

Assess the value of the public lands

జిల్లాలోని ప్రభుత్వ భూముల విలువ అంచనా
 జిల్లా వ్యాప్తంగా 1.29లక్షల ఎకరాలున్నట్టు గుర్తింపు
 ఇటీవలే కసరత్తు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం
 దేవరకొండ డివిజన్‌లో అత్యధికంగా 33వేల ఎకరాలు
 సూర్యాపేటలో అత్యల్పంగా 18వేలకు పైన
 మొత్తం భూముల్లో 3,720 ఎకరాలు పరిశ్రమలకు అనుకూలం
 మరో 8,700 ఎకరాలు అటవీ భూముల పరిహారానికి
 ఉపయోగపడే అవకాశం

 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఎన్ని ప్రభుత్వ భూములున్నాయి? ఎన్ని వేల ఎకరాలు ఎక్కడున్నాయి? వాటి విలువ ఎంత ? అనే అంశాలు అందరికీ ఆసక్తి కలిగించేవే. ఎంత ఆసక్తి కలిగించే అంశమైనా అసలు ఈ ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయో గణన చేసేందుకు, ఓ నిర్ధారణకు వచ్చేందుకు ప్రభుత్వాలు అంతగా ఆసక్తి చూపవు. కానీ, మన జిల్లా యంత్రాంగం మాత్రం ఇటీవల పరిణామాల నేపథ్యంలో అసలు జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలేంటనే దానిపై దృష్టి పెట్టింది. రెవెన్యూ డివిజన్ల వారీగా ఉన్న ప్రభుత్వ భూములను లెక్కకట్టింది.
 
 రెవెన్యూ అధికారులు కట్టిన లెక్కల ప్రకారం జిల్లాలో దాదాపు 1.30లక్షల ప్రభుత్వ భూములున్నాయట... వాటి విలువ ఎంతో తెలుసా... అక్షరాలా 32వేల కోట్ల రూపాయలు.  సూర్యాపేట మినహా అన్ని డివిజన్లలో 20వేల ఎకరాలకుపైనే లెక్క తేలిన ప్రభుత్వ భూములున్నట్లు గుర్తించారు. ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 1,29,672 ఎకరాల భూములున్నట్టు గుర్తించారు. ఇందులో దేవరకొండ డివిజన్‌లో అత్యధికంగా 33,263 ఎకరాలు, సూర్యాపేట డివిజన్‌లో అత్యల్పంగా 18,388 ఎకరాలున్నాయి. నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో 29,878, భువనగిరి డివిజన్‌లో 21,165, మిరా్యాలగూడ పరిధిలో 26,978 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి.
 
 అంటే ఒక్క సూర్యాపేట డివిజన్‌లో మినహా అన్ని చోట్లా 20వేల ఎకరాలకు పైగానే ప్రభుత్వ భూములున్నాయన్నమాట. ఇందులో పారిశ్రామిక అవసరాలకు జిల్లా వ్యాప్తంగా 3,720 ఎకరాలు ఉపయోగపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో అత్యధికంగా భువనగిరి డివిజన్‌లోనే 1,951 ఎకరాలు, మిర్యాలగూడ డివిజన్ పరిధిలో 1,583 ఎకరాలున్నాయి. సూర్యాపేటలో 144, నల్లగొండలో 25 ఎకరాలుండగా, దేవరకొండ డివిజన్‌లో పారిశ్రామిక అవసరాలకు కేవలం 17 ఎకరాలు మాత్రమే ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అక్కడి మార్కెట్, ఇతరత్రా పరిస్థితులను బేరీజు వేసుకుని భూముల విలువను అంచనా వేసినట్లు తెలుస్తోంది.
 
 ఇంకా 8వేల ఎకరాల అటవీ భూమి తీసుకోవచ్చు..
 ఇక, అటవీభూములకు పరిహారంగా ఇవ్వదగిన భూములు 8,709 ఎకరాలున్నట్టు కూడా రెవెన్యూ అధికారుల గణనలో తేలింది. అంటే ప్రభుత్వ భూమి ఎంత ఉన్నా అటవీభూములకు పరిహారంగా ఇవ్వదగిన భూములకు సంబంధించి ప్రత్యేక నిబంధనలుంటాయి. ఈ నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో 8,709 ఎకరాలున్నాయని అధికారులు గుర్తించారు. అంటే జిల్లాలో ఉన్న అటవీభూముల నుంచి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైతే మరో 8వేల ఎకరాలకు పైగా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మేరకు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి కనుక.. ఆ భూములకు పరిహారంగా ఈ భూములను ఇవ్వొచ్చు.
 
 ప్రభుత్వానికి నివేదిక..
 ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఇటీవల సేకరించిన ప్రభుత్వ భూముల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాలో అనేక పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దామరచర్ల మండలంలోని దిలావర్‌పూర్ అటవీ ప్రాంతంలోదాదాపు 10వేల ఎకరాల్లో 6,700 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు దాదాపు అన్ని అనుమతులు వచ్చేశాయి. ఇక, రాచకొండ గుట్టల్లోని భూముల్లో కూడా చిత్రపరిశ్రమ, ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు తయారుచేస్తోంది. యాదగిరిగుట్టను దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు మరో 1500 ఎకరాలు అధికారులు గుర్తించారు. ఈ కోణంలో జిల్లాలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశముందని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ భూములను లెక్కకట్టి, తమ వద్ద ఇంత భూమి అందుబాటులో ఉందని ప్రభుత్వానికి చెప్పడం ద్వారా మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందనే ఆలోచనతోనే భూమల వివరాలను సేకరించినట్టు అధికారులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement