రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచొద్దు | Cabinet panel favours revision of land prices, registration fee | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచొద్దు

Published Sat, Jul 3 2021 5:24 AM | Last Updated on Sat, Jul 3 2021 5:24 AM

Cabinet panel favours revision of land prices, registration fee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి. మార్కెట్‌ విలువ సవరణలను స్వాగతిస్తూనే.. రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంపును మాత్రం డెవలపర్ల సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. విలువ, చార్జీలు రెండూ ఒకేసారి పెంచితే కొనుగోలుదారుల మీద తీవ్రమైన భారం పడుతుందని.. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోగా బ్లాక్‌మార్కెట్‌కు ఊతమిచ్చినట్లే అవుతుందని అభిప్రాయపడ్డాయి. 2013 ఆగస్టులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా విలువల సవరణ జరిగింది. ప్రతీ రెండేళ్లకొకసారి రిజిస్ట్రేషన్‌ విలువలను సమీక్షించి.. కొత్త విలువలను నిర్ధారించాలని చట్టంలో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని జోలికి వెళ్లలేదు. రాష్ట్రంలో జరిగిన పాలనాపరమైన సంస్కరణల కారణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణ ప్రాంతాలలో భూములు, ఆస్తులతో పాటు గ్రామీణ ప్రాంతా లలో వ్యవసాయ భూముల విలువ భారీగా పెరిగాయి. ప్రధానంగా ఏడేళ్లలో హైదరాబాద్‌ చుట్టుప్రక్కల ప్రాంతాలు, హెచ్‌ఎండీఏ పరిధిలోని భూములు, ఆస్తుల విలువలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆదాయం పెంపునకు ప్రభుత్వం అధికారిక విలువల సవరణకు, రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపునకు నిర్ణయించింది.

సర్వే నంబర్ల వారీగా విలువల సవరణ..
ప్రస్తుతం తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ చార్జీలు 6 శాతంగా ఉన్నాయి. ఇందులో స్టాంప్‌ డ్యూటీ 4 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వం సవరించనున్న భూముల మార్కెట్‌ విలువలను శాస్త్రీయ పద్ధతిలో సవరించాల్సిన అవసరముందని ఓ రిటైర్డ్‌ సబ్‌రిజిస్ట్రార్‌ సూచించారు. ఏ ప్రభుత్వం మార్కెట్‌ విలువలను పెంచినా సరే గ్రామాన్ని యూనిట్‌ ప్రాతిపదికన తీసుకుని సవరిస్తుంటుంది. ప్రధాన రహదారి వెంబడి ఉన్న సర్వే నంబర్లు మినహా మిగిలిన గ్రామం అంతా ఒకటే విలువ ఉంటుంది. అందుకే అంతర్గత రోడ్లు, అభివృద్ధి కార్యకలాపాలు జరిగే సర్వే నంబర్ల వారీగా మార్కెట్‌ విలువలు పెంచాలి. దీంతో లావాదేవీలను బట్టి చార్జీలు వసూలవడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది.

మహారాష్ట్రను ఆదర్శంగా తీసుకోవాలి..
కరోనా సమయంలో గృహ కొనుగోలుదారులకు ఉత్సాహం నింపేందుకు, అదే సమయంలో ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు మహారాష్ట్ర, పుణే, కర్ణాటక రాష్ట్రాలు స్టాంప్‌డ్యూటీని 3 శాతం తగ్గించాయి. మహారాష్ట్ర, పుణేలలో అన్ని రకాల గృహాలకు స్టాంప్‌డ్యూటీ మినహాయింపునిస్తే.. కర్ణాటకలో మాత్రం రూ.35 లక్షల లోపు ధర ఉన్న గృహాలకు వెసులుబాటు కల్పించింది. మహారాష్ట్రలో గతేడాది డిసెంబర్‌లో మినహాయింపు ప్రారంభం కాగా ప్రతి నెలా రిజిస్ట్రేషన్లు మూడెంకల వృద్ధిని సాధించాయి. డిసెంబర్‌లో 204 శాతం, ఈ ఏడాది మేలో 2,489 శాతం, జూన్‌లో 327 శాతం వృద్ధి చెందాయి. ఆదాయం పెంపు అన్వేషణలో తెలంగాణ ప్రభుత్వం కూడా మహారాష్ట్ర విధానాన్ని అవలంభించాలని పలువురు డెవలపర్లు సూచించారు. మార్కెట్‌ విలువను పెంచి రిజిస్ట్రేషన్‌ చార్జీలను 3 శాతానికి తగ్గిస్తే రెట్టింపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు.

చెంపదెబ్బ గోడదెబ్బ రెండూ తగుల్తయ్‌..
రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలలో బ్లాక్, వైట్‌ మనీ అంతరాన్ని తగ్గించాలంటే మార్కెట్‌ విలువ సవరణతోనే సాధ్యమవుతుంది. అయితే ఇదే సమయంలో రిజిస్ట్రేషన్‌ చార్జీలను కూడా పెంచితే కొనుగోలుదారులకు చెంపదెబ్బ గోడ దెబ్బ రెండూ తగుల్తయ్‌. దీంతో మళ్లీ బ్లాక్‌ మార్కెట్‌ దారిలో లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరిగితే వ్యక్తిగత ఆస్తుల విలువ పెరగదు. మార్కెట్‌ విలువలు పెరగడం వల్ల ప్రాపర్టీల అసెట్‌ వ్యాల్యూ పెరుగుతుంది. దీంతో ఆర్థిక సంస్థలు ఎక్కువ మొత్తంలో రుణాలను మంజూరు చేస్తాయి. మార్కెట్‌ విలువలు పెరగడం వల్ల 6–12 నెలల పాటు లావాదేవీలు తగ్గిపోతాయి. అప్పటివరకు రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచొ ద్దు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ లావాదేవీల సంఖ్య తగ్గుతాయేమో కానీ ఆదాయం విలువ మాత్రం పెరుగుతుంది.
– నరేంద్రకుమార్‌ కామరాజు, ఎండీ, ప్రణీత్‌ గ్రూప్‌


రిజిస్ట్రేషన్‌ చార్జీలకూ ఐటీసీ ఇవ్వాలి..
స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో షేర్లు ట్రేడ్‌ అయినట్లుగానే ప్రాపర్టీలు కూడా ట్రేడింగ్‌ అవుతున్నాయి. ఒకటే ప్రాపర్టీ మీద పలుమార్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి కాబట్టి గతంలో జరిగిన రిజిస్ట్రేషన్‌ విలువను తాజా రిజిస్ట్రేషన్‌ నుంచి మినహాయించాలి. అంటే జీఎస్‌టీలో ఎలాగైతే ఐటీసీ ఇస్తున్నారో అలాగే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లకు ఇవ్వాలి. ఉదాహరణకు రూ.50 లక్షలకు కొన్న అపార్ట్‌మెంట్‌.. రెండు మూడేళ్ల తర్వాత రూ.70 లక్షలకు విక్రయిస్తే రూ.70 లక్షల మీద రిజిస్ట్రేషన్‌ చార్జీలు వసూలు చేయకూడదు. తాజా రిజిస్ట్రేషన్‌ విలువ నుంచి ఇంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్‌ విలువ రూ.50 లక్షలకు తీసేయాలి. పెరిగిన ధర ఏదయితే ఉందో రూ.20 లక్షల మీదనే రిజిస్ట్రేషన్‌ చార్జీలను వసూలు చేయాలి. ‘ఒకే దేశం–ఒకే పన్ను’ విధానమైన జీఎస్‌టీ.. రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల విషయంలో మాత్రం అమలవ్వడం లేదు. 6 శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీలు, 5 శాతం జీఎస్‌టీ రెండూ చెల్లించాల్సి వస్తుంది.
   – సీ శేఖర్‌ రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement