ధరలు పైపైకి...
హైదరాబాద్ శివార్లలోని నారాపల్లిలో గతేడాది జూలైలో చదరపు గజం ధర రూ.20 వేలు. 500 గజాల స్థలం కొంటే రూ.కోటి అయ్యేది. దానిపై 6 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు అంటే రూ.6 లక్షలు చెల్లిస్తే సరిపోయేది. జూలైలో చదరపు గజానికి ధర రూ.30 వేలకు, రిజిస్ట్రేషన్ చార్జీ 7.5 శాతానికి పెంచారు. దానితో 500 గజాల స్థలానికి ధర రూ.1.5 కోట్లకు, దీనిపై రిజిస్ట్రేషన్ చార్జీ రూ.11.25 లక్షలకు పెరిగాయి. ఇప్పుడు మరోసారి భూముల ధరలను పెంచు తున్నారు. చదరపు గజానికి ధర రూ.45 వేలకు చేరుతుండటంతో.. అదే 500 గజాల స్థలానికి ధర రూ.2.25 కోట్లు, దీనిపై రిజిస్ట్రేషన్ చార్జీ రూ.16.85 లక్షలకు పెరుగుతోంది.
► అంటే గతేడాది జూలైకి ముందు 500 గజాలకు రూ.కోటి ధర ఉంటే.. ఇప్పుడు రూ.2.25 కోట్లకు రూ.6 లక్షలున్న రిజిస్ట్రేషన్ చార్జీ ఇప్పుడు రూ.16.85 లక్షలకు పెరుగుతోంది.
► వరంగల్ చౌరస్తా ఏరియాలో గతంలో చదరపు గజానికి రూ.27,500 ధరతో.. 500 గజాలకు రూ.1,37,50,000కు చెల్లిస్తే సరిపోయేది. దానిపై రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.8.25 లక్షలు అయ్యేవి. జూలైలో భూముల ధర, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంతో.. ధర రూ.1,62,50,000 (చదరపు అడుగుకు రూ.32,500 చొప్పున), రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.12,18,750కు (7.5శాతం లెక్కన) చేరాయి. తాజాగా మరోసారి ధరలు పెంచడంతో.. అదే స్థలానికి రూ.2,07,50,000 (చదరపు అడుగు రూ.41,500) ధర, రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ.15,56,250 చెల్లించాల్సి వస్తోంది. అంటే.. ఆ స్థలానికి ఏడు నెలల కింద మొత్తంగా రూ.1,45,75,000 చెల్లిస్తే.. ఇప్పుడు రూ. 2,23,06,250 అవుతోంది.
..రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయిన పరిస్థితికి చిన్న ఉదాహరణలివి. ఎప్పటికైనా సొంతిల్లు ఉండాలనే సామాన్యుడికి ఇది అశనిపాతంగా మారుతోంది. ప్రభుత్వం భూముల విలువలను సవరించడంతో.. స్థలాల యజమానులు కూడా రేట్లు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఇళ్ల ధరల పరిస్థితిపై ప్రత్యేక కథనం.
సాక్షి, హైదరాబాద్/ నెట్‌వర్క్: ఏడు నెలల క్రితమే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రెండింటినీ పెంచిన సర్కారు.. తాజాగా మరోసారి స్థలాల ధరలను సవరించనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ అమల్లోకి రానున్నాయి. ఇలా భూముల విలువలు పెరిగిపోవడం, నిర్మాణ సామగ్రి ధరల భారం కలిసి.. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల ధరలపై ప్రభావం పడింది. భూముల ప్రభుత్వ ధరలకు, మార్కె ట్ విలువకు మధ్య వ్యత్యాసం తగ్గింది. దీనితో స్థలాల యజమానులు భూముల ధరలను పెంచేస్తున్నారు. మరోవైపు కొద్దినెలలుగా సిమెంట్, స్టీల్, ఇసుక వంటి నిర్మాణ సామగ్రి ధరలు బాగా పెరిగాయి.
రెండేళ్లుగా కరోనా ప్రభావం వల్ల చాలా మంది కార్మికులు సొంత రాష్ట్రాలకు, ఊర్లకు వెళ్లిపోయారు. దానితో నైపుణ్యమున్న కూలీల రెట్లు రెం డింతలు అయ్యాయి. ఇలా పెరిగిన వ్యయంతో అ పార్ట్‌మెంట్లు, ఇళ్ల ధరలు భారంగా మారుతున్నా యి. భూముల ధరలు పెరగడం వల్ల అపార్ట్‌మెంట్ల ధరలు ఒక్కో చదరపు అడుగుకు రూ.500 వరకు పెరుగుతాయని నరెడ్కో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్‌కుమార్ ముమ్మారెడ్డి తెలిపారు.
సొంతంగా కట్టుకుందామన్నా..
కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి చాలా మంది సొంత ఇల్లు ఉండాలని భావిస్తున్నారు. కొందరు కట్టిన ఇళ్లు కొనుక్కునే పనిలో పడగా.. చాలా మంది ఇప్పటికే కొనిపెట్టుకున్న స్థలాల్లో ఇంటి నిర్మాణాలపై దృష్టిపెట్టారు. అయితే సిమెంట్, స్టీల్, రంగులు, ఎలక్ట్రిక్ వస్తువులు వంటి అన్నిరకాల నిర్మాణ సామగ్రి ధరలు 50 శాతానికిపైగానే పెరిగాయి. లేబర్ ఖర్చులైతే రెండింతలయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలూ పెరిగాయి. దీనితో మొత్తం నిర్మాణ వ్యయం మొతెక్కుతోంది. ఇంటీరియర్లు కాకుండా ప్రధాన నిర్మాణాల కోసం.. ఏడాదిన్నర కింద సగటున చదరపు అడుగుకు రూ.1,200 నుంచి రూ.1,400 వరకు వ్యయం అయ్యేది. కాంట్రాక్టర్లు అయితే రూ.1,500–1,600 వరకు చార్జీ చేసేవారు. పెరిగిన ధరలతో సాధారణంగానే ఒక్కో చదరపు అడుగుకు రూ.1,700 వరకు ఖర్చవుతోంది. అదే కాంట్రాక్టర్లు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ చార్జి చేస్తున్నారు.
‘అందుబాటు’ లేకుండా పోతే ఎలా?
బ్రాండ్ హైదరాబాద్‌గా వేగంగా ఎదుగుతుండటానికి కారణం.. ఇక్కడ ధరలు అందుబాటులో ఉండటం, తక్కువ జీవన వ్యయమేనని రియల్‌ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. ధరలు ఇలా పెంచుకుంటూ పోతే.. ఇతర నగరాలకు భాగ్యనగరానికి వ్యత్యాసం ఉండదని.. కంపెనీలు నగరానికి వచ్చే విషయంలో ఇబ్బంది అవుతుందని అంటున్నాయి. కాగా.. భూముల ధరలను పెంచిన ప్రభుత్వం.. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల భారాన్ని ఆరు శాతానికి తగ్గించాలని క్రెడాయ్, ట్రెడా ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను కలిసి కలిసి విజ్ఞప్తి చేశాయి.
ఇతర రాష్ట్రాల తరహాలో చార్జీలు తగ్గించాలి
రెండేళ్లుగా అనిశ్చిత పరిస్థితులతో నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయని, రియల్ ఎస్టేట్ కంపెనీలకు వ్యయభారం ఎక్కువైంద ని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖ ర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంపుడ్యూటీని తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కానీ మన రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా భూముల ధరలను, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతున్నారని పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా పెంచలేదు కదా అని కరోనా వంటి అనిశ్చితి సమయంలో రెండుసార్లు సవరించడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. భూముల ధరలను పెంచినప్పుడు రిజిస్ట్రేషన్ చార్జీలను సగానికి తగ్గించాలని సూచించారు.
అపార్ట్‌మెంట్లపై ప్రభావం ఇదీ..
► హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో పాత రేటు ప్రకారం వెయ్యి చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు రూ.24 లక్షలు, రిజిస్ట్రేషన్ కోసం రూ.1.8 లక్షలు వ్యయం అయ్యేది. ఇప్పుడు కొత్త రేట్లతో అదే అపార్ట్‌మెంట్‌కు ధర రూ.30 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2.25 లక్షలకు పెరుగుతున్నాయి. ఇదే పరిమాణమున్న ఫ్లాట్ శంషాబాద్‌లో గతంలో రూ.35 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2.7 లక్షలు ఉంటే.. ఇప్పుడు ధర రూ.45 లక్షలు, చార్జీలు రూ.3,37,500 కట్టాల్సి వస్తోం ది. హైదరాబాద్ వ్యాప్తంగా అంతటా ఇదే పరిస్థితి. పైగా జీఎస్టీ కింద 5 శాతం పన్ను అదనంగా చెల్లించక తప్పదు.
► కరీంనగర్ ప్రకాశం గంజ్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగుకు 2 వేలు ధర ఉండేది. ఇప్పుడు రూ.2,500 చేశారు. గతంలో 1,500 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ విలువ రూ. 30లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.1.80 లక్షలుగా ఉండేవి. ఇప్పుడు అదే ఫ్లాట్ విలువ రూ.37.5 లక్షలకు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2,81,250కు చేరాయి.
► ఖమ్మంలో వెయ్యి చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు గతంలో మొత్తంగా రూ. 17 లక్షలు ఖర్చయితే.. ఇప్పుడు రూ. 21.5 లక్షలకు చేరుతోంది.
జిల్లాల్లో పరిస్థితి ఇదీ..
► జనగామలోని ఆర్టీసీ ఎక్స్‌రోడ్ సమీపంలో.. గతేడాది జూలైకి ముందు 1000 గజాల స్థలం రూ.కోటి, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.6 లక్షలు ఉండేవి. జూలైలో, తాజాగా పెరిగిన ధరలు, చార్జీలతో.. ప్రస్తుతం ధర రూ.2 కోట్లకు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.15 లక్షలకు చేరుతున్నాయి.
► మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్‌వద్ద గతంలో 200 గజాల స్థలాని కి రూ.47 లక్షలు ధర, రిజిస్ట్రేషన్ చా ర్జీలు రూ.3,52,500అయ్యేవి. ఇప్పు డు పెరిగిన ధరలతో.. అదే స్థలానికి ధర రూ.63.60లక్షలు, చార్జీలు రూ. 4.77 లక్షలు చెల్లించాల్సి వస్తోంది.
► కరీంనగర్‌లోని కోర్టు ఏరియాలో స్థలం ధర గతంలో గజానికి రూ.19,500 ఉండేది. 120 గజాల (గుంట) భూమికి రూ.23,40,000 ధర, రూ.1,40,400 రిజిస్ట్రేషన్‌చార్జీ అయ్యేవి. ఇప్పుడు గజానికి రూ.26,400 లెక్కన అదే స్థలానికి.. రూ.31,68,000 ధర, రూ. 2,37,600 రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి రానుంది.
► నిజామాబాద్ జిల్లాలో భూముల ధరలను 30 శాతం వరకు, అపార్ట్‌మెంట్ల ధరలను 25 శాతం వరకు పెంచారు. పెరిగిన ధరలపై రిజిస్ట్రేషన్ చార్జీల భారం కూడా పడుతోంది. జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఎకరానికి రూ.30 లక్షల కనీస ధర ఉండగా రూ.52 లక్షలకు పెంచారు.
► ఖమ్మం నగరంలోని వీడీవోస్ కాలనీ లో 100 గజాల స్థలానికి గతంలో రూ.8,50,000 ధర, రూ.63,500 రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లిస్తే సరిపోయేది. తాజాగా స్థలం విలువ రూ. 11,50,000కు, రిజిస్ట్రేషన్ చార్జీల భారం రూ.86,250కు చేరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment