telangana housing department
-
సొంత జాగాల్లో ఇళ్లకు దసరా తరువాత ముహూర్తం
గజ్వేల్: సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3లక్షలు పంపిణీ చేసే పథకానికి దసరా తర్వాత శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామ, శేర్పల్లి గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంగళవారం పంపిణీ చేశారు. ఆ తర్వాత గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో హరీశ్ మాట్లాడుతూ.. కరోనా వల్ల రెండేళ్లుగా రాష్ట్రానికి ఆదాయం తగ్గడం వల్ల సొంత జాగాల్లో ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించలేక పోయామన్నారు. దసరా తర్వాత నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సాగు పెట్టుబడి తగ్గించి, రాబడి పెంచుతామని చెప్పిన కేంద్రం డీజిల్, ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డి విరిచిందని విమర్శించారు. రైతులకు గొప్పగా ఉపయోగపడుతున్న ఉచిత కరెంట్‌ను కూడా వద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. చదవండి: రాష్ట్రంలోకి అడెల్లు, మంగులు దళాలు! కేసీఆర్ పర్యటన రూటుమార్పు? -
సొంతిల్లు భారమే.. ‘అందుబాటు’ లేకుండా పోతే ఎలా?
ధరలు పైపైకి... హైదరాబాద్ శివార్లలోని నారాపల్లిలో గతేడాది జూలైలో చదరపు గజం ధర రూ.20 వేలు. 500 గజాల స్థలం కొంటే రూ.కోటి అయ్యేది. దానిపై 6 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు అంటే రూ.6 లక్షలు చెల్లిస్తే సరిపోయేది. జూలైలో చదరపు గజానికి ధర రూ.30 వేలకు, రిజిస్ట్రేషన్ చార్జీ 7.5 శాతానికి పెంచారు. దానితో 500 గజాల స్థలానికి ధర రూ.1.5 కోట్లకు, దీనిపై రిజిస్ట్రేషన్ చార్జీ రూ.11.25 లక్షలకు పెరిగాయి. ఇప్పుడు మరోసారి భూముల ధరలను పెంచు తున్నారు. చదరపు గజానికి ధర రూ.45 వేలకు చేరుతుండటంతో.. అదే 500 గజాల స్థలానికి ధర రూ.2.25 కోట్లు, దీనిపై రిజిస్ట్రేషన్ చార్జీ రూ.16.85 లక్షలకు పెరుగుతోంది. ► అంటే గతేడాది జూలైకి ముందు 500 గజాలకు రూ.కోటి ధర ఉంటే.. ఇప్పుడు రూ.2.25 కోట్లకు రూ.6 లక్షలున్న రిజిస్ట్రేషన్ చార్జీ ఇప్పుడు రూ.16.85 లక్షలకు పెరుగుతోంది. ► వరంగల్ చౌరస్తా ఏరియాలో గతంలో చదరపు గజానికి రూ.27,500 ధరతో.. 500 గజాలకు రూ.1,37,50,000కు చెల్లిస్తే సరిపోయేది. దానిపై రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.8.25 లక్షలు అయ్యేవి. జూలైలో భూముల ధర, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంతో.. ధర రూ.1,62,50,000 (చదరపు అడుగుకు రూ.32,500 చొప్పున), రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.12,18,750కు (7.5శాతం లెక్కన) చేరాయి. తాజాగా మరోసారి ధరలు పెంచడంతో.. అదే స్థలానికి రూ.2,07,50,000 (చదరపు అడుగు రూ.41,500) ధర, రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ.15,56,250 చెల్లించాల్సి వస్తోంది. అంటే.. ఆ స్థలానికి ఏడు నెలల కింద మొత్తంగా రూ.1,45,75,000 చెల్లిస్తే.. ఇప్పుడు రూ. 2,23,06,250 అవుతోంది. ..రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయిన పరిస్థితికి చిన్న ఉదాహరణలివి. ఎప్పటికైనా సొంతిల్లు ఉండాలనే సామాన్యుడికి ఇది అశనిపాతంగా మారుతోంది. ప్రభుత్వం భూముల విలువలను సవరించడంతో.. స్థలాల యజమానులు కూడా రేట్లు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఇళ్ల ధరల పరిస్థితిపై ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: ఏడు నెలల క్రితమే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రెండింటినీ పెంచిన సర్కారు.. తాజాగా మరోసారి స్థలాల ధరలను సవరించనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ అమల్లోకి రానున్నాయి. ఇలా భూముల విలువలు పెరిగిపోవడం, నిర్మాణ సామగ్రి ధరల భారం కలిసి.. ఇళ్లు, అపార్ట్మెంట్ల ధరలపై ప్రభావం పడింది. భూముల ప్రభుత్వ ధరలకు, మార్కె ట్ విలువకు మధ్య వ్యత్యాసం తగ్గింది. దీనితో స్థలాల యజమానులు భూముల ధరలను పెంచేస్తున్నారు. మరోవైపు కొద్దినెలలుగా సిమెంట్, స్టీల్, ఇసుక వంటి నిర్మాణ సామగ్రి ధరలు బాగా పెరిగాయి. రెండేళ్లుగా కరోనా ప్రభావం వల్ల చాలా మంది కార్మికులు సొంత రాష్ట్రాలకు, ఊర్లకు వెళ్లిపోయారు. దానితో నైపుణ్యమున్న కూలీల రెట్లు రెం డింతలు అయ్యాయి. ఇలా పెరిగిన వ్యయంతో అ పార్ట్మెంట్లు, ఇళ్ల ధరలు భారంగా మారుతున్నా యి. భూముల ధరలు పెరగడం వల్ల అపార్ట్మెంట్ల ధరలు ఒక్కో చదరపు అడుగుకు రూ.500 వరకు పెరుగుతాయని నరెడ్కో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్‌కుమార్ ముమ్మారెడ్డి తెలిపారు. సొంతంగా కట్టుకుందామన్నా.. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి చాలా మంది సొంత ఇల్లు ఉండాలని భావిస్తున్నారు. కొందరు కట్టిన ఇళ్లు కొనుక్కునే పనిలో పడగా.. చాలా మంది ఇప్పటికే కొనిపెట్టుకున్న స్థలాల్లో ఇంటి నిర్మాణాలపై దృష్టిపెట్టారు. అయితే సిమెంట్, స్టీల్, రంగులు, ఎలక్ట్రిక్ వస్తువులు వంటి అన్నిరకాల నిర్మాణ సామగ్రి ధరలు 50 శాతానికిపైగానే పెరిగాయి. లేబర్ ఖర్చులైతే రెండింతలయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలూ పెరిగాయి. దీనితో మొత్తం నిర్మాణ వ్యయం మొతెక్కుతోంది. ఇంటీరియర్లు కాకుండా ప్రధాన నిర్మాణాల కోసం.. ఏడాదిన్నర కింద సగటున చదరపు అడుగుకు రూ.1,200 నుంచి రూ.1,400 వరకు వ్యయం అయ్యేది. కాంట్రాక్టర్లు అయితే రూ.1,500–1,600 వరకు చార్జీ చేసేవారు. పెరిగిన ధరలతో సాధారణంగానే ఒక్కో చదరపు అడుగుకు రూ.1,700 వరకు ఖర్చవుతోంది. అదే కాంట్రాక్టర్లు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ చార్జి చేస్తున్నారు. ‘అందుబాటు’ లేకుండా పోతే ఎలా? బ్రాండ్ హైదరాబాద్‌గా వేగంగా ఎదుగుతుండటానికి కారణం.. ఇక్కడ ధరలు అందుబాటులో ఉండటం, తక్కువ జీవన వ్యయమేనని రియల్ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. ధరలు ఇలా పెంచుకుంటూ పోతే.. ఇతర నగరాలకు భాగ్యనగరానికి వ్యత్యాసం ఉండదని.. కంపెనీలు నగరానికి వచ్చే విషయంలో ఇబ్బంది అవుతుందని అంటున్నాయి. కాగా.. భూముల ధరలను పెంచిన ప్రభుత్వం.. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల భారాన్ని ఆరు శాతానికి తగ్గించాలని క్రెడాయ్, ట్రెడా ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను కలిసి కలిసి విజ్ఞప్తి చేశాయి. ఇతర రాష్ట్రాల తరహాలో చార్జీలు తగ్గించాలి రెండేళ్లుగా అనిశ్చిత పరిస్థితులతో నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయని, రియల్ ఎస్టేట్ కంపెనీలకు వ్యయభారం ఎక్కువైంద ని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖ ర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంపుడ్యూటీని తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కానీ మన రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా భూముల ధరలను, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతున్నారని పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా పెంచలేదు కదా అని కరోనా వంటి అనిశ్చితి సమయంలో రెండుసార్లు సవరించడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. భూముల ధరలను పెంచినప్పుడు రిజిస్ట్రేషన్ చార్జీలను సగానికి తగ్గించాలని సూచించారు. అపార్ట్మెంట్లపై ప్రభావం ఇదీ.. ► హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో పాత రేటు ప్రకారం వెయ్యి చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు రూ.24 లక్షలు, రిజిస్ట్రేషన్ కోసం రూ.1.8 లక్షలు వ్యయం అయ్యేది. ఇప్పుడు కొత్త రేట్లతో అదే అపార్ట్‌మెంట్‌కు ధర రూ.30 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2.25 లక్షలకు పెరుగుతున్నాయి. ఇదే పరిమాణమున్న ఫ్లాట్ శంషాబాద్‌లో గతంలో రూ.35 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2.7 లక్షలు ఉంటే.. ఇప్పుడు ధర రూ.45 లక్షలు, చార్జీలు రూ.3,37,500 కట్టాల్సి వస్తోం ది. హైదరాబాద్ వ్యాప్తంగా అంతటా ఇదే పరిస్థితి. పైగా జీఎస్టీ కింద 5 శాతం పన్ను అదనంగా చెల్లించక తప్పదు. ► కరీంనగర్ ప్రకాశం గంజ్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు 2 వేలు ధర ఉండేది. ఇప్పుడు రూ.2,500 చేశారు. గతంలో 1,500 చదరపు అడుగుల అపార్ట్మెంట్ విలువ రూ. 30లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.1.80 లక్షలుగా ఉండేవి. ఇప్పుడు అదే ఫ్లాట్ విలువ రూ.37.5 లక్షలకు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2,81,250కు చేరాయి. ► ఖమ్మంలో వెయ్యి చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు గతంలో మొత్తంగా రూ. 17 లక్షలు ఖర్చయితే.. ఇప్పుడు రూ. 21.5 లక్షలకు చేరుతోంది. జిల్లాల్లో పరిస్థితి ఇదీ.. ► జనగామలోని ఆర్టీసీ ఎక్స్‌రోడ్ సమీపంలో.. గతేడాది జూలైకి ముందు 1000 గజాల స్థలం రూ.కోటి, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.6 లక్షలు ఉండేవి. జూలైలో, తాజాగా పెరిగిన ధరలు, చార్జీలతో.. ప్రస్తుతం ధర రూ.2 కోట్లకు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.15 లక్షలకు చేరుతున్నాయి. ► మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్‌వద్ద గతంలో 200 గజాల స్థలాని కి రూ.47 లక్షలు ధర, రిజిస్ట్రేషన్ చా ర్జీలు రూ.3,52,500అయ్యేవి. ఇప్పు డు పెరిగిన ధరలతో.. అదే స్థలానికి ధర రూ.63.60లక్షలు, చార్జీలు రూ. 4.77 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ► కరీంనగర్‌లోని కోర్టు ఏరియాలో స్థలం ధర గతంలో గజానికి రూ.19,500 ఉండేది. 120 గజాల (గుంట) భూమికి రూ.23,40,000 ధర, రూ.1,40,400 రిజిస్ట్రేషన్చార్జీ అయ్యేవి. ఇప్పుడు గజానికి రూ.26,400 లెక్కన అదే స్థలానికి.. రూ.31,68,000 ధర, రూ. 2,37,600 రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి రానుంది. ► నిజామాబాద్ జిల్లాలో భూముల ధరలను 30 శాతం వరకు, అపార్ట్మెంట్ల ధరలను 25 శాతం వరకు పెంచారు. పెరిగిన ధరలపై రిజిస్ట్రేషన్ చార్జీల భారం కూడా పడుతోంది. జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఎకరానికి రూ.30 లక్షల కనీస ధర ఉండగా రూ.52 లక్షలకు పెంచారు. ► ఖమ్మం నగరంలోని వీడీవోస్ కాలనీ లో 100 గజాల స్థలానికి గతంలో రూ.8,50,000 ధర, రూ.63,500 రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లిస్తే సరిపోయేది. తాజాగా స్థలం విలువ రూ. 11,50,000కు, రిజిస్ట్రేషన్ చార్జీల భారం రూ.86,250కు చేరుతోంది. -
న్యాయం కోసం 23 ఏళ్లుగా అతను.. !
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుపై వినియోగదారుల ఫోరంలో 23 ఏళ్ల క్రితం కె.వి.రామారావు (63) ఫిర్యాదు దాఖలు చేశాడు. ఏప్రిల్ 27, 1998 నుంచి 2003 మే 19 వరకు కేసు కొనసాగింది. వాదనలు పూర్తయ్యాక మే 19, 2003న తీర్పు కోసం రిజర్వ్ చేయబడింది. కేసులో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. 17 ఏళ్ల పాటు ఫైలు ఆచూకీ లభించలేదు. ఫిర్యాదు తరపు న్యాయవాది ప్రమాదానికి గురికావడంతో కేసు గతి తప్పింది. అడపా, దడపా ఫిర్యాదురాదు వాకబు చేసినా లాభం లేకపోయింది. గత ఏడాది మార్చి 17న రామారావు వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు వక్కంటి నరసింహారావుతో విషయం మొరపెట్టుకోగా, ఆయన సూచన మేరకు మరోసారి దరఖాస్తు పెట్టుకున్నాడు. 17 ఏళ్ల పాటు చీకటిలో మగ్గిన ఫైలు వెలుగులోకి వచ్చింది. అప్పటికే రాష్ట్రం విడిపోయి హౌసింగ్ బోర్డులు విడిపోవడంతో తెలంగాణ హౌసింగ్ బోర్డును కూడా పార్టీని చేయమని ఫోరం ఆదేశించింది. ఆనంతరం కేసు విచారణ కొనసాగి మంగళవారం తీర్పు వెలువడింది. కేసు విచారణలో అధ్యక్షుడు వక్కంటి నరసింహారావు, సభ్యులు పారుపల్లి జవహర్‌బాబు, ఆర్ఎస్.రాజేశ్రీ పాలుపంచుకోగా బెంచ్ తరపున పారుపల్లి జవహర్‌బాబు తీర్పును వెలువరించారు. ఫిర్యాదు దారు రిజిస్ట్రేషన్ చేయని భూమికి సంబంధించి గజానికి రూ.3,500 చొప్పున, రిజిస్ట్రేషన్ తేదీ 8/8/1987 నుంచి 12 శాతం వడ్డీతో చెల్లించాలని అప్పటి ఏపీ హౌసింగ్‌బోర్డు, ఇప్పటి తెలంగాణ హౌసింగ్ బోర్డులను ఆదేశిస్తూ కమిషన్ తీర్పు చెప్పింది. ఫిర్యాదుదారుకి కలిగిన మానసిక ఆవేదన, అసౌకర్యానికి రూ.50 వేల నష్టపరిహారం, పది వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఇవీ కేసు వివరాలు.. ► ఫిర్యాదురాదు కె.వి.రామారావు ఏపీ హౌసింగ్ బోర్డు నిర్వహించిన వెంకళరావు నగర్ ప్లాట్ల వేలం పాటలో పాల్గొన్నాడు. అత్యధిక ధరకు పాటపాడి 231.80 చదరపు గజాల ప్లాటును చదరపు గజానికి రూ. 1,505 రేటు చొప్పున దక్కించుకున్నాడు. 1994 కల్లా మొత్తం చెల్లించవలసిన సొమ్ము చెల్లించాడు. 1997 ఆగస్టు 8న ప్లాటు అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. 231.80 చదరపు గజాలకు బదులు 216.95 చదరపు గజాలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో మిగిలిన 14.85 చదరపు గజాలకు చెల్లించిన సొమ్ము తనకు తిరిగి చెల్లించాలని ప్రతివాదిని ఆశ్రయించాడు. ప్రతివాది స్పందన లేనందున 1998లో ఫోరాన్ని ఆశ్రయించాడు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న సమయంలో మార్కెటు విలువ రూ.3,500 ఉంటే రూ. 1505 ధర చెల్లిస్తామని ప్రతివాది వాదనను తోసి పుచ్చి ఫోరాన్ని ఆశ్రయించాడు. ఫోరం సూచనల మేరకు మాయమైన ఫైలు లభ్యమైన తర్వాత 2021 మార్చి 17న తెలంగాణ హౌసింగ్ బోర్డును 2వ ప్రతివాదిగా చేర్చారు. కేసు విచారణ, పూర్వాపదాలు పరిశీలించిన మీదట వినియోగదారుల కమిషన్ ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మాయమైన ఫైలు వెతికి తీసి న్యాయం ఎప్పటికైనా జరుగుతుందన్న విషయాన్ని ఈ కేసు రుజువు చేసింది. అనివార్య కార్యణాల వల్ల ఆలస్యం అయితే అవ్వొచ్చు గానీ అన్యాయంగా ఆలస్యంగా న్యాయం గెలిచిందన్న సంతోషం వినియోగ దారునికి మిగిలింది. -
'డబుల్' స్పీడ్
రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకుంది.ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సీఎం ఆదేశాలతో ఈ ఇళ్ల నిర్మాణాలు తిరిగి ఊపందుకున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కేవలం 4 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిన తెలంగాణ గృహనిర్మాణశాఖ ఒక్క జనవరిలోనే 1,639 నిర్మాణాలను పూర్తి చేయడమే ఇందుకు నిదర్శనం. పార్లమెంటు ఎన్నికలనాటికి దాదాపుగా 80 వేల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల్లో తుదిదశకు వచ్చిన నిర్మాణాలు సుమారు 30వేల వరకు ఉన్నాయని వివరించారు. వేగంగా మౌలిక సదుపాయాల కల్పన.. ఓవైపు ఇళ్లను వేగంగా పూర్తి చేస్తూనే.. మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనపైనా అధికారులు అదే స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. పూర్తయిన గృహ సముదాయాలకు విద్యుత్తు, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను వేగంగా కల్పిస్తున్నారు. ఇందుకోసం ఆయా శాఖలతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఫలితంగా పలు సముదాయాల వద్ద ఇప్పటికే రోడ్లు, విద్యుత్ కనెక్షన్ పనులు వేగంగా నడుస్తున్నాయి. పోటెత్తుతున్న దరఖాస్తులు 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధాన హామీల్లో ఇది కూడా ఒకటి. దీంతో దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబుల్‌పై పేదలకు ఆశలు పెరిగాయి. అందుకే ఒక్క హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 3 లక్షల దరఖాస్తులు రావడమే స్పందనకు నిదర్శనం. మిగిలిన జిల్లాల్లో దాదాపుగా మరో ఆరు లక్షల దరఖాస్తులు వచ్చాయని సమాచారం. నాలుగు జిల్లాల్లో ఊసే లేదు.. జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, కుమ్రంభీం, వికారాబాద్ జిల్లాల్లో గడిచిన నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. ఈ జిల్లాలకు పార్లమెంటు ఎన్నికల్లోపు ఇళ్ల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇళ్ల పంపిణీ ఎప్పుడో... వాస్తవానికి లక్షకుపైగా ఇళ్లను పార్లమెంటు ఎన్నికలలోపు పూర్తి చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ, దీనిపై సీఎం కేసీఆర్ ఇటీవల స్పష్టత ఇచ్చారు. ఆదరాబాదరాగా తాము ఇళ్లను పూర్తి చేయాలనుకోవడం లేదని, ప్రజలు మాపై నమ్మకాన్ని ఉంచి రెండోసారి గెలిపించిన నేపథ్యంలో నాణ్యమైన ఇళ్లనే ఇవ్వాలనుకుంటున్నామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇళ్ల పంపిణీ ఎప్పుడన్నది ఆసక్తిగా మారింది. – సాక్షి, హైదరాబాద్ -
హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు ఊరట
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్లో తాత్కాలిక వేతనంతో ఐదేళ్లు పనిచేసిన వారి సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వివాదం ఉమ్మడి రాష్ట్రంలో జరిగినప్పటికీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కార్పొరేషన్ తెలంగాణలో ఉన్నందున తమ ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వానికి వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 1991లో ఉమ్మడి ఏపీలో జీవో 182 జారీ అయింది. దీని ప్రకారం ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారి సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలి. తాము 1989లో నియమితులయ్యామని, కార్పొరేషన్లో అసిస్టెం ట్ ఇంజనీర్లు, అర్కిటెక్చర్ డ్రాఫ్ట్‌మన్, డ్రాఫ్ట్మన్లుగా ఐదేళ్ల సర్వీసు పూరై్తందని, తమకు జీవో 182 వర్తించదంటూ 2006లో ఉత్తర్వులు జారీ చేయడం చెల్లదని తాత్కాలిక ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. జీవో 182 ప్రకారం అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వర్క్ ఇన్స్పెక్టర్ల సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయాలని గతంలో సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పును కార్పొరేషన్ సవాల్ చేసింది. జీవో 182 అమలు వర్తించదనే కార్పొరేషన్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. -
రాష్ట్రానికి మరో 22,817 ఇళ్లు
మంజూరు చేసిన కేంద్రం 45 పట్టణాలు, నగరాలు ఎంపిక ఇళ్ల నిర్మాణానికి రూ. 342 కోట్ల మేర ఆర్థిక సాయం సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలనశాఖ తెలంగాణ రాష్ట్రానికి మరో 22,817 ఇళ్లను మంజూరు చేసింది. తెలంగాణలోని 45 పట్టణాలు, నగరాల్లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ఈ ఇళ్లను కేటాయించనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ)లో భాగంగా అఫర్డబుల్ హౌజింగ్ ఇన్ పార్ట్నర్షిప్ (ఏహెచ్‌పీ)’ విధానంలో నిర్మించనున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మొత్తం రూ. 1,397 కోట్లు ఖర్చుకానుండగా ఇందులో కేంద్రం రూ. 342 కోట్లను (ఒక్కో ఇంటికి రూ. లక్షన్నర చొప్పున) ఆర్థిక సాయంగా అందించనుంది. తెలంగాణ గృహ నిర్మాణశాఖ కార్యదర్శి దానకిశోర్ గురువారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో సంబంధిత ప్రతిపాదనలను వివరించారు. ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం సమకూరుస్తుందని, కేంద్రం వాటా పోను మిగిలిన నిర్మాణ వ్యయం కూడా భరిస్తుందని వివరించారు. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు 7 లక్షల ఇళ్ల నిర్మాణం అవసరం ఉందని, ఇతర నగరాలు, పట్టణాల్లో దాదాపు 6 లక్షల ఇళ్ల నిర్మాణం అవసర మవుతుందని వివరించారు. తొలుత తెలంగాణకు కేవలం 10,290 ఇళ్లు మాత్రమే కేటాయించారన్న విమర్శల నేపథ్యంలో రాష్ట్రానికి మరిన్ని ఇళ్లను మంజూరు చేయడంతోపాటు పథకాన్ని మరిన్ని పట్టణాలకు వర్తింపజేయాలని కోరుతూ కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ...కేంద్ర గృహ నిర్మాణశాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం డిసెంబర్ 21న రాష్ట్రానికి దాదాపు 47 వేల ఇళ్లను మంజూరు చేసింది. మొత్తంమీద తొలి రెండు విడతల్లో తెలంగాణకు 57,664 ఇళ్లను మంజూరు చేసింది. తాజాగా వీటికితోడుగా మరో 22,817 ఇళ్లు మంజూరవడంతో ఇళ్ల సంఖ్య 80,481కు చేరుకోగా ఆర్థిక సాయం రూ. 1,207 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో తాజాగా ఇళ్లు మంజూరైన 45 నగరాలు/పట్టణాల జాబితాలో హైదరాబాద్ (1,585 ఇళ్లు), కామారెడ్డి (1,367), నిజామాబాద్ (1,367), ఖమ్మం (1,352), గజ్వేల్ (1,033), వరంగల్ (1,008 ఇళ్లు) ఉన్నాయి.