సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుపై వినియోగదారుల ఫోరంలో 23 ఏళ్ల క్రితం కె.వి.రామారావు (63) ఫిర్యాదు దాఖలు చేశాడు. ఏప్రిల్ 27, 1998 నుంచి 2003 మే 19 వరకు కేసు కొనసాగింది. వాదనలు పూర్తయ్యాక మే 19, 2003న తీర్పు కోసం రిజర్వ్ చేయబడింది. కేసులో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. 17 ఏళ్ల పాటు ఫైలు ఆచూకీ లభించలేదు. ఫిర్యాదు తరపు న్యాయవాది ప్రమాదానికి గురికావడంతో కేసు గతి తప్పింది.
అడపా, దడపా ఫిర్యాదురాదు వాకబు చేసినా లాభం లేకపోయింది. గత ఏడాది మార్చి 17న రామారావు వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు వక్కంటి నరసింహారావుతో విషయం మొరపెట్టుకోగా, ఆయన సూచన మేరకు మరోసారి దరఖాస్తు పెట్టుకున్నాడు. 17 ఏళ్ల పాటు చీకటిలో మగ్గిన ఫైలు వెలుగులోకి వచ్చింది. అప్పటికే రాష్ట్రం విడిపోయి హౌసింగ్ బోర్డులు విడిపోవడంతో తెలంగాణ హౌసింగ్ బోర్డును కూడా పార్టీని చేయమని ఫోరం ఆదేశించింది. ఆనంతరం కేసు విచారణ కొనసాగి మంగళవారం తీర్పు వెలువడింది. కేసు విచారణలో అధ్యక్షుడు వక్కంటి నరసింహారావు, సభ్యులు పారుపల్లి జవహర్‌బాబు, ఆర్‌ఎస్.రాజేశ్రీ పాలుపంచుకోగా బెంచ్ తరపున పారుపల్లి జవహర్‌బాబు తీర్పును వెలువరించారు. ఫిర్యాదు దారు రిజిస్ట్రేషన్ చేయని భూమికి సంబంధించి గజానికి రూ.3,500 చొప్పున, రిజిస్ట్రేషన్ తేదీ 8/8/1987 నుంచి 12 శాతం వడ్డీతో చెల్లించాలని అప్పటి ఏపీ హౌసింగ్‌బోర్డు, ఇప్పటి తెలంగాణ హౌసింగ్ బోర్డులను ఆదేశిస్తూ కమిషన్ తీర్పు చెప్పింది. ఫిర్యాదుదారుకి కలిగిన మానసిక ఆవేదన, అసౌకర్యానికి రూ.50 వేల నష్టపరిహారం, పది వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.
ఇవీ కేసు వివరాలు..
► ఫిర్యాదురాదు కె.వి.రామారావు ఏపీ హౌసింగ్ బోర్డు నిర్వహించిన వెంకళరావు నగర్ ప్లాట్ల వేలం పాటలో పాల్గొన్నాడు. అత్యధిక ధరకు పాటపాడి 231.80 చదరపు గజాల ప్లాటును చదరపు గజానికి రూ. 1,505 రేటు చొప్పున దక్కించుకున్నాడు. 1994 కల్లా మొత్తం చెల్లించవలసిన సొమ్ము చెల్లించాడు. 1997 ఆగస్టు 8న ప్లాటు అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. 231.80 చదరపు గజాలకు బదులు 216.95 చదరపు గజాలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించారు.
దీంతో మిగిలిన 14.85 చదరపు గజాలకు చెల్లించిన సొమ్ము తనకు తిరిగి చెల్లించాలని ప్రతివాదిని ఆశ్రయించాడు. ప్రతివాది స్పందన లేనందున 1998లో ఫోరాన్ని ఆశ్రయించాడు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న సమయంలో మార్కెటు విలువ రూ.3,500 ఉంటే రూ. 1505 ధర చెల్లిస్తామని ప్రతివాది వాదనను తోసి పుచ్చి ఫోరాన్ని ఆశ్రయించాడు. ఫోరం సూచనల మేరకు మాయమైన ఫైలు లభ్యమైన తర్వాత 2021 మార్చి 17న తెలంగాణ హౌసింగ్ బోర్డును 2వ ప్రతివాదిగా చేర్చారు. కేసు విచారణ, పూర్వాపదాలు పరిశీలించిన మీదట వినియోగదారుల కమిషన్ ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
మాయమైన ఫైలు వెతికి తీసి న్యాయం ఎప్పటికైనా జరుగుతుందన్న విషయాన్ని ఈ కేసు రుజువు చేసింది. అనివార్య కార్యణాల వల్ల ఆలస్యం అయితే అవ్వొచ్చు గానీ అన్యాయంగా ఆలస్యంగా న్యాయం గెలిచిందన్న సంతోషం వినియోగ దారునికి మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment