సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ (మార్కెట్) విలువ పెంపు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. అపార్టుమెంట్లు, గ్రూప్ హౌస్‌లు, ఫ్లాట్లు, వ్యక్తిగత ఇళ్లు, పౌల్ట్రీ ఫారాలు, మట్టిమిద్దెలు, పెంకుటిళ్లు తదితర అన్ని రకాల కట్టడాల మార్కెట్ విలువను ప్రభుత్వం 10%పెంచింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ విలువ పెంపును జేసీలు, ఆర్డీవోల నేతృత్వం లోని మార్కెట్ రివిజన్ కమిటీలు పూర్తి చేస్తున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపు రం జిల్లాల్లో పెంచిన రిజిస్ట్రేషన్ విలువల ప్రతిపాదనలకు కమిటీలు ఆమోద ముద్ర వేశాయి. ఇక్కడ పెంపు 10 నుంచి 25 శాతం దాకా ఉంది. పెంచిన రిజిస్ట్రేషన్ విలువలు ఆగస్టు 1 నుంచి అమలు కానున్నాయి.