Telangana Govt Issued A Order On Land Value Hike - Sakshi
Sakshi News home page

Land Value: తెలంగాణలో పెరిగిన భూమి విలువ

Published Tue, Jul 20 2021 5:53 PM | Last Updated on Wed, Jul 21 2021 2:51 AM

Telangana Govt Issued A Order On Land Value Hike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు/ అపార్ట్‌మెంట్ల విలువలను ప్రభుత్వం సవరించింది. అలాగే రిజి స్ట్రేషన్‌ ఫీజు కూడా పెంచింది. సవరించిన ప్రభుత్వ భూముల విలువలు, పెరిగిన రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు (జీవో నం.58) జారీ చేశా రు. దీంతో ఎనిమిదేళ్ల (2013 తర్వాత)కు భూముల ప్రభుత్వ విలువలను సవరించడంతో పాటు రిజి స్ట్రేషన్ల ఫీజును పెంచినట్టయింది. 

ఏ మూలనైనా రూ.75 వేలు
భూముల విలువల సవరణలో భాగంగా రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలోనైనా వ్యవసాయ భూమి ఎకరానికి రూ.75 వేలు కనిష్ట విలువగా ప్రభుత్వం నిర్ధారించింది. ఆ తర్వాత ప్రాంతం, భూమి విలువ లను బట్టి 30–50% పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా ఖాళీ స్థలాలకు సంబంధించి చదరపు గజం కనీసం రూ.200గా ఖరారు చేసిన ప్రభుత్వం వాటి విలువలను కూడా 50, 40, 30 శాతం శ్లాబుల్లో సవరించింది. ఇక, ఫ్లాట్లు/అపార్ట్‌మెంట్ల విషయంలో చదరపు అడుగు కనీసం రూ.1,000గా నిర్ధారించింది. వీటి విలువలను ఆయా ప్రాంతాల్లోని జనాభా ఆధారంగా వర్గీకరించి 20, 30 శాతం శ్లాబుల్లో పెంచుతూ సవరించింది. 

1.5 శాతం పెరిగిన స్టాంపు డ్యూటీ
ఇప్పటివరకు 6 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్‌ ఫీజును 7.5 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఇందులో స్టాంపు డ్యూటీ గతంలో 4% ఉండగా దాన్ని 5.5 శాతానికి పెంచింది. ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ కింద 1.5 శాతం, రిజిస్ట్రేషన్‌ కింద 0.5 శాతం ఫీజును యథాతథంగా కొనసాగించింది. రాష్ట్రంలోని భూములు, ఆస్తుల విలువల సవరణ.. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఎలా జరుగుతుందన్న దానిపై ‘సాక్షి’ ఈనెల 18న ‘సాగుభూమి రూ.75 వేలు’ శీర్షికన సవివరంగా కథనాన్ని ప్రచురించడం గమనార్హం. 

అదనపు ఫీజు చెల్లించాలి
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్‌ చేసుకున్న వారు కూడా ఈ నెల 22 నుంచి పెరిగిన విలువలు, రిజిస్ట్రేషన్ల ఫీజు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేక మాడ్యూల్‌ను ధరణి పోర్టల్‌లో అందుబాటులోకి తెస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదనంగా చెల్లించాల్సిన ఫీజును రిజిస్ట్రేషన్‌ జరిగే రోజు చెల్లించవచ్చని తెలిపారు. భూముల విలువల సవరణ, రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు విషయంలో ఎలాంటి సందేహాలున్నా  18005994788 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా లేదా ‘ఏఎస్‌సీఎంఆర్‌ఓఎట్‌దిరేట్‌తెలంగాణడాట్‌జీవోవీడాట్‌ఇన్‌’ కు ఈ మెయిల్‌ పంపడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చని వెల్లడించారు. 

నిలిచిన కార్యకలాపాలు
సవరించిన మార్కెట్‌ విలువలు, పెరిగిన రిజిస్ట్రేషన్‌ ఫీజును అప్‌లోడ్‌ చేయడం కోసం అటు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, ఇటు ధరణి పోర్టల్‌లో కార్యకలాపాలను మంగళవారం నుంచే నిలిపివేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ధరణి పోర్టల్‌ బంద్‌ కాగా, సాయంత్రం 5 గంటల నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని కంప్యూటర్లను సాంకేతిక బృందాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. బుధవారం ఉదయం కల్లా ఈ వివరాలన్నీ సబ్‌ రిజిస్ట్రార్, తహశీల్దార్‌ కార్యాలయాల్లోని కంప్యూటర్లకు సర్వర్‌ ద్వారా అప్‌లోడ్‌ కానున్నాయి. బుధవారం బక్రీద్‌ కారణంగా ఎలాగూ ప్రభుత్వ సెలవు ఉన్నందున గురువారం నుంచి కొత్త విలువలు, చార్జీలు అమల్లోకి వస్తాయని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. బుధవారం ప్రభుత్వ సెలవు అయినా సబ్‌ రిజిస్ట్రార్లు, తహశీల్దార్లు కార్యాలయాలకు వచ్చి తమ తమ మండలాలు, తమ పరిధిలోనికి వచ్చే ప్రాంతాలకు సంబంధించి అప్‌లోడ్‌ అయిన వివరాలను పరిశీలిస్తారని, గురువారం నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలిపారు. 

పొరుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ
రిజిస్ట్రేషన్ల ఫీజును మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు పెంచుతున్నట్టు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. తెలంగాణతో పోలిస్తే పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఎక్కువ ఉన్నాయని, తమిళనాడులో 11, కేరళలో 10, ఆంధ్రప్రదేశ్‌లో 7.5 శాతం చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇప్పటివరకు విలువలు సవరించలేదని తెలిపారు. మరోవైపు ఐటీ, ఫార్మా, పర్యాటక, మౌలిక వసతుల రంగాల్లో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించడం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో సాగు ఆయకట్టు పెరగడంతో భూముల విలువలు పెరిగాయని వివరించారు. దీంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. 

50 శాతం అదనపు ఆదాయం అంచనా
ప్రభుత్వ విలువల సవరణ, రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపు ద్వారా దాదాపు 50 శాతం అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఏటా రూ.6 వేల కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం వస్తుండగా, తాజా మార్పులతో అది రూ.9 వేల కోట్లకు చేరుతుందని ప్రభుత్వం లెక్కలు కడుతోంది. కానీ, 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.12వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ లావాదేవీల ద్వారా వస్తాయని భావిస్తోన్న రూ.9 వేల కోట్లకు తోడు మరో రూ.3 వేల కోట్లను కూడా ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. 

ఎలా పెరుగుతాయంటే... వ్యవసాయ భూములకు ఇలా..
ఈనెల 22 నుంచి అమల్లోకి వచ్చే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ల ఫీజు ప్రకారం వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ల కింద చెల్లించాల్సిన ఫీజు పెరగనుంది. ఉదాహరణకు ఎకరం భూమి ప్రభుత్వ విలువ గతంలో రూ.20 వేలు ఉంటే ఆ భూమికి రూ.1,200 (6 శాతం) ఫీజు కట్టి రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవారు. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.75 వేలు అయింది. దీంతో పాటు రిజిస్ట్రేషన్‌ ఫీజు 7.5 శాతానికి పెరిగింది. అంటే ఇప్పుడు అదే ఎకరం భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే రూ.5,625 చెల్లించాల్సి ఉంటుంది. 

ఖాళీ ప్లాట్లకు ఇలా...
ఖాళీ స్థలాల విషయంలో కూడా ఇదే నిబంధన వర్తించనుంది. మండల కేంద్రాల స్థాయిలో గతంలో చదరపు గజం రూ.201–1,000గా ఉన్న విలువను 50 శాతానికి పెంచారు. అంటే రూ.1,000 చదరపు గజం విలువ ఇప్పుడు రూ.1,500 అవుతుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు 6 నుంచి 7.5 శాతానికి పెరిగింది. కాబట్టి ఇప్పుడు 100 గజాల ఖాళీ స్థలాన్ని రిజిస్టర్‌ చేసుకునేందుకు రూ.11,250 చెల్లించాల్సి ఉంటుంది. అదే గతంలో అయితే రూ.6,000 కడితే సరిపోయేది. 

ఫ్లాట్లు/ అపార్ట్‌మెంట్లకు ఇలా..
లక్షలోపు జనాభా ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఫ్లాట్లు/అపార్ట్‌మెంట్లకు చదరపు అడుగుకు కనీస ధర రూ.1,000గా నిర్ణయించారు. గతంలో రూ.800 ఉండేది. ఈ ధర ప్రకారం 700 చదరపు అడుగుల ఫ్లాటును రిజిస్టర్‌ చేసుకునేందుకు గాను 6 శాతం ఫీజు చొప్పున రూ.33,600 రిజిస్ట్రేషన్‌ ఫీజు కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సవరించిన ధరల ప్రకారం చదరపు అడుగుకు రూ.1,000 చొప్పున రూ. 52,500 (7.5 శాతం ) రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు/ అపార్ట్‌మెంట్లకు ప్రభుత్వం నిర్దేశించిన విలువల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరగనున్నాయి. 
   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement