సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూముల విలువల సవరణ విధానంలో ప్రభుత్వం మార్పు తీసుకువచ్చింది. వ్యవసాయ భూములకు సంబంధించిన ప్రభుత్వ విలువలను రెండేళ్లకోసారి, వ్యవసాయేతర భూముల విలువల నుప్రతియేటా సవరించుకునే నిబంధనను మార్చింది. ఇక మీదట ఎప్పుడైనా భూముల ప్రభుత్వ విలువలను సవరించుకునే వెసులు బాటు కల్పిస్తూ పాత జీవోను సవరించింది. రాష్ట్రంలోని భూముల ప్రభుత్వ విలువలను సవరించేందుకు గాను స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి ప్రత్యేక అనుమతి ఇస్తూ ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీవో (నం.23) విడుదల చేశారు.
ఈ సవరణ ఆధారంగా మరోమారు రాష్ట్రం లోని భూముల ప్రభుత్వ విలువలను పెంచేందుకు సర్కారు సిద్ధమవుతోంది. దీనిపై గత రెండు రోజులుగా అన్ని జిల్లాల రిజిస్ట్రార్లతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త విలువలు అమల్లోకి తెచ్చేం దుకు గాను ఈ కసరత్తు జరుగుతోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి.
సవరించి ఆరు నెలలే: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే భూముల విలువలను సవరించారు. గత ఏడాది జూలైలో ఈ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. సాగుభూమి ఎకరం కనిష్టంగా రూ.75 వేలుగా నిర్ధారించింది. ఇక, ఖాళీ స్థలాలను గజానికి కనిష్టంగా రూ.200గా, ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్ల విలువ చదరపు అడుగుకు రూ.1,000గా ఖరారు చేసింది. దీంతో పాటు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలను కూడా పెంచింది.
ఈ పెంపు, సవరణల కారణంగా ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.400 కోట్ల వరకు అదనంగా ఆదాయం వస్తోంది. గతంలో ప్రతి యేటా రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల మధ్య ఆదాయం వస్తుండగా, ఈ పెంపు కారణంగా జనవరి 20 నాటికే ఈ ఆదాయం రూ.6,800 కోట్లు దాటింది.
ఆర్‌ఆర్‌ఆర్ కూడా పరిగణనలోకి.. అంతకుముందు ఏడేళ్లుగా ప్రభుత్వం ఈ విలువలను సవరించకపోవడంతో గత ఏడాది చేపట్టిన ప్రక్రియపై ఎలాంటి వ్యతిరేకత రాలేదు. దీంతో పాటు రాష్ట్రంలో వ్యవసాయ భూము ల విలువలు కూడా రోజురోజుకూ పెరుగుతుండడం, మారుమూల గ్రామాల్లో కూడా ఎకరా కనిష్టంగా రూ.12–15 లక్షల వరకు బహిరంగ మార్కెట్‌లో ధర పలుకుతుండడం తో మరోమారు భూముల విలువలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీజినల్ రింగు రోడ్డు లాంటి అభివృద్ధి కారణంగా భూముల విలువలు ఇంకా పెరగనున్న నేపథ్యంలో తాజాగా విలువల సవరణ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావించింది.
వ్యవసాయ భూముల విలువలు 50 శాతం పెంపు!
రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో భూములు, ఆస్తు ల విలువలు బహిరంగ మార్కెట్‌లో ఎలా ఉ న్నాయన్న దానిపై గురు, శుక్రవారాల్లో జిల్లా రిజిస్ట్రార్లతో ఆ శాఖ ఐజీ శేషాద్రి సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ భూముల విలువలను ఏ ప్రాంతంలో ఎంత సవరించాలి? వాణిజ్య, నివాస కేటగిరీల్లో ఫ్లాట్లు, అపా ర్ట్‌మెంట్ల ధరలు ఎంత నిర్ణయించాలి? ఖాళీ స్థలాలను ఏ మేరకు సవరించాలనే దానిపై ఆ యన జిల్లా రిజిస్ట్రార్లతో చర్చిస్తున్నారు.
అయి తే వ్యవసాయ భూముల విలువలను 50 శాతం, ఖాళీ స్థలాలను 35 శాతం, ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్లను 25 శాతం పెంచాల నే అంచనాతో కసరత్తు జరుగుతోంది. సీఎం ఆమోదంతో ఫిబ్రవరి 1 నుంచి కొత్త విలువలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment