ధ్రువ పత్రాలను పరిశీలిస్తున్న ఆర్‌యూ రిజిస్ట్రార్, పీజీ సెట్ డైరెక్టర్
సాక్షి, కర్నూలు(గాయత్రి ఎస్టేట్) : రాయలసీమ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పీజీ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సోమవారం ఆర్‌యూ లైబ్రరీ హాల్‌లో ప్రారంభమైంది. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అమర్‌నాథ్ ప్రక్రియను ప్రారంభించారు. వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధ్రువపత్రాల పరిశీలన ప్రశాంతంగా సాగింది. అనంతపురం ఎస్కేయూ పరిధిలో డిగ్రీ చదివి ఆర్‌యూ పీజీ సీట్ రాసి మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు నిరాసే మిగిలింది. ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల చేయక పోవటంతో విద్యార్థులు డిగ్రీ ధ్రువపత్రాలను తెచ్చుకో లేకపోయారు. మంచి ర్యాంకులు తెచ్చుకున్న ఐదుగురు విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సబ్జెక్టుకు 22, బాటనీ సబ్జెక్టుకు 117, కంప్యూటర్ సైన్స్‌కు 113, బయోటెక్నాలజీ సబ్జెక్టుకు 19 మంది మొత్తం 271 మంది విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించామని పీజీ సెట్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయకుమార్ పేర్కొన్నారు. ఎంఈడీ కోర్సు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీని మార్చినట్లు పేర్కొన్నారు. జూలై 31వ తేదీ ఉదయం 10 నుంచి 1 గంట వరకు పరిశీలించడం జరుగుతుందన్నారు. వెబ్‌ఆప్షన్లు ఆగస్టు 1వ తేదీన ఇచ్చుకోవచ్చన్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంగ్లిష్, ఓఆర్ అండ్ ఎస్‌క్యూసీ సబ్జెక్టులకు సంబంధించి అన్ని కేటగిరీల వారు 1 నుంచి చివరి ర్యాంకు వరకు హాజరు కావాలన్నారు.
అవకాశం కల్పించండి
ఆర్‌యూ పీజీసెట్ కౌన్సె లింగ్‌కు అవకాశం కల్పించాలి. మాది ప్యాపిలి మండలం నల్లమేకల పల్లి గ్రామం. యాడికి వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివాను. నాకు ఆర్‌యూ పీజీసెట్‌లో 27వ ర్యాంకు వచ్చింది. ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల చేయక పోవటంతో నాకు ఆర్‌యూలో పీజీ చేరే అవకాశం లేకుండా పోతోంది. వర్సిటీ అధికారులు స్పందించి అవకాశం కల్పించి ఉన్నత విద్య చదువుకోడానికి అవకాశం ఇవ్వాలి. – వెంకటకృష్ణారెడ్డి, ఫిజిక్స్ 27వ ర్యాంకు
Comments
Please login to add a commentAdd a comment