certificate verification process
-
సర్టిఫికెట్ల పరిశీలనకు సర్వం సిద్ధం
సాక్షి, కర్నూలు(అర్బన్) : జిల్లాలో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనం, విశ్వేశ్వరయ్య భవన్ (పీఆర్ ఎస్ఈ కార్యాలయం), మండల పరిషత్ సమావేశ భవనంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రత్యేకంగా ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. విశ్వేశ్వరయ్యభవన్‌లో కేవలం ఇంజినీరింగ్ అసిస్టెంట్, కర్నూలు మండల పరిషత్ సమావేశ భవనంలో వీఆర్ఓ, విలేజ్ సర్వేయర్ గ్రేడ్–3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. మిగిలిన 16 రకాల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన డీపీఆర్సీ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లలోని గదుల్లో నిర్వహించనున్నారు. అన్ని గదులకు ముందు భాగంలో అందులో ఏ పోస్టుకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందనే విషయాన్ని సైన్బోర్డులపై ముద్రించి గోడలకు అతికించారు. ఒక్కో గదిలో నాలుగుకు మించి టేబుళ్లను ఏర్పాటు చేశారు. వరండాలోనూ అభ్యర్థులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలను వేశారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశం ఉన్నందున డీపీఆర్సీ భవనం ముందుభాగంలో పెద్ద షామియానాలు ఏర్పాటు చేశారు. విశ్వేశ్వరయ్య భవన్, మండల పరిషత్ సమావేశ భవనం ప్రాంతాల్లోనూ అభ్యర్థులు కూర్చునేందుకు వీలుగా షామియానాలు, కుర్చీలు వేశారు. ఆయా భవనాల్లో టాయిలెట్లను శుభ్రం చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి వసతి కల్పిస్తున్నారు. 14 రకాల పోస్టులకు షార్ట్‌లిస్ట్‌లు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 19 రకాల పోస్టులకు గాను మంగళవారం సాయంత్రానికి 14 రకాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో షార్ట్ లిస్ట్‌లను రూపొందించి వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ నెల 23న విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్ షార్ట్‌లిస్ట్‌ను అప్లోడ్ చేసిన అధికారులు.. 24వ తేదీ సాయంత్రానికి ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్–2), పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6 (డిజిటల్ అసిస్టెంట్), విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, అనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్–2 ), విలేజ్ సర్వేయర్ గ్రేడ్–3, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డు అమెనిటీస్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు సంబంధించి షార్ట్ లిస్ట్‌లను సిద్ధం చేశారు. ఐదు రకాల పోస్టులకు కొనసాగుతున్న ప్రక్రియ 14 రకాల పోస్టులకు షార్ట్‌లిస్ట్‌లను విడుదల చేసిన అధికారులు మిగిలిన ఐదు రకాల పోస్టులైన పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్– ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్, ఏఎన్ఎం/మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్ ) గ్రేడ్–3, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పోస్టులకు షార్ట్‌లిస్టులను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఏఎన్ఎం/మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్ ) గ్రేడ్–3, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పోస్టులకు సంబంధించి వెయిటేజీ మార్కులు కలిపి షార్ట్‌లిస్టులు అప్లోడ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఆ దిశగా ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన షార్ట్‌లిస్టులలో అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్లను చూసుకుని.. కాల్‌లెటర్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాల్లెటర్లలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏ తేదీన, ఎక్కడ హాజరు కావాలనే విషయాలను పొందుపరిచారు. నేడు మూడు రకాల పోస్టులకు వెరిఫికేషన్ 24 విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, 11 విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్, 770 అనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ పోస్టులకు బుధవారం సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. స్థానిక డీపీఆర్సీ భవనంలో చేపట్టనున్నారు. వీఆర్ఓ పోస్టులకు కటాఫ్ మార్కులు జిల్లాలో మొత్తం 224 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం సంబంధిత అధికారులు ప్రకటించిన కటాఫ్ మార్కులు ఇలా ఉన్నాయి. బీసీ–ఏ లోకల్ 85.75, బీసీ–ఏ (ఉమెన్) 67, బీసీ–బీ 87, బీసీ–బీ (ఉమెన్) 58, బీసీ–సీ 71, బీసీ–సీ (ఉమెన్ ) 71, బీసీ–డీ 82, బీసీ–డీ (ఉమెన్) 60, బీసీ–ఈ 85, బీసీ–ఈ (ఉమెన్) 62, ఓసీ 91, ఓసీ (ఉమెన్) 71, ఎస్సీ 82, ఎస్టీ 71 మార్కులు. -
ఫిషరీస్ అసిస్టెంట్ 19 పోస్టులకుగాను 12 మంది ఎంపిక
సాక్షి, అనంతపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అర్హులైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలి రోజు షిఫరీస్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధువ్రీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. జిల్లాలో 19 పోస్టులు భర్తీ కావాల్సి ఉండగా.. 834 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్షల్లో 65 మంది అర్హత సాధింంచారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రూల్ ఆఫ్ రోస్టర్‌లో 12 మంది అభ్యర్థులు మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరి ధ్రువీకరణ పత్రాలను జేసీ–2 సుబ్బరాజు, జెడ్పీ సీఈఓ శోభాస్వరూపరాణి, మత్య్స శాఖ డీడీ హీరా నాయక్ పర్యవేక్షణలో అధికారులు పరిశీలన చేశారు. భర్తీ కావాల్సిన మరో ఏడు పోస్టులకు సంబంధించి రెండో జాబితా విడుదల చేస్తారా? లేదా మరో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారా తేలాల్సి ఉంది. కాగా, సాంకేతిక సమస్యల వల్ల సర్టిఫికెట్ల పరిశీలనలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. సమాచారం ఉన్న వారికే అనుమతి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించినట్లు సంబంధిత శాఖల నుంచి ఎస్ఎంఎస్ లేదా ఈ–మెయిల్ అందుకున్న వారు మాత్రమే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంది. ఈ విషయంపై ఇప్పటికే అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థి ఏ సెంటర్‌కు హాజరు కావాలి, ఎన్ని గంటలకు అనే సమాచారం వారి మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్ చేశారు. దీని ఆధారంగా అభ్యర్థులు తాము ఆన్లైన్లో ఇప్పటికే అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల నకళ్లను తీసుకుని హాజరు కావాల్సి ఉంటుంది. నేడు పరిశీలన జరిగే అవకాశమున్న శాఖలు మంగళవారం హార్టికల్చర్, సెరికల్చర్, అగ్రికల్చర్, అనిమల్ అస్బెండరీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన జరిగే అవకాశం ఉంది. ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుకున్న అభ్యర్థులు ఎస్ఎస్బీఎన్ కళాశాలలో సర్టిఫికెట్లు పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆందోళన చెందవద్దు గ్రామ, వార్డు సచివాలయ పోస్టులు అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన విషయంగా ఆందోళన పడరాదు. కొన్ని అనివార్య కారణాల వల్ల నెట్వర్క్ సమస్యలు తలెత్తడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సోమవారం ఫిషరీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన నిర్వహించాం. అలాగే ఇతర శాఖల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా సమాచారం అందజేశాం. సమాచారం అందుకున్న వారు మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలోఎక్కడా ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. వదంతులు నమ్మరాదని అభ్యర్థులకు సూచిస్తున్నాం. – శోభాస్వరూపరాణి, సీఈఓ, జిల్లా పరిషత్ -
ఆర్యూ పీజీ సెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం
సాక్షి, కర్నూలు(గాయత్రి ఎస్టేట్) : రాయలసీమ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పీజీ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సోమవారం ఆర్యూ లైబ్రరీ హాల్లో ప్రారంభమైంది. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అమర్నాథ్ ప్రక్రియను ప్రారంభించారు. వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధ్రువపత్రాల పరిశీలన ప్రశాంతంగా సాగింది. అనంతపురం ఎస్కేయూ పరిధిలో డిగ్రీ చదివి ఆర్యూ పీజీ సీట్ రాసి మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు నిరాసే మిగిలింది. ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల చేయక పోవటంతో విద్యార్థులు డిగ్రీ ధ్రువపత్రాలను తెచ్చుకో లేకపోయారు. మంచి ర్యాంకులు తెచ్చుకున్న ఐదుగురు విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సబ్జెక్టుకు 22, బాటనీ సబ్జెక్టుకు 117, కంప్యూటర్ సైన్స్‌కు 113, బయోటెక్నాలజీ సబ్జెక్టుకు 19 మంది మొత్తం 271 మంది విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించామని పీజీ సెట్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయకుమార్ పేర్కొన్నారు. ఎంఈడీ కోర్సు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీని మార్చినట్లు పేర్కొన్నారు. జూలై 31వ తేదీ ఉదయం 10 నుంచి 1 గంట వరకు పరిశీలించడం జరుగుతుందన్నారు. వెబ్ఆప్షన్లు ఆగస్టు 1వ తేదీన ఇచ్చుకోవచ్చన్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంగ్లిష్, ఓఆర్ అండ్ ఎస్‌క్యూసీ సబ్జెక్టులకు సంబంధించి అన్ని కేటగిరీల వారు 1 నుంచి చివరి ర్యాంకు వరకు హాజరు కావాలన్నారు. అవకాశం కల్పించండి ఆర్యూ పీజీసెట్ కౌన్సె లింగ్‌కు అవకాశం కల్పించాలి. మాది ప్యాపిలి మండలం నల్లమేకల పల్లి గ్రామం. యాడికి వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివాను. నాకు ఆర్యూ పీజీసెట్‌లో 27వ ర్యాంకు వచ్చింది. ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల చేయక పోవటంతో నాకు ఆర్‌యూలో పీజీ చేరే అవకాశం లేకుండా పోతోంది. వర్సిటీ అధికారులు స్పందించి అవకాశం కల్పించి ఉన్నత విద్య చదువుకోడానికి అవకాశం ఇవ్వాలి. – వెంకటకృష్ణారెడ్డి, ఫిజిక్స్ 27వ ర్యాంకు -
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 67.59% హాజరు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీలో ప్రవేశానికి ఈనెల 19 నుంచి నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియకు ఇప్పటివరకూ 67.59 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు వెల్లడించారు. వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియను ఈనెలాఖరులోగా ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటివరకు విజయనగరం, అనంతపురం జిల్లాల్లో సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభమే కాలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని వెబ్‌కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సోమవారం సీమాంధ్రలో 38 కేంద్రాలకు గాను 19 పనిచేయగా.. వీటిలో 6,469 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరయ్యారని, తెలంగాణలో 22 కేంద్రాలకు గాను 5,420 మంది హాజరయ్యారని.. మొత్తంగా 11,889 మంది హాజర య్యారని తెలిపారు. ఇప్పటివరకు 1,20,000 వరకు ర్యాంకర్లను పిలవగా.. 81,117 మంది హాజరయ్యారన్నారు. మంగళవారం పాలిటెక్నిక్ అధ్యాపకులతో సాంకేతిక విద్య కమిషనర్ మరోసారి చర్చిస్తారని, అధ్యాపకులు సమ్మతిస్తే మరికొన్ని కేంద్రాలు పనిచేస్తాయని చెప్పారు. బీ-కేటగిరీపై న్యాయ సలహా: ఇంజనీరింగ్ యాజమాన్య కోటాలో బీ-కేటగిరీ అడ్మిషన్లను ఆన్లైన్లోనే భర్తీ చేయాలంటూ హైకోర్టు ధర్మాసనం తీర్పునివ్వడంతో ఈనెల 13వ తేదీ నాటి నోటిఫికేషన్ రద్దు చేసి, తాజా తీర్పు మేరకు కొత్త నోటిఫికేషన్ జారీచేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. అయితే 13 నాటి నోటిఫికేషన్ ప్రకారం స్వీకరించిన దరఖాస్తుల పరిస్థితి, భర్తీ చేసిన ప్రవేశాల స్థితిపై న్యాయ సలహా తీసుకోవాలని మండలి భావిస్తోంది. ఇప్పటికే తాము సీట్లు భర్తీ చేసినందున కొత్త నోటిఫికేషన్ ఇవ్వరాదని యాజమాన్యాలు వాదిస్తున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటే.. సీట్ల భర్తీ సులభంగా ఉంటుందని మరికొన్ని కళాశాలలు భావిస్తున్నాయి. 13 నాటి నోటిఫికేషన్ ప్రకారం దాదాపు 580 కళాశాలలు తమ దరఖాస్తు ఫారాన్ని ఉన్నత విద్యామండలి వెబ్సైట్లో పొందుపరిచాయి. న్యాయ సలహా తీసుకున్న తరువాత ఒకట్రెండు రోజుల్లో బీ-కేటగిరీ సీట్ల భర్తీకి మార్గదర్శకాలు జారీచేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తెలిపారు.