సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీలో ప్రవేశానికి ఈనెల 19 నుంచి నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియకు ఇప్పటివరకూ 67.59 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు వెల్లడించారు. వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియను ఈనెలాఖరులోగా ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటివరకు విజయనగరం, అనంతపురం జిల్లాల్లో సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ ప్రారంభమే కాలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని వెబ్‌కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
సోమవారం సీమాంధ్రలో 38 కేంద్రాలకు గాను 19 పనిచేయగా.. వీటిలో 6,469 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరయ్యారని, తెలంగాణలో 22 కేంద్రాలకు గాను 5,420 మంది హాజరయ్యారని.. మొత్తంగా 11,889 మంది హాజర య్యారని తెలిపారు. ఇప్పటివరకు 1,20,000 వరకు ర్యాంకర్లను పిలవగా.. 81,117 మంది హాజరయ్యారన్నారు. మంగళవారం పాలిటెక్నిక్ అధ్యాపకులతో సాంకేతిక విద్య కమిషనర్ మరోసారి చర్చిస్తారని, అధ్యాపకులు సమ్మతిస్తే మరికొన్ని కేంద్రాలు పనిచేస్తాయని చెప్పారు.
బీ-కేటగిరీపై న్యాయ సలహా: ఇంజనీరింగ్ యాజమాన్య కోటాలో బీ-కేటగిరీ అడ్మిషన్లను ఆన్‌లైన్‌లోనే భర్తీ చేయాలంటూ హైకోర్టు ధర్మాసనం తీర్పునివ్వడంతో ఈనెల 13వ తేదీ నాటి నోటిఫికేషన్ రద్దు చేసి, తాజా తీర్పు మేరకు కొత్త నోటిఫికేషన్ జారీచేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. అయితే 13 నాటి నోటిఫికేషన్ ప్రకారం స్వీకరించిన దరఖాస్తుల పరిస్థితి, భర్తీ చేసిన ప్రవేశాల స్థితిపై న్యాయ సలహా తీసుకోవాలని మండలి భావిస్తోంది.
ఇప్పటికే తాము సీట్లు భర్తీ చేసినందున కొత్త నోటిఫికేషన్ ఇవ్వరాదని యాజమాన్యాలు వాదిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటే.. సీట్ల భర్తీ సులభంగా ఉంటుందని మరికొన్ని కళాశాలలు భావిస్తున్నాయి. 13 నాటి నోటిఫికేషన్ ప్రకారం దాదాపు 580 కళాశాలలు తమ దరఖాస్తు ఫారాన్ని ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో పొందుపరిచాయి. న్యాయ సలహా తీసుకున్న తరువాత ఒకట్రెండు రోజుల్లో బీ-కేటగిరీ సీట్ల భర్తీకి మార్గదర్శకాలు జారీచేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తెలిపారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 67.59% హాజరు
Published Tue, Aug 27 2013 5:58 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement