రిజిస్ట్రార్‌పై దాడికి యత్నిస్తున్న రత్నప్పచౌదరి
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): స్టాఫ్ అప్రూవల్ కమిటీ బీఈడీ కళాశాలల అధ్యాపకుల ధ్రువపత్రాల పరి శీలనలో నిబంధనల మేరకు వ్యవహరిస్తామని చెప్పిన రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ బి.అమర్‌నాథ్‌పై ప్రైవేట్ బీఈడీ కళా శాలల యాజమాన్యాల సభ్యులు తీవ్ర దుర్భాషలాడుతూ దాడికి యత్నించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళవారం వర్సిటీలో స్టాఫ్ అప్రూవల్ కమిటీ బీఈడీ కళాశాలల అధ్యాపకుల ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. నిబంధనల మేరకు అధ్యాపకుల ధ్రువపత్రాలను తమ వద్ద నెల రోజుల పాటు డిపాజిట్ చేసుకుంటామని కమిటీ తెలిపింది. దీంతో ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాల సంఘం నాయకుడు, కర్నూలు ఎస్‌ఎల్‌వీ బీఈడీ కళాశాల కరస్పాండెంట్ తిరుపతయ్యగౌడ్ వెరిఫికేషన్‌ను అడ్డుకుని.. అధ్యాపకులందరినీ బయటికి పంపించేశారు.
ఆయనతో పాటు అనంతపురం ఎస్‌కే యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రత్నప్పచౌదరి, మరికొందరు బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఫూటుగా మద్యం సేవించి సాయంత్రం రిజిస్ట్రార్ ఛాంబర్‌కు వచ్చి నానా దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. ‘‘సీఎం మావాడు..మంత్రి మావాడు.. ఇది మా ప్రభుత్వం..మా మాట వినకపోతే నీ సంగతి చూస్తాం..నిన్ను బతకన్విం’’.. అంటూ రిజిస్ట్రార్‌ను నానా దుర్భాషలాడారు. రత్నప్పచౌదరి చెప్పు తీసి దాడి చేయడానికి యత్నించగా అక్కడున్న ఉద్యోగులు అడ్డుకుని వారించారు.
వర్సిటీలోని ఉద్యోగులంతా వచ్చి రిజిస్ట్రార్‌కు అండగా నిలవడంతో వారు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఈ విషయమై కర్నూలు తాలూకా ఎస్‌ఐ భాస్కరరాజును సాక్షి వివరణ కోరగా.. గొడవ జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని..యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. కాగా రిజిస్ట్రార్, ప్రొఫెసర్ అమర్‌నాథ్‌పై దాడిని నిరసిస్తూ ఆర్‌యూ విద్యార్థి జేఏసీ బుధవారం వర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment