కర్నూలు(ఆర్‌యూ): రాయలసీమ యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిబంధనలకు అర్థం తెలియదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనేందుకు నిదర్శనాలు కోకొల్లలు. ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొన్నా మా తీరింతే అన్నట్టుగా ఉంది. కోర్టులు చీవాట్లు పెట్టినా... కొందరు విద్యార్థులు చులకనగా మాట్లాడినా వెనక్కి తగ్గరనేందుకు రెండు సంవత్సరాల కాలపరిమితితో నియమించబడిన ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇంక్రిమెంట్ ఇవ్వడానికి పూనుకోవడం మరో సాక్ష్యంగా నిలిచింది. ఈ విషయాన్ని గుర్తించిన నాన్ టీచింగ్ సిబ్బంది గురువారం మూకుమ్మడిగా ఫైల్ సిద్ధం చేసిన అధికారిని నిలదీయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేశానని చెప్పడంతో గుట్టు బట్టబయలైంది.
అంతా మా ఇష్టం...
ఆర్‌యూ ఉన్నతాధికారులు అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తునారనేందుకు ఇంక్రిమెంట్ ఇవ్వదలచిన కాంట్రాక్టు ఉద్యోగికి నెలకు రూ. 40 వేలకు పైగా జీతం ఇవ్వడంతోపాటు హెచ్‌ఆర్‌ఎ ఇవ్వడం నిదర్శనం. సర్వీస్ రిజిస్టర్ లేకుండానే ఇంక్రిమెంట్లు ఎలా ఇస్తారనేది అర్థమవ్వని విషయం. అంతర్గత ఒప్పందం మేరకు నియమించుకుని దొడ్డిదారిన పర్మనెంట్ చేయడానికే ఈ ఎత్తుగడని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. వాస్తవానికి ఈ ఉద్యోగానికి సూపరింటెండెంట్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగి అర్హుడు. అయితే ప్రైవేట్ ఐటీ సంస్థలో పని చేస్తున్న ఈ వ్యక్తిని నియమించడమే నిబంధనలకు విరుద్ధం. అప్పట్లో విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు కూడా. వైస్ చాన్స్‌లర్ నరసింహులు పదవీ కాలం ఏప్రియల్ 9వ తేదీతో ముగుస్తుంది. ఈలోగా ఇంక్రిమెంట్లు ఇచ్చేస్తే భవిష్యత్తులో ఈ ఇంక్రిమెంట్ల ఆధారంగా పర్మినెంట్ ఉద్యోగిగా స్థిరపడేందుకు ఎత్తుగడ అనే అనుమానం వ్యక్తం అవుతున్నాయి.
నాన్‌టీచింగ్ సిబ్బంది పాపమేంటి ?
వర్సిటీలో టైం స్కేల్ పొందుతున్న నాన్ టీచింగ్ సిబ్బంది 12 మంది ఉన్నారు. ఖాళీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వీరిని వదిలేసి మూడేళ్ల నుంచి మాత్రమే పని చేస్తున్న ఆ వ్యక్తిని పర్మనెంట్ చేయడానికి పావులు కదపడంలో మతలబ్ ఏంటి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా 110 మంది చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కంట్రాక్టు సిబ్బందికి టైంస్కేలు ఇవ్వని ఉన్నతాధికారులు సదరు ఉద్యోగికి అడ్డదారిన ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు చేస్తున్న తీరును ఉద్యోగులు తప్పుపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment