ఉద్యోగం.. అమ్మకం
కర్నూలు(జిల్లా పరిషత్): మీకు ఉద్యోగం కావాలా..?. అయితే రాయలసీమ యూనివర్సిటీకి వెళ్లండి. అక్కడి అధికారులు, ఉద్యోగులను ప్రసన్నం చేసుకుంటే చాలు. మీరు దర్జాగా అక్కడ పాగా వేసినట్లే. ముందుగా డైలీ వర్కర్ పేరుతో మీకు అధికారులు స్థానం కల్పిస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా కాంట్రాక్టు వర్కర్‌గా మారుస్తారు.
ఆ తర్వాత మీ దశ తిరిగినట్లే. ప్రభుత్వ నిబంధనల మేరకు మీకు జీతభత్యాలు సమకూరుస్తారు. రాయలసీమ యూనివర్సిటీలో ఏళ్ల తరబడి ఈ దందా కొనసాగుతోంది. అధికారులు, ఉద్యోగులు, కొన్ని ప్రజా సంఘాలు కలిసి పోస్టులను బహిరంగంగానే అమ్ముకుంటున్నా అడిగే నాథుడు కరువయ్యారు.
రాయలసీమ యూనివర్సిటీలో అక్రమ నియామకాలు జోరందుకున్నాయి. పత్రికల్లో నోటిఫికేషన్ లేకుండా రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకుండా పదుల సంఖ్యలో ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇక్కడ పనిచేసే అధికారులు వారి హయాంలో ఎవరికి వారు వేల రూపాయల మామూళ్లు తీసుకుంటూ ఉద్యోగాలు ఇస్తూ పోయారు. ముందుగా వర్సిటీలోని హాస్టళ్లు, వంటశాలల్లో తాత్కాలిక అవసరాల నిమిత్తం డైలీ వర్కర్లుగా స్థానం కల్పిస్తారు.
మొదట్లో తక్కువ జీతంతో ఉద్యోగంలో చేర్చుకుని, ఆ తర్వాత కొంత కాలానికే వారిని కాంట్రాక్టు ఉద్యోగులుగా మారుస్తారు. ఇలా నియమితులైన వారిని ప్రతి నెలా అధికారులే రెన్యువల్ చేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి వర్సిటీలో ఇప్పటిదాకా 160 మందికి పైగా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిపారు. ఇలా నియామకం పొందిన ఉద్యోగులు నేడు జీవో నెం.3 ప్రకారం భారీగా వేతనాలు పొందుతున్నారు. డైలీ వర్కర్లుగా చేరిన మొత్తం 160 మందికి పైగా ఉద్యోగుల్లో 117 మంది కాంట్రాక్టు పద్ధతికి మార్చేశారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన యూనివర్శిటిల్లో అవసరాల మేరకు కాంట్రాక్టు, డైలీ వేజెస్ కింద నియామకాలు చేపట్టుకోవచ్చని 2008లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇలా నియామకాలు చేయాలంటే నోటిఫికేషన్ జారీ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. నియామకాల్లో పాలక మండలి(ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్) అనుమతి తీసుకోవాలి. రాయలసీమ యూనివర్సిటీకి పాలక మండలి లేకపోవడంతో మానిటరింగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీఅనుమతి పొందాలి.
కమిటిలో ఉన్నత విద్య కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్, కమిషనర్ ఆఫ్ కాలేజేట్, స్టేట్ కౌన్సిల్ చైర్మన్, వీసీ, రిజిస్ట్రార్‌లు ఉంటారు. అధిక శాతం నియామకాలు ఈ కమిటీ అనుమతి తీసుకోకుండానే చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైలీ వేజెస్ పేరుతో నియామకాలు చేపట్టి ఆ తర్వాత కాంట్రాక్టు పద్ధతికి మార్చేస్తున్నారు. నియామకాల్లో అటు ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు, పలు ప్రజాసంఘాల నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
ప్రజాప్రతినిధుల ఒత్తిడి చూపుతూ సందట్లో సడేమియా అంటూ సొంత వారికీ, మరికొంత మామూళ్లు ఇచ్చే వారికీ వర్సిటీలో చోటు కల్పిస్తున్నారు. గత నవంబర్‌లోనూ అధికారులు 23 మంది డైలీ వర్కర్లకు కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చారు. ఆ తర్వాత మరో 35 మందిని డైలీ వేజెస్ కింద నియామకాలు చేపట్టినట్లు సమాచారం. పోస్టు రెగ్యులర్ అవుతుందంటూ ఒక్కో పోస్టుకు రూ.50వేల నుంచి రూ.1లక్ష వరకు వసూలు చేసినట్లు వర్సిటీలో చర్చ జరుగుతోంది. వర్సిటీలో ఏళ్ల తరబడి జరిగిన ఈ నియామకాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని విద్యార్థులు కోరుతున్నారు.