Contract Worker
-
పోల్ పైనే ప్రాణం పోయింది
మల్కాజిగిరి: కాంట్రాక్టర్ పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కరెంట్ షాక్‌తో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన సంఘటన గురువారం మౌలాలి సబ్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒరిస్సాకు చెందిన సంతోష్, తేజేశ్వర్(22) అన్నదమ్ములు. మూసాపేట జనతానగర్‌లో ఉంటూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారు. రెండు రోజులుగా మౌలాలి సబ్‌స్టేషన్ పరిధిలో సుధాకర్ అనే కాంట్రాక్టర్ నేతృత్వంలో విద్యుత్ పోల్స్ , వైర్లు బిగించే పనులు చేస్తున్నారు. గురువారం ఉదయం విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లు బిగిస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో తేజేశ్వర్ స్తంభంపైనే మృతి చెందాడు. సంతోష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాంట్రాక్టర్ సుధాకర్, డీఈ సుభాష్, ఏడీఈ శ్రీనివాసరెడ్డి, ఏఈ నాగశేఖర్‌రెడ్డి, లైన్మెన్ వెంకటేశ్వర్లు నిర్లక్ష్యం కారణంగానే తన తమ్ముడు మృతి చెందాడని ఆరోపిస్తూ సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్ధానిక కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్ సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. తేజేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
ఎక్కడిదీ ‘చెత్త': నాకే వైరస్ వచ్చినట్టు...
వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి కోవిడ్ -19 (కరోనా వైరస్) ను అడ్డుకునేందుకు 21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్మికుడి జీవనం, అతడు భయంకరమైన అనుభవాలు, ఎదుర్కొంటున్న వివక్ష మనుసును ద్రవింప చేస్తోంది. హృదయాలను కదిలిస్తూ.. అసలు ‘చెత్త' ఎక్కడుంది. దీన్ని వదిలించుకోవాల్సింది ఎవరు? ఎక్కడ..అనే ప్రశ్నల్ని లేవనెత్తుతుంది. ఢిలీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) లో కాంట్రాక్ట్ కార్మికుడు మనోజ్ పాల్ (37). ప్రతిరోజు ఉదయం తనకు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లి చెత్తను సమీకరించడం, దానికి సెగ్రిగేట్ చేసి దూరంగా పారవేయడం ఇదీ మనోజ్ డ్యూటీ. ఇతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన ఇంట్లోని సెకండ్ హ్యాండ్ టెలివిజన్ ద్వారా లాక్ డౌన్ వార్త అతని చెవిని పడింది. మహమ్మారి ప్రజలను బలవంతంగా ఇంట్లో వుండేలా చేస్తే..అతని జీవనంలో మాత్రం ఎలాంటి మార్పులేదు.. ఎప్పటిలాగానే మరుసటి రోజు తెల్లవారుజామున లేచి పాల్ పట్పర్గంజ్ పారిశ్రామిక ప్రాంతంలోని తన కాంట్రాక్టర్ కార్యాలయానికి వెళ్లి రిజిస్టర్లో సంతకం చేసి, కిలోమీటరు దూరంలో ఉన్న ఈడీఎంసీ కార్యాలయానికి వెళ్లి ..ఆపై తనకు కేటాయించిన టిప్పర్ ట్రక్కు ఎక్కడంతో డ్యూటీ మొదలవుతుంది. ఉదయం 9 గంటల్లా పట్పర్గంజ్లోని మొదటి కాలనీకి రిపోర్ట్ చేయాలి. అనేక గేటెడ్ పరిసరాల్లో తమ చెత్తను పారవేసేందుకు వారే గేటు వద్దకు వస్తారు, లేదా కాలనీకి చెందిన ఒక కార్మికుడు ప్రతి ఇంటి నుండి సేకరించి పాల్ వ్యాన్‌లో పడవేస్తాడు. అయితే ఇక్కడే తనకు అనేక భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి అంటారు మనోజ్. మనోజ్ మాటల్లో : గత నాలుగు రోజులుగా అందరూ నన్ను వైరస్ సోకిన వాడిలా, ఏదో అనారోగ్యంతో ఉన్నట్లు చూస్తున్నారు. భయం భయంగా చూస్తూ.. చెత్తను అందిస్తున్నారు. నిజానికి సాధారణ రోజులలో కూడా ఇలాంటి వివక్షనే ఎదుర్కొంటాం.. ప్రస్తుత తరుణంలో ప్రజల ధోరణి, నన్ను చూసే విధానం ఇంకా ఘోరంగా తయారైంది..గత ఒక వారంగా,ఎక్కువ మంది మాస్క్ లతో, లేదా వస్త్రంతో జాగ్రత్తగా కప్పుకుని వస్తారు.. నా చేతిని తాకకకుండా ఉండేందుకు చాలా జాగ్రత్త పడతారు. కొందరైతే చేతులు కడుక్కోవడానికి ఇంటికి వెళ్లేదాకా కూడా ఆగరు. వెంటనే నా ముందే సానిటైజర్లు వేసుకుని రద్దుకుంటారంటే ఆవేదన వ్యక్తం చేశారు. రోజు పెరుగుతున్న కొద్దీ పని తీవ్రత కూడా పెరుగుతుంది. చెత్తలో ప్రజలు వాడి పారేసిన మాస్క్ లుకూడా వుంటాయి తెలుసా.. భోజనానికి అరగంట విరామం తీసుకుంటాను. భార్య కట్టిచ్చింది తినడానికి 15 నిమిషాలు.ఆ తరువాత ఇంటికి ఫోన్ చేసి వాళ్ల గురించి అడుగుతా అంటూ చెప్పారు రెండు రోజుల క్రితం వరకూ గ్లౌజులు, మాస్క్ లు ఎంటా వుంటాయో కూడా తెలియని మనోజ్ తన చిరిగిన గ్లౌజ్ ను అప్యాయంతా తడుముతూ. మనోజ్ చెప్పిన ఇంకో భయంకరమై విషయం గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాలి. కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యి హోం క్వారంటైన్ లో ఉన్న ఇళ్లలోని చెత్త పరిస్థితి ఏంటి. ఆ చెత్తను ఎవరు తీస్తారు. దీనికి కూడా మనోజ్ వద్ద సమాధానం వుంది. అధికారుల ఆదేశాల మేరకు గృహ నిర్బంధంలో ఉన్న నాలుగు ఇళ్లు నాకు కేటాయించిన జోన్లో ఉన్నాయి. ఈ ఇళ్ళ నుండి వ్యర్థాలను నేనే సేకరించడాలి. ఇందుకు ఒక ప్రత్యేక ట్రక్ ఉంది అంటారు నిర్వేదంగా చూస్తూ... శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు గట్రా లేవుగా.. మరి వారి వ్యక్తిగత రక్షణ ఎలా? పనిని ముగించిన తరువాత సాయంత్రం 5.30కు తన సహచరులతో ఒక కప్పు టీ తాగి సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరతా.. పిల్లలు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు.. పిల్లలకు వైరస్ అంటుకుంటుందని భయం. జాగ్రత్తగా వుండాలిగా.. అందుకే బూడిదతో బాగా చేతులు రుద్దుకొని, నీళ్లతో కడుక్కుంటాను...దుమ్మంతా శుభ్రంగా దులుపుకుంటాను. అయినా వైరస్ తో చావాలని ఆ విధి రాసి పెడితే.. ఏ దేవుడూ రక్షించలేడు అంటారు వేదాంతిలా.. అన్నట్టు మరో విషయం ప్రతి రోజు రాత్రి 9 గంటలకు అందరూ తప్పకుండా కలిసి భోంచేయాలని మనోజ్ కుటుంబం ఒట్టు పెట్టుకుందిట. టీవీలో వస్తున్న వార్తల్ని చూస్తూ...విదేశాలనుంచి విమానాల ద్వారా వచ్చిన ధనవంతులనుంచి ఈ వైరస్ వచ్చిందని నాకు తెలుసు...కానీ నిజానికి ఫలితం మాత్రం నాలాంటి వాళ్లదే అంటారు మనోజ్ చెమ్మగిల్లిన కళ్లతో. (హిందుస్తాన్ టైమ్స్ కథనం ఆధారంగా) -
నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం
పూసపాటిరేగ: మండలంలోని కొప్పెర్ల విద్యుత్ సబ్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో విద్యుత్ శాఖ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే...తొత్తడాం గ్రామానికి చెందిన గొరుసు అప్పలరాములు (30) విద్యుత్ కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో గురుకుల పాఠశాల సమీపంలో విద్యుత్ స్తంభంపై అప్పలరాములు పనులు చేస్తున్నాడు. ఈ విషయం గ్రహించని కొప్పెర్ల సబ్‌ష్టేషన్ విద్యుత్‌శాఖ షిప్టు ఆపరేటర్ విద్యుత్‌ను పునరుద్ధరించాడు. దీంతో అప్పలరాములు షాక్‌కు గురై తలకు తీవ్ర గాయమై రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య అప్పలకొండ, కుమారుడు బంగారయ్య వున్నారు. అప్పలరాములు భార్య అప్పలకొండ నిండు గర్భిణి. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకొంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న అప్పలరాములు అనుకోని విధంగా విద్యుత్ ప్రమాదంలో మృతి చెందడంతో రోదనలు మిన్నంటాయి. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. పూసపాటిరేగ ఎస్ఐ జి.కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి
నంద్యాల: విద్యుత్ స్తంభంపై పనులు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ ప్రసారం కావడంతో ఓ కాంట్రాక్టు ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్ రోడ్డులో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. వెంకటేశ్వర్లు అనే కాంట్రాక్ట్ ఉద్యోగి శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ స్తంభంపై పని చేస్తున్నాడు. అతనికి తెలియకుండా విద్యుత్ ప్రసారాన్ని ఆన్ చేయడంతో వెంకటేశ్వర్లు షాక్‌కు గురై స్తంభంపై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు ట్రాన్స్‌కో కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే పరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. -
మ్యాగీ ఉద్యోగి ఆత్మహత్య
నైనితాల్: ఉత్తరాఖండ్‌లో ఓ మ్యాగీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్ధానిక మ్యాగీ సంస్థలో పనిచేస్తున్న అతడు ఆ సంస్థ మూత పడటంతో ప్రాణం బలి తీసుకున్నాడు. మ్యాగీలో ఆందోళన కలిగించిన లెడ్ మోతాదు నెస్లే కొంపముంచిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ నైనితాల్‌కు సమీపంలోని రుద్రాపూర్‌లో ఓ మ్యాగీ ప్లాంట్ ఉంది. ఇందులో లల్టా ప్రసాద్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. నెస్లే కంపెనీ ఉత్పత్తులను 90 రోజులపాటు నిషేధించిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఆ సంస్థ మూతపడింది. దీంతో అందులో పనిచేసేవారంతా రోడ్డున పడ్డారు. మానసికంగా కుంగిపోయిన ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 13 రోజుల తరువాత దాని పరిణామం వెలుగు చూసింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దాదాపు 1100 మంది కాంట్రాక్టు కార్మికులు రోడ్డున పడ్డారట. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని మ్యాగీ శ్యాంపిళ్లను పరిశీలించిన హైకోర్టు దీనిపై నివేదిక పంపించాల్సిందిగా నెస్లేను కోరింది. తదుపరి విచారణను జూన్ 20 కి వాయిదా వేసింది. కాగా, మ్యాగీ నూడుల్స్‌ను నిషేధించడంతో రూ.320 కోట్ల విలువైన నూడుల్స్‌ను ధ్వంసం చేస్తున్నట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. మార్కెట్, ఫ్యాక్టరీల్లోని నిల్వలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. -
ఉద్యోగం.. అమ్మకం
కర్నూలు(జిల్లా పరిషత్): మీకు ఉద్యోగం కావాలా..?. అయితే రాయలసీమ యూనివర్సిటీకి వెళ్లండి. అక్కడి అధికారులు, ఉద్యోగులను ప్రసన్నం చేసుకుంటే చాలు. మీరు దర్జాగా అక్కడ పాగా వేసినట్లే. ముందుగా డైలీ వర్కర్ పేరుతో మీకు అధికారులు స్థానం కల్పిస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా కాంట్రాక్టు వర్కర్‌గా మారుస్తారు. ఆ తర్వాత మీ దశ తిరిగినట్లే. ప్రభుత్వ నిబంధనల మేరకు మీకు జీతభత్యాలు సమకూరుస్తారు. రాయలసీమ యూనివర్సిటీలో ఏళ్ల తరబడి ఈ దందా కొనసాగుతోంది. అధికారులు, ఉద్యోగులు, కొన్ని ప్రజా సంఘాలు కలిసి పోస్టులను బహిరంగంగానే అమ్ముకుంటున్నా అడిగే నాథుడు కరువయ్యారు. రాయలసీమ యూనివర్సిటీలో అక్రమ నియామకాలు జోరందుకున్నాయి. పత్రికల్లో నోటిఫికేషన్ లేకుండా రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకుండా పదుల సంఖ్యలో ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇక్కడ పనిచేసే అధికారులు వారి హయాంలో ఎవరికి వారు వేల రూపాయల మామూళ్లు తీసుకుంటూ ఉద్యోగాలు ఇస్తూ పోయారు. ముందుగా వర్సిటీలోని హాస్టళ్లు, వంటశాలల్లో తాత్కాలిక అవసరాల నిమిత్తం డైలీ వర్కర్లుగా స్థానం కల్పిస్తారు. మొదట్లో తక్కువ జీతంతో ఉద్యోగంలో చేర్చుకుని, ఆ తర్వాత కొంత కాలానికే వారిని కాంట్రాక్టు ఉద్యోగులుగా మారుస్తారు. ఇలా నియమితులైన వారిని ప్రతి నెలా అధికారులే రెన్యువల్ చేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి వర్సిటీలో ఇప్పటిదాకా 160 మందికి పైగా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిపారు. ఇలా నియామకం పొందిన ఉద్యోగులు నేడు జీవో నెం.3 ప్రకారం భారీగా వేతనాలు పొందుతున్నారు. డైలీ వర్కర్లుగా చేరిన మొత్తం 160 మందికి పైగా ఉద్యోగుల్లో 117 మంది కాంట్రాక్టు పద్ధతికి మార్చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన యూనివర్శిటిల్లో అవసరాల మేరకు కాంట్రాక్టు, డైలీ వేజెస్ కింద నియామకాలు చేపట్టుకోవచ్చని 2008లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇలా నియామకాలు చేయాలంటే నోటిఫికేషన్ జారీ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. నియామకాల్లో పాలక మండలి(ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్) అనుమతి తీసుకోవాలి. రాయలసీమ యూనివర్సిటీకి పాలక మండలి లేకపోవడంతో మానిటరింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీఅనుమతి పొందాలి. కమిటిలో ఉన్నత విద్య కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్, కమిషనర్ ఆఫ్ కాలేజేట్, స్టేట్ కౌన్సిల్ చైర్మన్, వీసీ, రిజిస్ట్రార్లు ఉంటారు. అధిక శాతం నియామకాలు ఈ కమిటీ అనుమతి తీసుకోకుండానే చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైలీ వేజెస్ పేరుతో నియామకాలు చేపట్టి ఆ తర్వాత కాంట్రాక్టు పద్ధతికి మార్చేస్తున్నారు. నియామకాల్లో అటు ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు, పలు ప్రజాసంఘాల నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధుల ఒత్తిడి చూపుతూ సందట్లో సడేమియా అంటూ సొంత వారికీ, మరికొంత మామూళ్లు ఇచ్చే వారికీ వర్సిటీలో చోటు కల్పిస్తున్నారు. గత నవంబర్లోనూ అధికారులు 23 మంది డైలీ వర్కర్లకు కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చారు. ఆ తర్వాత మరో 35 మందిని డైలీ వేజెస్ కింద నియామకాలు చేపట్టినట్లు సమాచారం. పోస్టు రెగ్యులర్ అవుతుందంటూ ఒక్కో పోస్టుకు రూ.50వేల నుంచి రూ.1లక్ష వరకు వసూలు చేసినట్లు వర్సిటీలో చర్చ జరుగుతోంది. వర్సిటీలో ఏళ్ల తరబడి జరిగిన ఈ నియామకాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని విద్యార్థులు కోరుతున్నారు.