
మల్కాజిగిరి: కాంట్రాక్టర్ పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కరెంట్ షాక్‌తో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన సంఘటన గురువారం మౌలాలి సబ్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒరిస్సాకు చెందిన సంతోష్, తేజేశ్వర్(22) అన్నదమ్ములు. మూసాపేట జనతానగర్‌లో ఉంటూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారు. రెండు రోజులుగా మౌలాలి సబ్‌స్టేషన్ పరిధిలో సుధాకర్ అనే కాంట్రాక్టర్ నేతృత్వంలో విద్యుత్ పోల్స్ , వైర్లు బిగించే పనులు చేస్తున్నారు.
గురువారం ఉదయం విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లు బిగిస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో తేజేశ్వర్ స్తంభంపైనే మృతి చెందాడు. సంతోష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాంట్రాక్టర్ సుధాకర్, డీఈ సుభాష్, ఏడీఈ శ్రీనివాసరెడ్డి, ఏఈ నాగశేఖర్‌రెడ్డి, లైన్‌మెన్ వెంకటేశ్వర్లు నిర్లక్ష్యం కారణంగానే తన తమ్ముడు మృతి చెందాడని ఆరోపిస్తూ సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్ధానిక కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్ సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. తేజేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment