ఆర్‌యూకు మహర్దశ
– రూ.48 కోట్లతో కొత్త భవనాల నిర్మాణం
- రిజిస్ట్రార్ అమర్‌నాథ్
కర్నూలు (ఆర్‌యూ) : రాయలసీమ యూనివర్శిటీకి మహర్దశ పట్టనుంది. రూ.48.20 కోట్లతో మహిళా హాస్టళ్ల భవనాలు(రెండు) నిర్మించనున్నట్లు రిజిస్ట్రార్ అమర్‌నాథ్ బుధవారం తెలిపారు. రూ.48.20 కోట్లతో ఎంఎన్‌డీసీలో తీర్మానం చేశారని, ప్రభుత్వ ఆమోదం, ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల పూర్తయిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ అనంతరం ఆర్‌అండ్‌బీకి అప్పగించి పనులు మొదలు పెడతామని పేర్కొన్నారు.
అతిపెద్ద లైబ్రరీ
వర్సిటీలో 25 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో అధునాతనమైన డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు రిజిస్ట్రార్ తెలిపారు. అలాగే మాథ్స్ బిల్డింగ్ ప్రహరీ, అంతర్గత రోడ్డు పేమెంటు నిర్మాణం చేపడతామన్నారు. ఇక సైన్స్ పరికరాల కోసం మంగళవారం రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో వీసీ నరసింహులు స్పెయిన్ కంపెనీ ఇడిబాన్ ఇంటర్నేషనల్ ఎస్‌ఏ చైర్మెన్‌తో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఈ కంపెనీ దేశంలో ఎంపిక చేసిన వర్సిటీల్లో 1500 కోట్లతో సైన్స్ పరికరాలను అందించనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. అలాగే వర్సిటీ ప్రాంగణంలో 5 అంతస్తుల్లో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. పది పడకల ఆస్పత్రిని నిర్మించి ఇద్దరు డ్యూటీ డాక్టర్లు, నర్సులను నియమిస్తామని తెలిపారు.