రాయలసీమ యూనివర్సిటీలో తాగునీటి సమస్య విద్యార్థులకు శాపంగా మారింది.
కర్నూలు (విద్య): రాయలసీమ యూనివర్సిటీలో తాగునీటి సమస్య విద్యార్థులకు శాపంగా మారింది. కనీసం వాడుకనీరు అందుబాటులో లేకపోవడంతో తరగతులు, హాస్టళ్ల నిర్వహణ అధికారులకు నిప్పుమీద కుంపటిలా తయారైంది. నీటి కొరతతో తరగతులు కూడా ప్రారంభానికి నోచుకోని పరిస్థితి నెలకొంది. గత రెండు మూడేళ్లుగా సమస్యతో అల్లాడుతున్నా జిల్లా అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు శివారులోని పసుపుల రోడ్డులో 2008లో ఏర్పాటు చేసిన రాయలసీమ యూనివర్శిటీలో వివిధ కోర్సుల కింద దాదాపు వెయ్యి మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఇందులో 600 మంది దాకా విద్యార్థినీ విద్యార్థులు హాస్టల్‌లో వసతి పొందుతున్నారు. విద్యార్థులతోపాటు భవనాలు, ల్యాబ్‌ల నిర్వహణ, 12 సైన్స్ డిపార్ట్‌మెంట్‌లు, ఆరు హాస్టళ్ల భవనాలకు నీరు సరఫరా చేయాల్సి ఉంది. దీనికితోడు 150 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న వ ర్శిటీలో ఇటీవల అకడమిక్ భవనాలు, కౌన్సిలింగ్, పరీక్ష, తరగతి గదులు నిర్మించారు. వీటి నిర్వహణకు వర్శిటీలో మూడు బోర్లు, ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. మూడు బోర్లలో ఒకే బోరు పనిచేస్తోంది.
ప్రత్యామ్నాయంగా అదనంగా బోర్లు వేస్తున్నా నీరు పడని పరిస్థితి. ఉన్న ఒక బోరులో కూడా వర్షాభావ పరిస్థితుల కారణంగా నీరు సక్రమంగా అందకపోవడంతో తరగతులను ప్రారంభిస్తే మళ్లీ నీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. దీంతో ఈనెల మొదటి వారంలో ప్రారంభం కావాల్సిన తరగతులను వర్శిటీ అధికారులు ఈనెల 21వ తేదీకి వాయిదా వేశారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ప్రస్తుతం ఉన్న బోరునుంచి నీరు వచ్చే పరిస్థితి లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. పరిస్థితిని కలెక్టర్, ప్రజాప్రతినిధులు, డీప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారంపై చొరవచూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం వర్శిటీ తమ పరిధిలోకి రాదని, నీటిని సరఫరా చేయడం కుదరదని తేల్చారు.