TNSF
-
ఇంకా మీరెందుకు రాజీనామా చేయలేదు
ఎచ్చెర్ల క్యాంపస్: ‘రాష్ట్రంలో చాలామంది వీసీలు రాజీనామా చేశారు. ఇంకా మీరెందుకు చేయలేదు. తక్షణమే రాజీనామా చేయండి..’ అని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం(బీఆర్‌ఏయూ) వైస్ చాన్స్‌లర్ ఆచార్య కేఆర్ రజిని, రిజిస్ట్రార్ పి.సుజాతలను తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్) నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ చాంబర్ ఎదుట గురువారం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బైఠాయించి ఆందోళన చేశారు.ముందుగా వీసీ వద్దకు వెళ్లి ‘ఇంకా మీరెందుకు రాజీనామా చేయలేదు’ అని ప్రశ్నించారు. ‘అది మీకు అనవసరం..’ అని వీసీ సమాధానం చెప్పారు. దీంతో వీసీ చాంబర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బైఠాయించి వీసీ, రిజిస్ట్రార్ తక్షణమే రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ గంటసేపు గొడవ చేశారు. వీసీ, రిజిస్ట్రార్, ఇతర అధికారులు, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారు.అనంతరం ‘మీరు రాజీనామా ఎలా చెయ్యరో చూస్తాం..’ అంటూ వీసీని హెచ్చరించి వెళ్లిపోయారు. మరోవైపు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కార్యాలయం నుంచి రాజీనామా చేయాలని వీసీకి పలుమార్లు హెచ్చరికలు వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు టీడీపీ అనుబంధ విద్యార్థి సంఘం టీఎన్ఎస్ఎఫ్ ఏకంగా వీసీ రాజీనామా చేయాలని హెచ్చరిస్తూ ఆందోళనకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీసీని అవమానించడం అన్యాయందళిత వీసీని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అవమానించడం, బెదిరించడం అన్యాయమని యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుజాత, రెక్టార్ అడ్డయ్య, ఓఎస్డీ కావ్య జ్యోత్స్న తదితరులు తీవ్రంగా ఖండించారు. వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఏర్పడిన 16 ఏళ్ల తర్వాత దళిత మహిళకు వీసీగా అవకాశం వస్తే అడ్డగోలుగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలు చేసేవారిపై జాతీయ మహిళా కమిషన్‌కు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.వైస్ చాన్సలర్ రజిని జనవరి 18న బాధ్యతలు చేపట్టారని, మూడేళ్లు కొనసాగుతారని స్పష్టంచేశారు. బలవంతపు రాజీనామాలు అన్యాయమని ఖండించారు. వీసీ చాంబర్ ఎదుట ఆందోళన చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చట్టపరంగా వర్సిటీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు యూనివర్సిటీలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల నిర్వహణకు సైతం ఆటంకం కలిగించారన్నారు. -
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రెచ్చిపోతున్న TNSF నేతలు
-
వైఎస్సార్ జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలు
సాక్షి, రాయచోటి: వైఎస్సార్ జిల్లా రాయచోటిలో టీడీపీ నేతలు బరితెగించారు. మాజీ కౌన్సిలర్ హజ్రత్ కుమారులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు ఫారుక్, అతని గ్యాంగ్ హజ్రత్ కుమారులతో గొడవకు దిగి చంపుతామంటూ కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. తౌహీద్ అనే యువకుడి పరిస్థితి విషమం ఉంది. వీరిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా దాడికి పాల్పడిన ఫారూక్ గ్యాంగ్ గతంలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పదవులన్నీ ఆ వర్గానికేనా
సాక్షి, అమరావతి: పేదరికమే తన కులమంటూ తరచూ సినీ డైలాగులు వల్లించే ముఖ్యమంత్రి చంద్రబాబు నిజానికి అధికారం చేపట్టిన నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంలో పార్టీ, ప్రభుత్వంలో తన సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని టీడీపీకే చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు పేర్కొంటున్నారు. రాజ్యసభ సభ్యత్వం నుంచి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లు చివరికి పార్టీ పదవుల్లోనూ సీఎం తన సొంత సామాజిక వర్గానికే అగ్రతాంబూలం కల్పించారు. తనవర్గం వారికివ్వగా మిగిలిన పదవులనే ఇతరులకు బిస్కెట్ల మాదిరిగా వేశారనే అభిప్రాయం పార్టీలోనే బలంగా వ్యక్తమవుతోంది. టీడీపీలో సీఎం సామాజికవర్గం మినహా మిగతావారు కీలక పదవి దక్కించుకోవాలంటే మోకాళ్లు అరిగిపోయేలా తిరగాల్సిందేనని విజయవాడకు చెందిన ఒక బీసీ నాయకుడు వ్యాఖ్యానించారు. ఒకవేళ అంత తిరిగినా గ్యారంటీ ఉండదని, సీఎం సామాజిక వర్గం అండదండలు ఉంటేనే పదవి వరిస్తుందనే అభిప్రాయం టీడీపీలో దిగువ స్థాయి నుంచి పైస్థాయి వరకూ వ్యక్తమవుతోంది. శాసనమండలిలోనూ 40 శాతం తనవారికే శాసనమండలిలో టీడీపీకి 30 మంది ఎమ్మెల్సీలు ఉండగా సీఎం సామాజిక వర్గానికి చెందిన పయ్యావుల కేశవ్, వైవీబీ రాజేంద్రపసాద్, నారా లోకేష్, గాలి సరస్వతమ్మ, వీవీవీ చౌదరి, కరణం బలరామకృష్ణమూర్తి, దొరబాబు (బీఎన్ రాజసింహులు), టీడీ జనార్థన్లకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన కేశవ్‌ను ఎమ్మెల్సీగా చేయడమే కాకుండామండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు. లోకేష్‌కు ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా ఎమ్మెల్సీ పదవితోపాటు మంత్రిని చేసి కీలక శాఖలిచ్చారు. వీవీవీ చౌదరి, టీడీ జనార్థన్‌లు చంద్రబాబు కోటరీలో అత్యంత ముఖ్యులు. పార్టీ పదవులు, ఇతర వ్యవహారాలన్నీ వీరే చక్కబెడతారు. అందువల్లే వారికి ప్రజలతో సంబంధం లేకపోయినా ఎమ్మెల్సీలను చేశారు. కొద్ది నెలల క్రితం మృతి చెందిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి చంద్రబాబుకు బంధువు, ఆప్తుడు. ఇలా శాసన మండలిలో 40 శాతం మంది తన మనుషులకే చంద్రబాబు అవకాశం కల్పించారు. ఐదుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు తనవారే ప్రస్తుతం టీడీపీకి ఐదుగురు రాజ్యసభ సభ్యులుంటే అందులో ఇద్దరు చంద్రబాబు సామాజికవర్గం వారే ఉన్నారు. సుజనా చౌదరి, కనకమేడల రవీంద్రకుమార్‌లు చంద్రబాబు కోటగిరీలో కీలక వ్యక్తులు. కనకమేడల కోసం దళిత వర్గానికి చెందిన వర్ల రామయ్యను చంద్రబాబు పక్కనబెట్టారు. దళితుల నుంచి వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందనే భయంతోనే రామయ్యకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారే తప్ప ఆ వర్గంపై బాబుకు ఏమాత్రం అభిమానం లేదని చెబుతారు. నిజంగానే అభిమానం ఉంటే రామయ్యను రాజ్యసభకు పంపి ఉండేవారని పార్టీలోనే చాలా రోజులు చర్చ జరిగింది. ఇక ఢిల్లీలో రాష్ట ప్రభుత్వం తరఫున అధికార ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహనరావు సైతం సీఎం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. తెలుగు యువత, కార్పొరేషన్లూ వారికే.. పార్టీ పదవుల్లో చంద్రబాబు తన సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. ఇటీవలే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి స్థానంలో తన వర్గానికే చెందిన దేవినేని అవినాష్‌ను కూర్చోబెట్టారు. టీఎన్ఎస్ఎఫ్ బ్రహ్మం చౌదరి, ఐటీ వింగ్ బ్రహ్మం చౌదరి, లీగల్ సెల్ గొట్టిపాటి శివరామకృష్ణప్రసాద్, స్వచ్ఛాంద్ర మిషన్ ఛైర్మన్ సీఎల్ వెంకట్రావు, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దివి శివరాం, గిడ్డంగుల సంస్థ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్, 20 సూత్రాల పథకం ఛైర్మన్ శేషసాయిబాబు, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, శ్యాప్ ఛైర్మన్ అంకమ్మ చౌదరి, వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా తన సామాజిక వర్గానికి చెందిన కోటేశ్వరరావును నియమించారు. సిఫారసు లేఖలు ఉంటేనే.. పదవుల పంపిణీలో చంద్రబాబు తనవారికే ప్రాధాన్యమిస్తుండడంపై పార్టీలో మొదటి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సమయంలో పైస్థాయిలో ముఖ్య నాయకులకు అరకొరగా పదవులిచ్చి మిగిలిన వాళ్ల నోళ్లు మూయించారు. పార్టీని భుజానెత్తుకుని మోస్తున్న తమను గుర్తించడంలేదని, ఐదేళ్లుగా ఎదురు చూపులతోనే కాలం గడిచిపోయిందని పలువురు వాపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం దరఖాస్తు చేసుకోవాలని పార్టీ అగ్రనాయకత్వం కిందిస్థాయి నాయకులకు సూచించడంతో వేల సంఖ్యలో వచ్చాయి. అయితే వీటిని పక్కనపడేసి స్థానిక ఎమ్మెల్యే / పార్టీ ఇన్‌ఛార్జి సిఫారసు చేసిన వారి పేర్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అంతేకాదు జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల సిఫారసు లేఖలు కూడా అడుగుతున్నారు. ఈ పదవులన్నీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్ సూచనల ప్రకారమే పంపిణీ చేశారు. కృష్ణా జిల్లాలో 16 మార్కెట్ కమిటీలకుగానూ 13 పదవులను సీఎం సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వడం గమనార్హం. తప్పనిసరి అయితేనే... టీడీపీలో కులానికే ప్రథమ ప్రాధాన్యమనే విషయం జగమెరిగిన సత్యమని పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు పేర్కొంటున్నారు. చంద్రబాబు పైకి నీతి సూత్రాలు వల్లించినా పాటించేది మాత్రం కుల సూత్రాన్నే అని స్పష్టం చేస్తున్నారు. సీఎం సామాజిక వర్గానికి చెందిన వారైతే సీఎంవోలో అయినా, పార్టీ కార్యాలయమైనా, చంద్రబాబు ఇంటి వద్దైనా ఆత్మీయత కనపడుతుంది. మిగిలిన వారి పట్ల అవసరం, పరిస్థితులను బట్టి కపట ప్రేమను ఒలకబోస్తుంటారని పార్టీకి చెందిన ఇతర నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చదవండి: ఖాకీవనంలో ‘కుల’కలం! సీఎం ‘సొంత’ లాభం! -
టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య గురువారం టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించింది. ర్యాలీగా వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా లోనికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి విషమించడంతో పోలీసులు కొందరు ఆందోళనకారులను అడ్డుకున్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న కేసీఆర్ ఆ హామీ మరిచి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీఆర్ఎస్ సర్కారుపై TNSF ఆగ్రహం
-
ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ధర్నా
నయీంనగర్ : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులను పైరవీలకు తావు లేకుండా భర్తీ చేయాలని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటోతు సంతోష్‌నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హన్మకొండలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా విద్యారంగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తుండగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం గర్హనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయకుండా, కాంట్రాక్టు టీచర్ల పేరిట అధికార పార్టీ నేతలు రూ.లక్షలు దండుకుంటున్నారని ఆరోపించారు. ఇకనైనా గురుకుల విద్యాలయాల్లో బోధన, బోధనేతర పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీచేయాలని, టెట్ తో సంబంధం లేకుండా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా టీటీసీ, డిగ్రీ పూర్తి చేసి అభ్యర్థులకు టీజీటీ పోస్టుల్లో అవకాశం కల్పించాలన్నారు. అలాగే, ఎంసెట్–2 ను రద్దు చేసి, అవకతవకలకు బాధ్యులను శిక్షించాలన్నారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అపురూప, సాంబరాం, మార్గం మహేశ్, మేర్గు వెంకటేశ్, శాగంటి రాకేష్, ఉమ, సంధ్య, రమ్య, స్వప్న పాల్గొన్నారు. -
టీఎన్ఎస్ఎఫ్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
– విద్యార్థి నాయకులపై పోలీసుల లాఠీచార్జి, అరెస్టు – లాఠీచార్జీకి నిరసనగా రేపు విద్యాసంస్థల బంద్ – టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూధన్‌రెడ్డి మహబూబ్‌నగర్ విద్యావిభాగం: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాలమూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్ గేటుపైకి ఎక్కిలోపలికి ప్రవేశించేందుకు యత్నించిన వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అంతకుముందు తెలంగాణ చౌరస్తాలో జరిగిన ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల హక్కులను కాలరాస్తూ ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని అన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండునెలలు కావస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని అన్నారు. దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేజీ టు పీజీ ఉచితవిద్య, లక్ష ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ నోటిఫికేషన్ వంటివి సీఎంకు గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు. కనీసం యూనివర్సిటీలకు వీసీలను నియమించే దిక్కు లేకుండాపోయిందని ఆరోపించారు. ఎంసెట్–2పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని, సంబంధిత మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కిశోర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, రాష్ట్ర, జిల్లా నాయకులు వడ్డె రమేష్, నిఖిల్, మున్నూరు చరణ్, నరేష్, పద్మాకర్, దినేష్, శ్రీనివాస్, విజయ్, శివ, జగన్, నవీన్, అభిరామ్ పాల్గొన్నారు. -
విద్యార్థుల భారీ ర్యాలీ
సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి రంగ సమస్యలపై నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తోందని టీడీపీ రాష్ట్ర మీడియా సెల్ ఇన్‌ఛార్జి ప్రతాప్‌రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మధుసూధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం సిద్ధిపేటలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులచే భారీర్యాలీ నిర్వహించారు. స్థానిక పాతబస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్డీవో కార్యాలయం వరకు చేరుకుంది. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నాయకులు ఆర్డీవో కార్యాలయంలో అందజేశారు. అంతకు ముందు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చీప్ లిక్కర్‌పై ఉన్న శ్రధ్ధ విద్యార్థులపై లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో విద్యార్థులు ఆత్మబలిదానం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం ఎదురుచూస్తున్నారని విమర్శించారు. సిద్ధిపేటలో వేలాది విద్యార్థులు రోడ్డెక్కి నిరసన చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్రనాయకులు చంద్రం, టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు రమేష్‌తో పాటు వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
కేసీఆర్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం
హన్మకొండ : హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మంగళవారం మద్యం మద్యంతో అభిషేకం చేశా రు. అభిషేకం చేసిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మేడారపు సుదాకర్, విద్యార్థి నాయకులను సుబేదారి పోలీసు లు అదుపులోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడారు. చీప్ లిక్కర్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించే వరకు టీఎ ఎన్ఎస్ఎఫ్ పోరాటం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాంబాబు, నగర కన్వీనర్ తక్కల్లపల్లి రాజు, ప్రధాన కార్యదర్శి లింగాల మధు. నాయకులు దొగ్గెల కుమారస్వామి, ముట్టె కిరణ్, ఎడ్ల అనిల్, కోడెల సాయిరాం తదితరులున్నారు. చీప్ లిక్కర్ బాటిళ్ల దండ.. వరంగల్ చౌరస్తా : వరంగల్ స్టేషన్ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద మాజీ శాఫ్ డెరైక్టర్, కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి సీయం కేసీఆర్ చిత్ర పటానికి చీప్ లిక్కర్ బాటిళ్లను దండగా వేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లిక్కర్ మద్యం విధానాన్ని విడనాడలని, లేనియెడల ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ మహిళా విభాగం నాయకురాళ్లు జన్ను ప్రమీల, జన్ను పుష్పా,లక్ష్మి, విజయ,నాయకులు గోరేమియా, జహీర్ ఖాన్, అలగోజు రమేష్, బాలరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. -
నారాయణ కాలేజీ ముందు విద్యార్థి ఫెడరేషన్ ధర్నా
గుంతకల్లు (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని నారాయణ జూనియర్ కాలేజీ ఎదుట తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ ధర్నాకు దిగింది. ఆదివారం సెలవు దినం అయినా కూడా తరగతులు నిర్వహిస్తున్నందుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తీవ్ర ఒత్తిళ్లకు గురైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. -
'తలసాని రాజకీయ అవకాశవాది'
మంత్రి తలసాని నివాసాన్ని ముట్టడించిన టీఎన్ఎస్ఎఫ్ హైదరాబాద్ సిటీ: వెస్ట్‌మారేడ్‌పల్లిలోని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివాసాన్ని టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు శుక్రవారం ముట్టడించారు. చీపుర్లు, చెప్పులు చేతపట్టుకుని‘ రాజకీయ అవకాశవాది తలసాని ఖబడ్దార్’, అంటూ నినాదాలు చేశారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని 10 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
టీఎన్ఎస్ఎఫ్కు ఆంజనేయ గౌడ్ రాజీనామా
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) జాతీయ అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఫ్యాక్స్ చేశారు. ఆంజనేయ గౌడ్ ఈ నెల 22న టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. -
క్లాస్రూమ్ పాలిటిక్స్
-
విద్యార్థులతో చెలగాటమొద్దు
* తీరు మారకుంటే ఉద్యమిస్తాం: ఆంజనేయగౌడ్ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ జాప్యం చేయడం ద్వారా తెలుగు విద్యార్ధులకు తీరని నష్టం చేయడంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుట్రలు చేస్తున్నారని తెలుగునాడు విద్యార్థి సంఘం జాతీయాధ్యక్షుడు ఆంజనేయగౌడ్ విమర్శించారు. 1956 నిబంధన విధించడం బీసీ విద్యార్థుల గొంతు కోయడానికేనని దుయ్యబట్టారు. ఈనెల 8న కలెక్టర్లకు వినతిపత్రాలు, 11న ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం, 13న రౌండ్‌టేబుల్ సమావేశాలు, 18న కలెక్టరేట్ల ముట్టడి చేయాలన్నారు. సోమవారం టీఎన్ఎస్ఎఫ్ జాతీయకమిటీ సమావేశమై ఈ అంశాలపై చర్చించింది. సమావేశంలో ఇరు రాష్ట్రాల అధ్యక్షులు బ్రహ్మం చౌదరి, మధుసూదన్‌రెడ్డితో పాటు రాజేష్, రవినాయుడు, సురేష్‌నాయక్, రమేష్ ముదిరాజ్, శ్యామ్‌సుందర్ శేషు తదితరులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల్లో టీడీపీ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయడానికి ఈ నెల 21న నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మేధోమథన సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆంజనేయగౌడ్ తెలిపారు.