ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ధర్నా
Published Sun, Jul 24 2016 11:43 PM | Last Updated on Fri, May 25 2018 5:44 PM
నయీంనగర్ : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులను పైరవీలకు తావు లేకుండా భర్తీ చేయాలని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్(టీఎన్‌ఎస్‌ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటోతు సంతోష్‌నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హన్మకొండలోని ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా విద్యారంగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తుండగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం గర్హనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయకుండా, కాంట్రాక్టు టీచర్ల పేరిట అధికార పార్టీ నేతలు రూ.లక్షలు దండుకుంటున్నారని ఆరోపించారు.
ఇకనైనా గురుకుల విద్యాలయాల్లో బోధన, బోధనేతర పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీచేయాలని, టెట్ తో సంబంధం లేకుండా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా టీటీసీ, డిగ్రీ పూర్తి చేసి అభ్యర్థులకు టీజీటీ పోస్టుల్లో అవకాశం కల్పించాలన్నారు. అలాగే, ఎంసెట్–2 ను రద్దు చేసి, అవకతవకలకు బాధ్యులను శిక్షించాలన్నారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు అపురూప, సాంబరాం, మార్గం మహేశ్, మేర్గు వెంకటేశ్, శాగంటి రాకేష్, ఉమ, సంధ్య, రమ్య, స్వప్న పాల్గొన్నారు.
Advertisement
Advertisement