తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేస్తున్న విద్యార్థులు
టీఎన్‌ఎస్‌ఎఫ్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
Published Sat, Jul 23 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
– విద్యార్థి నాయకులపై పోలీసుల లాఠీచార్జి, అరెస్టు
– లాఠీచార్జీకి నిరసనగా రేపు విద్యాసంస్థల బంద్
– టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూధన్‌రెడ్డి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాలమూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్ గేటుపైకి ఎక్కిలోపలికి ప్రవేశించేందుకు యత్నించిన వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అంతకుముందు తెలంగాణ చౌరస్తాలో జరిగిన ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల హక్కులను కాలరాస్తూ ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని అన్నారు.
విద్యాసంవత్సరం ప్రారంభమై రెండునెలలు కావస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని అన్నారు. దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేజీ టు పీజీ ఉచితవిద్య, లక్ష ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ నోటిఫికేషన్ వంటివి సీఎంకు గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు. కనీసం యూనివర్సిటీలకు వీసీలను నియమించే దిక్కు లేకుండాపోయిందని ఆరోపించారు. ఎంసెట్–2పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని, సంబంధిత మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కిశోర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, రాష్ట్ర, జిల్లా నాయకులు వడ్డె రమేష్, నిఖిల్, మున్నూరు చరణ్, నరేష్, పద్మాకర్, దినేష్, శ్రీనివాస్, విజయ్, శివ, జగన్, నవీన్, అభిరామ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement