
ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నానని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ రాసిన లేఖ
లోకేశ్.. ఇవిగో ఆధారాలు
నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి
‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేసిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: ‘మీ ఒత్తిడితోనే యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లు రాజీనామా చేశారు.. ఆధారాలు ఇవిగో.. ఏమాత్రం నిజాయితీ ఉన్నా న్యాయబద్ధంగా విచారణ చేయించాలి. లేదా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి’ అంటూ ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ రాజీనామా లేఖను ట్యాగ్ చేస్తూ మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేసింది.
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్లను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలివిగో.. నారా లోకేశ్ ఆదేశాలతో చైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక వీసీ తన రాజీనామా లేఖలో మంత్రి లోకేశ్ బెదిరించినట్లు స్పష్టంగా రాశారు’ అంటూ వైఎస్సార్‌సీపీ ఎత్తి చూపింది. ‘వీసీలపై రాజీనామా చేయాలంటూ ఎందుకు ఒత్తిడి తెచ్చారని మంత్రి నారా లోకేశ్‌ను శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది.
వీసీలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నారు. వైస్ ఛాన్స్‌లర్లు గవర్నర్ అధికారం కిందకు వస్తారని లోకేశ్ బుకాయించారు. ‘ఇదిగో.. ఇప్పుడు నారా లోకేశ్ ఒత్తిడితోనే వీసీలు రాజీనామా చేసినట్లు ఆధారాలను బయట పెడుతున్నాం. ఏమాత్రం నిజాయితీ ఉన్నా ఈ విషయమై న్యాయబద్ధంగా విచారణ చేయించాలి. లేదా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేసింది. అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయని, న్యాయం గెలుస్తుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment