ఫిరాయింపుదారులతో ఆశావహులకు గండి
ఎమ్మెల్యే టికెట్లు దక్కని చాలామందికి ‘మండలి’ హామీలు
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో వారికి నిరాశ
2015లో రిటైర్ కానున్న17 మంది.. ప్రస్తుత ఖాళీలు 4
హైదరాబాద్: శాసనమండలి సభ్యులుగా అవకాశం కోసం చూస్తున్న అనేకమంది టీఆర్ఎస్ పాతకాపుల్లో ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతోంది. తెలంగాణ శాసనమండలిలో 40 మంది సభ్యులకుగాను ప్రస్తుతం 36 మందే ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల కోటా నుండి 4 ఖాళీలు ఉన్నాయి. 2015లో 17 మంది రిటైర్ కానున్నారు. అంటే 2015లోగా మొత్తం 21 మంది శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉంది. వీటికోసం వివిధ జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనాయకులు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించిన అనేక సంఘాల నేతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. కాగా, 2015లో రిటైర్ కావాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్సీల్లో కొందరు టీఆర్ఎస్లో చేరారు. దీంతో వీరివల్ల తమ అవకాశాలకు గండిపడుతుందేమోనని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.
ఖాళీల వివరాలివీ....
స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుండి ఖాళీలున్నాయి. అదే కోటా నుండి మరో రెండు నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటుచేయడానికి ఎన్నికల సంఘం కసరత్తును చేస్తోంది. ఈ ప్రక్రియ కూడా కొలిక్కి వస్తే మొత్త 4 స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. 2015లో మరో 17 మంది రిటైర్ కాబోతున్నారు. ఎమ్మెల్యేల కోటా నుండి 29 మార్చి 2015లో కె.ఆర్.ఆమోస్, డి.శ్రీనివాస్, ఎన్.రాజలింగం, పీర్ షబ్చీర్ అహ్మద్, బాలసాని లక్ష్మీనారాయణ, బోడకుంటి వెంకటేశ్వర్లు, కె.యాదవ రెడ్డి రిటైర్ అవుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీలుగా ఉన్న డాక్టర్ కె.నాగేశ్వర్, కె.దిలీప్కుమార్ రిటైర్ అవుతున్నారు. గవర్నర్ కోటా నుండి బి.వెంకటరావు రిటైర్ అవుతున్నారు. స్థానికసంస్థల నుండి మండలిలో పాతినిధ్యం వహిస్తున్న నేతి విద్యాసాగర్, వి.భూపాల్ రెడ్డి, ఎ.నర్సారెడ్డి, పొట్లనాగేశ్వర్ రావు, టి.భానుప్రసాద్రావు, ఎస్.జగదీశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి తదితరులు మే 1న రిటైర్ అవుతున్నారు. దీంతో 2015లో రిటైరయ్యేవారు 17 మంది అవుతున్నారు. 2015లో రిటైర్ కాబోతున్న సభ్యులు టీఆర్ఎస్లో ఇటీవల చాలామంది చేరారు. వీరంతా ఎమ్మెల్సీలుగా మళ్లీ ఇవ్వాలని అడిగే అవకాశముంది. వీరిలో అధికులకు సీఎం హామీ కూడా ఇచ్చారని సమాచారం. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసిన నేతలకు అవకాశం లేకుండాచేసి చివరిక్షణంలో వచ్చినవారు తమ అవకాశాలను తన్నుకుపోతారా దిగులుపడుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్ అవకాశం రాని దాదాపు 50 మందికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు.