'గిరిబాబు కొడుకని పిలిచి అవకాశాలు ఇవ్వలేదు' | comedian Raghu babu to venture into direction in films | Sakshi
Sakshi News home page

'గిరిబాబు కొడుకని పిలిచి అవకాశాలు ఇవ్వలేదు'

Published Fri, Jan 10 2014 9:57 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

'గిరిబాబు కొడుకని పిలిచి అవకాశాలు ఇవ్వలేదు' - Sakshi

'గిరిబాబు కొడుకని పిలిచి అవకాశాలు ఇవ్వలేదు'

నిడదవోలు : సినిమాల్లో కామెడీ పండించడం ఓ వరమని హాస్యనటుడు రఘుబాబు అన్నారు. సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు నిడదవోలు వచ్చిన ఆయన విలేకర్లతో ముచ్చటించారు. రఘుబాబు మాట్లాడుతూ '1991లో గురువు సత్యారెడ్డి దర్శకత్వంలో దొంగలున్నారు...జాగ్రత్త సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాను. మా తండ్రి గిరిబాబును ఆదర్శంగా తీసుకుని నటనపై ఆసక్తి పెంచుకున్నాను. మంచి నటుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలనే తపనతో కష్టపడి నటుడిగా గుర్తింపు పొందాను. గిరిబాబు కొడుకు కదా అని ఎవరూ పిలిచి అవకాశాలు ఇవ్వలేదు. ఎలాంటి సిఫార్సులు లేకుండా పరిశ్రమలో గుర్తింపు పొందడంలో నాన్న ఎంతో గర్వపడుతున్నారు.
ఇప్పటివరకూ 253 చిత్రాల్లో నటించాను. తెలుగులో 250, తమిళంలో రెండు, కన్నడంలో ఒక సినిమాలో నటించా. మురారి, ఆది, కబడ్డీ, కబడ్డీ, చెన్నకేశవరెడ్డి, బెట్టింగ బంగార్రాజు, ఖడ్గం, దిల్, వేదం చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం సునీల్ హీరోగా భీమవరం బుల్లోడు, మోహన్ బాబు తనయులతో పాండువులు పాండవులు తుమ్మెద, చార్మీ హీరోయిన్ గా ప్రతిఘటన-2, రేసుగుర్రం సినిమాల్లో నటిస్తున్నా. త్వరలో ఎన్టీఆర్ రభస, మహేష్ బాబు ఆగడు, వీవీ వినాయక్ సినిమాల్లో నటించనున్నాను.

హాస్యాన్ని పండించడం నాకు దేవుడిచ్చిన వరం. ఇది అందరికీ సాధ్యపడదు. సినీ పరిశ్రమలో పోటీని తట్టుకుని ప్రతిభ చూపేవారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. కొత్తదనంతో కామెడీను పండిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. పలువురు వీఐపీలు, ఉద్యోగులు, వైద్యులు సాప్ట్వేర్ ఇంజినీర్లు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కామెడీ చిత్రాలు చూస్తున్నారు. దేశంలో ఏ పరిశ్రమలో లేనంత మంది హాస్యనటులు తెలుగు చిత్రసీమలో ఉన్నారు. అన్నీ కలిసి వస్తే త్వరలో దర్శకత్వం చేస్తా. సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రానికి దర్శకత్వం వహించాలన్నదే నా ఆశ.' అని మనసులోని మాటను చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement