giribabu
-
ఆయన నవ్వు చాలామందికి స్ఫూర్తి – కృష్ణంరాజు
‘‘సారధితో నాది 50 ఏళ్ల స్నేహం. హీరో అవుదామని ఇండస్ట్రీకొచ్చి హాస్య నటుడయ్యారు. ఆయన నవ్వులో ప్రత్యేకత ఉంది. అదే ఆయన్ను హాస్య నటుణ్ణి చేసింది. ఆ నవ్వు చాలామందికి స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలిచింది. సారధిగారు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి’’ అని నటుడు కృష్ణంరాజు అన్నారు. ప్రముఖ నటులు కె.జె సారధిపై రచయిత, చిత్రకారుడు రాంపా రచించిన ‘సినీ స్వర్ణయుగంలో సారధి’ పుస్తకాన్ని కృష్ణంరాజు ఆవిష్కరించగా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు స్వీకరించారు. ఈ పుస్తకాన్ని కృష్ణంరాజుకు అంకితమిచ్చారు రాంపా. సారధి మాట్లాడుతూ– ‘‘ఏమీ లేకుండా చిత్రపరిశ్రమకు వచ్చి ఇంతటివాడినయ్యా. 378 సినిమాల్లో నటించా. ఈ స్థానంలో ఉన్నానంటే కారణం ప్రేక్షకులే. ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, నాగేశ్వరరావు, రేలంగి, కృష్ణ, చిరంజీవిలతో నటించా. వెంకటేశ్ ‘గణేష్’ చిత్రం తర్వాత సినిమాలు చేయలేదు. కృష్ణంరాజు ‘భక్తకన్నప్ప’ నా జీవితాన్నే మార్చేసింది. తర్వాత చాలా మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించాను’’ అన్నారు. ‘‘సారధి, ప్రభాకర్‌రెడ్డిగారి కృషి వల్లే చిత్రపురి కాలనీ ఏర్పాటైంది’’ అన్నారు పరుచూరి వెంకటేశ్వరరావు. నటుడు గిరిబాబు. కృష్ణంరాజు సతీమణి శ్యామల, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, నిర్మాత సురేశ్‌కొండేటి పాల్గొన్నారు. -
లేనట్లే... ఉన్నాడు!
నేను నా దైవం సందేహం మంచిది.. ప్రశ్నలు జీవితానికి నిర్దేశం. కనబడేవన్నీ సత్యాలు కానప్పుడు కనపడనివి అసత్యాలు కాగలవా? దైవాన్ని అనుభూతి చెందుతాం.. కనిపించకపోయినా.. గిరిబాబుకు దేవుడి ఉనికి మీద ఎన్నో సందేహాలు. దేవుడికి ఎక్కుపెట్టిన ఎన్నో ప్రశ్నలు. లేనట్లే.. అనిపించినా.. ఉన్నాడనే సమాధానం. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సీనియర్ నటుడు గిరిబాబు ఇంటికి వెళ్లినప్పుడు ఆయన విశ్రాంతిగా కూర్చొని టీవీలో సినిమా చూస్తూ కనిపించారు. ఒకప్పుడు తను విలన్‌గా నటించిన ‘కల్పన’ సినిమా అది! డెభ్లై ఐదేళ్ల వయసులో గత కాలపు స్మృతులను నెమరువేసుకుంటున్న గిరిబాబు ‘నేను–నా దైవం’ గురించి విస్తృతంగా చర్చించారు. దేవుడున్నాడా? లేడా? అని జీవితమంతా ఎదురైన సందేహాలను ఇలా వివరించారు. నాటి సినిమాలు ఇప్పుడు చూసుకుంటూ హాయిగా గడుపుతున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడిని ఏవిధంగా తలుచుకుంటున్నారు? గిరిబాబు: దేవుడున్నాడు.. అని బాగున్నప్పుడు అనిపిస్తుంది. బాగోలేనప్పుడు దేవుడే ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? అని కూడా అనిపిస్తుంది. ఈ జీవితం ఇలా ఉంది అంతే! నేను నిత్యపూజలేవీ చేయను. మా ఇంట్లో కూడా చేయరు. అలాగని నేనేమీ నాస్తికుడిని కాదు. నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ప్రతి పండగకు నా పిల్లలు, వారి పిల్లలు అందరం కలుస్తాం. ఏ దేవుడికి సంబంధించిన పండగైతే ఆ పూజ చేసుకొని, కలిసి భోజనం చేస్తాం. సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. బయటకెళ్లినప్పుడు గుడిముందుగా వెళితే మాత్రం దండం పెట్టుకుంటాను. అంటే సంతోషం దేవుడితో ముడి పడి ఉందంటారా? సంతోషంగా ఉండేలా ప్రయత్నించడం మన చేతుల్లోనే ఉంది. కానీ, అప్పుడు దేవుడు దయతలిచాడు అనిపిస్తుంది. మరణం మన చేతుల్లో లేదు. అప్పుడు దేవుడున్నాడా? అనే సందేహం కలుగుతుంది. నా మనవరాలు (కూతురి కూతురు) పెళ్లి తిరుపతిలో ఘనంగా చేశాం. కొత్తజంటతో కలిసి అందరం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. మరుసటి రోజు ఇంటికి వచ్చాం. మా అల్లుడు, మేమంతా సోఫాల్లో సేదతీరుతున్నాం. ఉన్నట్టుండి మా అల్లుడు ఆ సోఫాలోనే వాలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళితే ప్రాణం పోయిందన్నారు. ‘దేవుడా మేం చేసిన తప్పేంటి? ఎందుకిలా చేశావ్! రాత్రి వరకు నీ సన్నిధానంలోనే ఉన్నాంగా! ఒక్కరోజులో ఈ తేడా ఏంటి? పెళ్లికళతో ఉన్న ఇల్లు ఒక్కసారిగా ఇలా అయిపోయిందేంటి? నువ్వున్నావా? లేవా?!’ అనే సందేహం కలిగింది. దేవుడున్నాడు అనిపించిన సందర్భాలు? మా అమ్మనాన్నలకు ఒక్కణ్ణే కొడుకును. గారాబంగా పెంచారు. కాలేజీ చదువులకు రాగానే పెళ్లి చేశారు. కాలేజీ రోజుల్లో విపరీతంగా నాటకాల్లో పాల్గొనేవాడిని. సినిమా ప్రకటనలు చూసి నా ఫొటోలను ఆ సంస్థలకు పంపుతుండేవాడిని. అలా దర్శకుడు ఎస్డీ లాల్ అబ్బాయి బాగున్నాడని సినిమాకు ఎంపిక చేసి, కబురు పంపారు. కొన్ని రీళ్లు తీసి డబ్బు లేక ఆ సినిమా తీయలేకపోయారు. కానీ, ఆరు నెలల తర్వాత ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు ‘జగమే మాయ’ సినిమాకు నా గురించి చెప్పారు. అక్కణ్ణుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏ మాత్రం ప్రయాస పడకుండానే సినిమా అవకాశాలు విపరీతంగా వచ్చాయి. అప్పుడు చాలాసార్లు అనుకునే వాడిని దేవుడు వీరిద్దరి రూపంలో నాకీ అవకాశాన్నీ, నిలదొక్కునే స్థైర్యాన్నీ ఇచ్చాడని. ‘ప్రేమకథ’ సినిమా షూటింగ్‌కి యూనిట్ సభ్యులతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నాం. రైలు ప్రమాదం జరిగింది. నా వెంట వచ్చిన కెమరామన్లు, ఇంకొంతమంది ఆ దుర్ఘటనలో మరణించారు. నేను బతికాను. అప్పుడనిపించింది దేవుడున్నాడు అని. అయితే, ఆ చనిపోయినవారి వైపున దేవుడు ఎందుకు లేడు? అనే సందేహమూ వచ్చింది. ఇంకోసారి సంక్రాంతి పండగకు మా కుటుంబ సభ్యులమంతా కలిసి మా ఊరు బయల్దేరాం. దారిలో మా కారును లారీ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో కొద్దిపాటి గాయాలతో మేమంతా బతికాం. అప్పుడూ అనిపించింది దేవుడున్నాడని. చావు బతుకులే దైవాన్ని పరిచయం చేస్తాయంటారా? తల్లి గర్భంలో అంతా చీకటే. అయినా అక్కడ కాళ్లూ చేతులు ఆడిస్తుంటుంది శిశువు. గర్భంలోని నుంచి బయటకు అంటే వెలుగులోకి వచ్చినందుకు నవ్వాలి కానీ, కెవ్వుమని ఏడ్చేస్తుంది ఎందుకు? పెద్ద సందేహం. బహుశా పుడుతూనే తను చావుకు దగ్గర అవుతానేమో అని ఏడుస్తుందేమో! అనే ఆలోచన. ఈ సృష్టిలో మనకన్నా ముందు పశుపక్ష్యాదులున్నాయి. గింజలు తినో, గడ్డి తినో పెరుగుతాయి అవి. కానీ, వాటిని చంపి తినే పులి లాంటి జంతువులూ ఉన్నాయి. వీటిని పుట్టించిన దేవుడే వాటినీ పుట్టిస్తే సాటి జంతువును చంపి తినమని ఎందుకు పెట్టాడు. పాపం ఆ అమాయక జంతువు ఏం పాపం చేసింది? ఇదో సందేహం. రాతియుగంలో మనిషి జంతువులను చంపి తినేవాడు. అప్పుడు వాడికి దేవుడంటే తెలియదు. మెదడు వికాసం పొంది ఆలోచనలు చేయడం ఆరంభిస్తూ ఏదో శక్తి ఉందని గ్రహింపుకొచ్చాడు. ఆ ఆలోచన నుంచే హింసను వదిలేసి మునులు, రుషులు వచ్చారు. జనం పెరుగుతున్న కొద్దీ ఎవరికి వారు ఓ దేవుడిని సృష్టించుకున్నారు. ఆ విధంగా దేవుళ్ల సంఖ్య పెరిగింది. బలి ఇస్తే దైవం అనుగ్రహిస్తుందనే నమ్మకంలో ఇప్పటికీ చాలామంది ఉన్నారు. దేవుడు అమాయకజీవిని చంపమనే ఆలోచన మనిషికి ఎందుకు కల్పించాడు?! దేవుళ్ల సినిమాల్లోనూ నటించిన అనుభవాలు? దేవతలు–మహిమలు ఉన్న సినిమాలు చాలానే చేశాను. అయితే, ‘దేవతలారా దీవించండి’ అనే సినిమాలో పామును దేవతగా చూపిస్తాం. కాసేపు పాము మనిషిలా మారుతుంది. తర్వాత మళ్ళీ పాములా కనిపిస్తుంది. పాము పట్ల మనం చూపే దైవభక్తి అంతా ఇంతాకాదు. నాగులచవితి, నాగుల పంచమి అంటూ పూజలు చేస్తాం. పుట్టలో పాలు పోసి భక్తిగా మొక్కుతాం. అయితే, నాకు అర్థంకానిదేంటంటే.. ఈ సృష్టిలో పశుపక్ష్యాదులన్నీ తమ పిల్లల్ని అత్యంత ప్రేమగా సాకుతాయి. మరో జంతువును చంపే పులి కూడా తన పిల్లలను ప్రేమగా చూసుకుంటుంది. మొసలి కూడా ఒడ్డున ఇసుక తవ్వి గుడ్లు పెట్టి, అవి పిల్లలు కాగానే జాగ్రత్తగా నోటకరుచుకు వెళ్లి నీళ్లలో వదిలిపెడుతుంది. కానీ, పాము అలా కాదే.. తన పిల్లలని తనే మింగుతుంది. ఈ సృష్టిలో తన పిల్లల మీద ఎలాంటి అఫెక్షన్ లేని ప్రాణి ఏదైనా ఉందంటే అది పామే! అలాంటి పాముకు పూజలేంటి?! పుట్టలో పాలు పోస్తారు. దానికి ఊపిరి ఆడక బయటకు వచ్చేస్తుంది. ఇది చూసి జనం పరవశించి పోతారు. ఏంటో ఇదంతా అనిపిస్తుంది. నాకు తెలిసినంతవరకు బహుశా శివుడి మెడలో ఆభరణంగా పాము ఉంటుంది కాబట్టి ఈ జనం పూజలు చేస్తుండవచ్చా? ఇలాంటి సందేహాలు కలుగుతాయి. ఇలాంటి సందేహాలకు బీజం ఎక్కడ పడింది? మా ఊళ్లో. మా ఊరు ప్రకాశం జిల్లాలోని రావినూతల. చాలా చిన్నప్పుడు. బడికెళ్లే రోజుల్లో రాత్రి పూట ఆరుబయట పడుకుని ఆకాశంకేసి గంటలు గంటలు చూసేవాడిని. అన్ని చుక్కలు ఆకాశంలో దేవుడు ఎలా పెట్టాడు, ఆ చుక్కలు దాటుకొని వెళ్లిపోతే ఏం వస్తుంది? అంత పెద్ద సముద్రానికి కూడా తీరం ఉంటుంది. మరి ఈ విశ్వం అవతల ఏముంటుంది? ఇలాంటి సందేహాలు ఎడతెరిపి లేకుండా వచ్చేవి. చాలామందికి ఈ ఆలోచన వచ్చే ఉంటుంది. తర్వాత వదిలేస్తారు. కానీ, ఇప్పటికీ ఇది పెద్ద సందేహమే. గ్రహాలు, పాలపుంతలు... ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటుంటాను. వేరే గ్రహాలలో జీవరాశి ఉందని చెప్పే వార్తలు చదివి ఆశ్చర్యపోతుం టాను. అలా అయితే అక్కడే దైవం ఉండాలి? ఏదో శక్తి విశ్వమంతా ఉండాలి. అంత పెద్ద ఆకారం రూపం ఎలా ఉంటుందో?! దేవుణ్ణి ఆకాశంలో వెతికే మీకు దైవం గురించి ఎవరు పరిచయం చేశారు? మా ఇంట్లో పడమర ఇల్లు అని ఉండేది. అది దేవుడి గది! పండగలప్పుడు పూజలు, ప్రసాదాలు హడావిడులు ఉండేవి. అమ్మనాన్నలు దేవుడి గదిని అలంకరించి, నైవేద్యాలు పెట్టి నన్ను బొట్టు పెట్టుకో, దండం పెట్టుకోమనేవారు. వాళ్లు చెప్పినట్టు చేసేవాణ్ణి. మా ఊరి దగ్గరలో సింగరాయకొండ జాతర అద్భుతంగా సాగుతుంది. కొండ కింద ఆంజనేయ స్వామి, కొండమీద లక్ష్మీనరసింహ స్వామి. జాతర అంటే పండగే పండగ. స్నేహితులతో కలిసి ఒళ్లు అలసిపోయేలా తిరిగి ఇళ్లకు చేరుకునేవాళ్లం. ఇంతకీ దేవుడున్నట్లా? లేనట్లా? మా ఊళ్లో రాజుల కాలం నాటి శైవాలయాలు, వైష్ణవాలయాలు ఉన్నాయి. వాటి పునరుద్ధరణకు ఓ కమిటీ ఏర్పాటు చేశాం. దానికి నేనే అధ్యక్షుడిని. వాటిని బాగుచేయడమే కాకుండా నిత్యం పూజలు జరిగేలా, వార్షిక ఉత్సవాలు జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇవి కాకుండా సాయిబాబా గుడి కూడా కట్టించాం. మా కుటుంబం అంతా ఊరెళ్లినప్పడల్లా దర్శనం చేసుకుంటాం. కిందటి నెల నా పుట్టినరోజు. వారం రోజుల ముందుగానే ఊరికెళ్లాను. గుళ్లన్నీ దర్శించి వచ్చాను. మా చుట్టుపక్కల ఊళ్లవాళ్ళూ ఆ గుళ్లకు వచ్చి సంతోషంగా తిరిగివెళ్లడం నాకు నచ్చుతుంటుంది. అందుకోసమే నేను వెళుతుంటానని అనిపిస్తుంది. దైవం అంటే బతికినన్నాళ్లూ ఏదో ఒక రకంగా మన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండేలా చూడటమే అని బలంగా అనిపిస్తుంది. నా భార్య శ్రీదేవితో నా అనుబంధం గురించి ఒక్కమాటలో చెప్పలేను. అందరినీ చక్కగా చూసుకునేది. ఆమె చేతి వంట అద్భుతంగా ఉండేది. మా నాన్న నాగయ్యకు ఇప్పుడు 107 ఏళ్లు. బిడ్డలా చూసుకునేది. కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు అందరూ ప్రాణం పెడతారు తనంటే! బంధువుల్లోనూ అంతే! పూజలు, వ్రతాలు, నోములు ఎక్కడా లోపం చేసేది కాదు. ఓ ‘రోజు కాళ్లు నొప్పులు, జ్వరంగా ఉంది’ అంది. ఆసుపత్రికి తీసుకెళ్లాం. డాక్టర్లు అడ్మిట్ చేయాలన్నారు. ఒంట్లో ఏదో ఇన్ఫెక్షన్ అన్నారు. మూడునెలల ఏడురోజుల పాటు ఆసుపత్రిలో నరకయాతన అనుభవించి కిందటేడాది మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. అప్పుడనిపించింది ‘ఏం తప్పు చేశాను? నన్ను ప్రాణంగా చూసుకునే నా అర్ధాంగిని దేవుడెందుకు తీసుకెళ్లిపోయాడు. అసలు దేవుడున్నాడా? ఉంటే ఇలా జరుగుతుందా?’ పెద్ద సందేహం. - నిర్మలారెడ్డి చిల్కమర్రి -
రికార్డుకెక్కిన గిరిబాబు తండ్రి
నాంపల్లిః సినీ నటులు గిరిబాబు తండ్రి నాగయ్యకు హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డు లభించింది. 105 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు ఈ రికార్డును అందజేశారు. శనివారం గిరిబాబు ఇంటికి వెళ్లిన హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్ సీఈఓ పల్లె సుమన్, దైవజ్ఞ శర్మ అధ్యక్షతన సర్టిఫికెట్‌ను అందజేశారు. ప్రకాశం జిల్లాలో 1910లో జన్మించిన నాగయ్య 106 ఏళ్ల వయసులోనూ తన పనులను తాను చేసుకుంటారన్నారు. కార్యక్రమంలో గిరిబాబు తనయుడు రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. -
బైకును ఢీకొన్న లారీ.. యువకుడి దుర్మరణం
మానవపాడు: పెద్దమ్మ కూతురును బస్సు ఎక్కించి బైకుపై ఇంటికి వస్తుండగా, లారీ ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. మానవపాడు మండలం పుల్లూరుకి చెందిన లీలావతి, నాగరాజుల పెద్దకుమారుడు హరి(18) ఇటీవల పాలిటెక్నిక్ ఎంట్రెన్స్‌లో సీటు సాధించాడు. ఈ నెల 15వ తేదీ నుంచి కళాశాలకు వెళ్లాల్సి ఉంది. మంగళవారం వనపర్తిలో చదువుతున్న తన పెద్దమ్మ కూతురును బస్సు ఎక్కించడానికి పుల్లూరు నుంచి అలంపూర్ చౌరస్తాకు బైక్‌పై వచ్చాడు. ఆమెను బస్సు ఎక్కించి, తిరుగు ప్రయాణమయ్యాడు. కాసేపట్లో గ్రామానికి చేరుకుంటాడనుకునే లోపే జాతీయరహదారిపై ఆంధ్రప్రదేశ్ చెక్‌పోస్టు వద్ద పుల్లూరు సమీపంలో మృత్యువు లారీ రూపంలో ఎదురైంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళుతున్న లారీ వేగంగా బైక్‌ను ఢీకొట్టింది. దీంతో హరి లారీ టైర్ల కిందపడటంతో తలపూర్తిగా నుజ్జునుజ్జు అయి అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న హరి తల్లిదండ్రులతో పాటు పుల్లూరు గ్రామస్తులు వందలాది మంది సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు చెక్‌పోస్టు ఉండటంతో వందలాది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దు చెక్‌పోస్టును వెంటనే ఇక్కడి నుంచి మార్చాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని జాతీయరహదారిపై ధర్నా నిర్వహించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కర్నూలు తాలుకా సీఐ మహేశ్వర్‌రెడ్డి, ఎస్ఐ గిరి గ్రామస్తులకు, హరి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. మీకు న్యాయం చేస్తామని, చెక్‌పోస్టును మార్చాలనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అప్పటికే దాదాపు నాలుగు కిలోమీటర్ల మేరకు వాహనాలు జాతీయరహదారిపై నిలిచిపోయాయి. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అవకాశం వస్తే నాటకాలు వేస్తా : గిరిబాబు
నాంపల్లి: అవకాశం వస్తే నాటకాలు వేసేం దుకు సిద్ధంగా ఉన్నానని సినీనటుడు గిరిబాబు పేర్కొన్నారు. శుక్రవారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో మాధురి ఎడ్యుకేషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ థియేటర్ అసోసియేషన్ హైదరాబాదు సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్రదినోత్సవ రంగస్థల పురస్కార ప్రదానోత్సవం జరిగింది. సినిమాలు, టీవీలు వచ్చాక నాటక రంగం మరుగున పడిందన్నారు. నాటరంగాన్ని అభివృద్ధి చేసేందుకు అం దరూ ముందుకు రావాలన్నారు. తాను నాటక రంగం నుంచే సినిమాల్లోకి వచ్చానన్నారు. అవకాశం వస్తే నాటకాలు వేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాళ్లపల్లి వేంకట నరసింహారావు పుట్టిన రోజును పురస్కరించుకుని నాటకరంగంలో ఉంటూ ఆర్థికంగా వెనుకబడిన వారిని ప్రతి ఏటా ఒక్కరిని ఎంపిక చేసి నగదు పురస్కారాన్ని అందజేస్తూ వస్తున్నారని అన్నారు. ఈ పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటి ఎ.విజయలక్ష్మికి అందజేశారు. సభకు అధ్యక్షత వహిం చిన ప్రముఖ రంగస్థల ప్రయోక్త డాక్టర్ చాట్ల శ్రీరాములు మాట్లాడుతూ మా ధురి ఎడ్యుకేషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ థియేటర్ అసోసియేషన్‌ను స్థాపించి ఎనిమిదేళ్లు పూర్తయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రచయిత రావి కొండలరావు, సినీ నటులు కాకినాడ శ్యామల, శివపార్వతి, ప్రముఖ కవి దుగ్గిరాల సోమేశ్వరరావు, ప్రముఖులు మొదలి నాగభూషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర మంచి పార్థసారధి రచించిన తల్లా వఝ్జల సుందరం దర్శకత్వంలో రూ పొందించిన ‘వార్నీ! అదా విషయం?’ నాటిక ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. -
ఐదు తరాల నటులతో నటించా
మూడు వందల సినిమాలలో విలన్‌గా నటించి విలనిజానికి నిజమైన నిర్వచనం ఇచ్చాడు. దర్శకుడిగా, కథారచయితగా, నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి చిత్ర పరిశ్రమలో గుర్తింపుపొందాడు. నాలుగు దశాబ్దాలపాటు వెండితెరపై ఐదు తరాల నటులతో నటిస్తూ ఎన్నో పాత్రలు పోషించిన విలక్షణ నటుడు గిరిబాబు సోమవారం రేవనపల్లిలో జరిగిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ అనే సినిమా షూటింగ్ పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన సినీజీవిత విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నా మొదటి సినిమా ‘జగమేమాయ’. ప్రము ఖ దర్శకుడు అయ్యన్మూర్తి నాకు సినిమాలో అవకాశం కల్పించారు. 1973లో నటులు కావాలని దినపత్రికలో వచ్చిన ప్రకటనను చూసి ఫొటో పంపిస్తే ఆ సినిమాకు సెలక్ట్ అయ్యాను. అప్పుడు నా వయస్సు 29 ఏళ్లు. నాతో పాటు మురళీమోహన్, కె.విజయ ముగ్గురికి ఈ సినిమానే మొదటి సినిమా. ఈసినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో 7 సినిమాలలో నాకు నటించే అవకాశం వచ్చింది. 300 సినిమాలలో విలన్‌గా.. ఇప్పటివరకు నటించిన మొత్తం సినిమాలలో 300 సినిమాలలో విలన్‌గా నటించాను. మిగతా 250 సినిమాలు పౌరాణిక, జానపద, కౌబాయ్, సాంఘిక, కామెడీ చిత్రాలలో నటించాను. నాటి ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు నుంచి నేటి తరం వరకు ఐదు తరాల నటులతో కలిసి నటిం చడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. పది సినిమాలకు దర్శకత్వం చేశా..... కథా, స్క్రీన్‌ప్లే, దర్శకుడిగా, నిర్మాతగా 10 సినిమాలను నిర్మించాను. ముఖ్యంగా దేవతలారా దీవించండి, సింహగర్జన, ముద్దు ముచ్చట, సంధ్యారాగం, మెరుపుదాడి, ఇంద్రజిత్, రణరంగం, నీ సుఖమే కోరుకున్నా సినిమాలన్నీ సూపర్‌హిట్టయ్యాయి. నేను తీసిన సినిమాలన్నీ జానపద, బందిపోటు, సస్పెన్స్ థ్రిల్లర్, అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నవే. సెలక్టెడ్ పాత్రలే చేస్తున్నా... ప్రస్తుతం సినిమా అవకాశాలకు కొదవలేదు. కానీ వయస్సు మీదపడుతుంది కాబట్టి సెల క్టెడ్ పాత్రలే చేస్తున్నాను. ఇటీవల విడుదలైన లడ్డూబాబు, పాండవులు పాండవులు తుమ్మెదాతో పాటు విడుదలకు సిద్ధంగా ఉన్న టాప్‌ర్యాంకర్స్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తోపాటు ఐదారు సినిమాలలో నటిస్తున్నాను. నందులు నేను ఇచ్చా..... బంగారు నందులను నా చేతుల మీదుగా ఇ చ్చాను కానీ.. నేను నంది అవార్డును మాత్రం అందుకోలేదు. 550కి పైగా సినిమాల్లో నటించినా ఇంతవరకు నంది అవార్డు రాలేదు. కానీ నంది అవా ర్డు, రఘుపతి వెంకయ్య అవార్డు ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. ప్రేక్షకుల ఆదరణ ముందు బిరుదులు, అవార్డులు చాలా చిన్నవి. అయితే అమెరికాలోని వెస్ట్ ప్రూఫ్ యూనివర్సిటీ నాకు డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. నాటకాలే ప్రేరణ.... మాది ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని రావినూతల గ్రామం. మాది రైతు కుటుంబం. నాన్న ఎర్ర నాగయ్య, అమ్మ నాగరత్నం. కుటుంబంలో నేనొక్కడినే సంతానం. అయితే చదువుకునే రోజులలో ఇంటర్‌కాలేజీ పోటీలలో సరదాగా నాటకాలు వేసేవాడిని. అధ్యాపకులు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. తరువాత కళాప్రపూర్ణ కళానాట్యమండలి స్థాపించి గ్రామంలో 25వరకు నాటకాలు వేసి మెప్పించాను. నాటకరంగ అనుభవం సినిమాలో నటించడానికి ప్రేరణ కల్గింది. నా పెద్ద కుమారుడు రఘుబాబు అతి తక్కువ కాలంలో 250 సినిమాలలో అనేక పాత్రలు పోషిస్తూ చిత్ర పరిశ్రమలో రాణిస్తూ మంచిపేరు తెచ్చుకుంటున్నాడు. కొడుకు ప్రయోజకుడైతే తండ్రికి అంతకంటే ఆనందం ఏముంటుంది. అలాగే చిన్న కుమారుడైన బోసుబాబు కూడా నాలుగైదు సినిమాలలో నటించాడు. భూదాన్‌పోచంపల్లి : శ్రీ రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ అనే సినిమా షూటింగ్ మండలంలోని ముక్తాపూర్, రేవనపల్లి గ్రామాలలో సోమవారం జరిగింది. సూపర్‌స్టార్ కృష్ణ మేనల్లుడు, ప్రేమకథా చిత్రమ్ ఫేమ్ సుధీర్‌బాబు, హీరో తల్లిదండ్రుల పాత్రలు పోషిస్తున్న ప్రముఖ నటుడు గిరిబాబు, పద్మినిప్రకాష్లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చందు మాట్లాడుతూ కన్నడంలో విజయవంతమైన 6 చిత్రాలను నిర్మించానని పేర్కొన్నాడు. తెలుగులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని తన మొదటి చిత్రమని చెప్పారు. ఇది పూర్తిగా అందమైన ప్రేమ కథా చిత్రమని అన్నారు. చిత్రంలో హీరోయిన్గా నందిత, ప్రముఖ నటులు బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్, ఎంఎస్ నారాయణ, సప్తగిరి, రాంబాబు ప్రధాన ప్రాతలో నటిస్తున్నట్లు తెలిపారు. నిర్మాత లగడపాటి శ్రీధర్, సంగీతం గౌరవ హరి, పాటలు హరి, రామజోగయ్య శాస్త్రి, కెమరామెన్ కెఎస్. చంద్రశేఖర్‌లు వహిస్తున్నారని తెలిపారు. -
'టీడీపీ పేరును కాంగ్రెస్ దేశంగా మార్చుకోండి'
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పూర్తిస్థాయిలో శ్రమిస్తానని సినీనటుడు గిరిబాబు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఆయన శనివారమిక్కడ చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నదే తన తాపత్రయమని గిరిబాబు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేది జగన్ మాత్రమేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసమే చంద్రబాబు నాయుడు ఆరాటపడుతున్నారని గిరిబాబు విమర్శించారు. చంద్రబాబు సహా ఆ పార్టీలో ఉన్నది కాంగ్రెస్ నేతలేనని , టీడీపీ పేరును కాంగ్రెస్ దేశంగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. -
'గిరిబాబు కొడుకని పిలిచి అవకాశాలు ఇవ్వలేదు'
నిడదవోలు : సినిమాల్లో కామెడీ పండించడం ఓ వరమని హాస్యనటుడు రఘుబాబు అన్నారు. సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు నిడదవోలు వచ్చిన ఆయన విలేకర్లతో ముచ్చటించారు. రఘుబాబు మాట్లాడుతూ '1991లో గురువు సత్యారెడ్డి దర్శకత్వంలో దొంగలున్నారు...జాగ్రత్త సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాను. మా తండ్రి గిరిబాబును ఆదర్శంగా తీసుకుని నటనపై ఆసక్తి పెంచుకున్నాను. మంచి నటుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలనే తపనతో కష్టపడి నటుడిగా గుర్తింపు పొందాను. గిరిబాబు కొడుకు కదా అని ఎవరూ పిలిచి అవకాశాలు ఇవ్వలేదు. ఎలాంటి సిఫార్సులు లేకుండా పరిశ్రమలో గుర్తింపు పొందడంలో నాన్న ఎంతో గర్వపడుతున్నారు. ఇప్పటివరకూ 253 చిత్రాల్లో నటించాను. తెలుగులో 250, తమిళంలో రెండు, కన్నడంలో ఒక సినిమాలో నటించా. మురారి, ఆది, కబడ్డీ, కబడ్డీ, చెన్నకేశవరెడ్డి, బెట్టింగ బంగార్రాజు, ఖడ్గం, దిల్, వేదం చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం సునీల్ హీరోగా భీమవరం బుల్లోడు, మోహన్ బాబు తనయులతో పాండువులు పాండవులు తుమ్మెద, చార్మీ హీరోయిన్ గా ప్రతిఘటన-2, రేసుగుర్రం సినిమాల్లో నటిస్తున్నా. త్వరలో ఎన్టీఆర్ రభస, మహేష్ బాబు ఆగడు, వీవీ వినాయక్ సినిమాల్లో నటించనున్నాను. హాస్యాన్ని పండించడం నాకు దేవుడిచ్చిన వరం. ఇది అందరికీ సాధ్యపడదు. సినీ పరిశ్రమలో పోటీని తట్టుకుని ప్రతిభ చూపేవారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. కొత్తదనంతో కామెడీను పండిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. పలువురు వీఐపీలు, ఉద్యోగులు, వైద్యులు సాప్ట్వేర్ ఇంజినీర్లు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కామెడీ చిత్రాలు చూస్తున్నారు. దేశంలో ఏ పరిశ్రమలో లేనంత మంది హాస్యనటులు తెలుగు చిత్రసీమలో ఉన్నారు. అన్నీ కలిసి వస్తే త్వరలో దర్శకత్వం చేస్తా. సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రానికి దర్శకత్వం వహించాలన్నదే నా ఆశ.' అని మనసులోని మాటను చెప్పారు.