బైకును ఢీకొన్న లారీ.. యువకుడి దుర్మరణం
మానవపాడు: పెద్దమ్మ కూతురును బస్సు ఎక్కించి బైకుపై ఇంటికి వస్తుండగా, లారీ ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. మానవపాడు మండలం పుల్లూరుకి చెందిన లీలావతి, నాగరాజుల పెద్దకుమారుడు హరి(18) ఇటీవల పాలిటెక్నిక్ ఎంట్రెన్స్‌లో సీటు సాధించాడు. ఈ నెల 15వ తేదీ నుంచి కళాశాలకు వెళ్లాల్సి ఉంది. మంగళవారం వనపర్తిలో చదువుతున్న తన పెద్దమ్మ కూతురును బస్సు ఎక్కించడానికి పుల్లూరు నుంచి అలంపూర్ చౌరస్తాకు బైక్‌పై వచ్చాడు. ఆమెను బస్సు ఎక్కించి, తిరుగు ప్రయాణమయ్యాడు. కాసేపట్లో గ్రామానికి చేరుకుంటాడనుకునే లోపే జాతీయరహదారిపై ఆంధ్రప్రదేశ్ చెక్‌పోస్టు వద్ద పుల్లూరు సమీపంలో మృత్యువు లారీ రూపంలో ఎదురైంది.
హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళుతున్న లారీ వేగంగా బైక్‌ను ఢీకొట్టింది. దీంతో హరి లారీ టైర్ల కిందపడటంతో తలపూర్తిగా నుజ్జునుజ్జు అయి అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న హరి తల్లిదండ్రులతో పాటు పుల్లూరు గ్రామస్తులు వందలాది మంది సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు చెక్‌పోస్టు ఉండటంతో వందలాది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దు చెక్‌పోస్టును వెంటనే ఇక్కడి నుంచి మార్చాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని జాతీయరహదారిపై ధర్నా నిర్వహించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న కర్నూలు తాలుకా సీఐ మహేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ గిరి గ్రామస్తులకు, హరి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. మీకు న్యాయం చేస్తామని, చెక్‌పోస్టును మార్చాలనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అప్పటికే దాదాపు నాలుగు కిలోమీటర్ల మేరకు వాహనాలు జాతీయరహదారిపై నిలిచిపోయాయి. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.