ఐదు తరాల నటులతో నటించా | Five generations Actors acting : GiriBabu | Sakshi
Sakshi News home page

ఐదు తరాల నటులతో నటించా

Published Tue, Jun 17 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

ఐదు తరాల నటులతో నటించా

ఐదు తరాల నటులతో నటించా

మూడు వందల సినిమాలలో విలన్‌గా నటించి విలనిజానికి నిజమైన నిర్వచనం ఇచ్చాడు. దర్శకుడిగా, కథారచయితగా, నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి చిత్ర పరిశ్రమలో గుర్తింపుపొందాడు. నాలుగు దశాబ్దాలపాటు వెండితెరపై ఐదు తరాల నటులతో నటిస్తూ ఎన్నో పాత్రలు పోషించిన విలక్షణ నటుడు గిరిబాబు సోమవారం రేవనపల్లిలో  జరిగిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ అనే సినిమా షూటింగ్  పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన సినీజీవిత విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
 నా మొదటి సినిమా  ‘జగమేమాయ’. ప్రము ఖ దర్శకుడు అయ్యన్‌మూర్తి నాకు సినిమాలో అవకాశం కల్పించారు. 1973లో నటులు కావాలని దినపత్రికలో వచ్చిన ప్రకటనను చూసి ఫొటో పంపిస్తే ఆ సినిమాకు సెలక్ట్ అయ్యాను. అప్పుడు నా వయస్సు 29 ఏళ్లు. నాతో పాటు మురళీమోహన్, కె.విజయ ముగ్గురికి ఈ సినిమానే మొదటి సినిమా. ఈసినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో 7 సినిమాలలో నాకు నటించే అవకాశం వచ్చింది.  
 
 300 సినిమాలలో విలన్‌గా..
 ఇప్పటివరకు నటించిన మొత్తం సినిమాలలో 300 సినిమాలలో విలన్‌గా నటించాను. మిగతా 250 సినిమాలు పౌరాణిక, జానపద, కౌబాయ్, సాంఘిక, కామెడీ చిత్రాలలో నటించాను. నాటి ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు నుంచి నేటి తరం వరకు ఐదు తరాల నటులతో కలిసి నటిం చడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను.
 
 పది సినిమాలకు దర్శకత్వం చేశా.....
 కథా, స్క్రీన్‌ప్లే, దర్శకుడిగా, నిర్మాతగా 10 సినిమాలను నిర్మించాను. ముఖ్యంగా దేవతలారా దీవించండి, సింహగర్జన, ముద్దు ముచ్చట, సంధ్యారాగం, మెరుపుదాడి, ఇంద్రజిత్, రణరంగం, నీ సుఖమే కోరుకున్నా సినిమాలన్నీ సూపర్‌హిట్టయ్యాయి. నేను తీసిన సినిమాలన్నీ జానపద, బందిపోటు, సస్పెన్స్ థ్రిల్లర్, అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నవే.
 
 సెలక్టెడ్ పాత్రలే చేస్తున్నా...
 ప్రస్తుతం సినిమా అవకాశాలకు కొదవలేదు. కానీ వయస్సు మీదపడుతుంది కాబట్టి సెల క్టెడ్ పాత్రలే చేస్తున్నాను. ఇటీవల విడుదలైన లడ్డూబాబు, పాండవులు పాండవులు తుమ్మెదాతో పాటు విడుదలకు సిద్ధంగా ఉన్న టాప్‌ర్యాంకర్స్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తోపాటు ఐదారు సినిమాలలో నటిస్తున్నాను.
 
 నందులు నేను ఇచ్చా.....
 బంగారు నందులను నా చేతుల మీదుగా ఇ చ్చాను కానీ.. నేను నంది అవార్డును  మాత్రం అందుకోలేదు. 550కి పైగా సినిమాల్లో నటించినా ఇంతవరకు నంది అవార్డు రాలేదు. కానీ నంది అవా ర్డు, రఘుపతి వెంకయ్య అవార్డు ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. ప్రేక్షకుల ఆదరణ ముందు బిరుదులు, అవార్డులు చాలా చిన్నవి. అయితే అమెరికాలోని వెస్ట్ ప్రూఫ్ యూనివర్సిటీ నాకు డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది.
 
 నాటకాలే ప్రేరణ....
 మాది ప్రకాశం  జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని రావినూతల గ్రామం. మాది రైతు కుటుంబం. నాన్న ఎర్ర నాగయ్య, అమ్మ నాగరత్నం. కుటుంబంలో  నేనొక్కడినే సంతానం. అయితే చదువుకునే రోజులలో ఇంటర్‌కాలేజీ పోటీలలో సరదాగా నాటకాలు వేసేవాడిని. అధ్యాపకులు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. తరువాత కళాప్రపూర్ణ కళానాట్యమండలి స్థాపించి గ్రామంలో 25వరకు నాటకాలు వేసి మెప్పించాను.  నాటకరంగ అనుభవం సినిమాలో నటించడానికి ప్రేరణ కల్గింది. నా పెద్ద కుమారుడు రఘుబాబు అతి తక్కువ కాలంలో 250 సినిమాలలో అనేక పాత్రలు పోషిస్తూ చిత్ర పరిశ్రమలో రాణిస్తూ మంచిపేరు తెచ్చుకుంటున్నాడు. కొడుకు ప్రయోజకుడైతే తండ్రికి అంతకంటే ఆనందం ఏముంటుంది. అలాగే చిన్న కుమారుడైన బోసుబాబు కూడా నాలుగైదు సినిమాలలో నటించాడు.
 
 భూదాన్‌పోచంపల్లి : శ్రీ రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ అనే సినిమా షూటింగ్ మండలంలోని ముక్తాపూర్, రేవనపల్లి గ్రామాలలో సోమవారం జరిగింది. సూపర్‌స్టార్ కృష్ణ మేనల్లుడు, ప్రేమకథా చిత్రమ్ ఫేమ్ సుధీర్‌బాబు,  హీరో తల్లిదండ్రుల పాత్రలు పోషిస్తున్న ప్రముఖ నటుడు గిరిబాబు, పద్మినిప్రకాష్‌లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
 
 ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చందు మాట్లాడుతూ కన్నడంలో విజయవంతమైన 6 చిత్రాలను నిర్మించానని పేర్కొన్నాడు. తెలుగులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని తన మొదటి చిత్రమని చెప్పారు. ఇది పూర్తిగా అందమైన ప్రేమ కథా చిత్రమని అన్నారు.  చిత్రంలో హీరోయిన్‌గా నందిత, ప్రముఖ నటులు బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్, ఎంఎస్ నారాయణ, సప్తగిరి, రాంబాబు ప్రధాన ప్రాతలో నటిస్తున్నట్లు తెలిపారు. నిర్మాత లగడపాటి శ్రీధర్, సంగీతం గౌరవ హరి, పాటలు హరి, రామజోగయ్య శాస్త్రి, కెమరామెన్ కెఎస్. చంద్రశేఖర్‌లు వహిస్తున్నారని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement