హిట్‌ డైరెక్షన్‌  | New Directors hit movies in tollywood 2023 | Sakshi
Sakshi News home page

హిట్‌ డైరెక్షన్‌ 

Published Sat, Dec 9 2023 3:15 AM | Last Updated on Sat, Dec 9 2023 3:15 AM

New Directors hit movies in tollywood 2023 - Sakshi

లైఫ్‌ డైరెక్షన్‌ బాగుండాలంటే కెరీర్‌ మంచి డైరెక్షన్‌లో వెళ్లాలి. ఆ డైరెక్షన్‌ని సెట్‌ చేసుకోవడంలోనే టాలెంట్‌ ఉంటుంది. సెట్‌ చేసుకున్నాక హిట్‌ డైరెక్షన్‌లో వెళ్లడానికి శ్రమ అనుకోకుండా వీలైనంత కష్టపడాలి. ఈ ఏడాది కొందరు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లోకి గోల్‌ సెట్‌ చేసుకుని, ఎంతో తపనతో ఎంటరయ్యారు. ఫస్ట్‌ మూవీతో నిరూపించుకోవడానికి హార్డ్‌వర్క్‌ చేశారు. హిట్‌ అయిన డైరెక్టర్ల శాతం ఎక్కువే ఉంది. అలా ‘హిట్‌ డైరెక్షన్‌’లో కెరీర్‌ పరంగా ఒక మెట్టు ఎక్కిన దర్శకులతో పాటు పరిచయం  అయిన ఇతర దర్శకుల గురించి తెలుసుకుందాం. 

లక్‌ అంటే శ్రీకాంత్‌ ఓదెలదే. మరి..
దర్శకత్వం వహించిన తొలి చిత్రమే (‘దసరా’) పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అంటే లక్కే కదా. పైగా నేచురల్‌ స్టార్‌ నాని సినిమాకి చాన్స్‌ అంటే చిన్న విషయం కాదు. యాక్చువల్‌గా శ్రీకాంత్‌ పదో తరగతి చదువుతున్నప్పుడే సుకుమార్‌ దర్శకత్వం వహించిన ‘జగడం’ చూసి, సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. అయితే ఇంజినీరింగ్‌ పూర్తి చేశాక ఏ దర్శకుడి (సుకుమార్‌) సినిమా చూసి స్ఫూర్తిపొందారో.. అదే దర్శకుని వద్ద అసిస్టెంట్‌గా చేరేందుకు నాలుగేళ్లు కష్టపడ్డారు.

‘నాన్నకు ప్రేమతో’, ‘రంగ స్థలం’ చిత్రాలకు సుకుమార్‌ వద్ద అసిస్టెంట్‌గా చేశారు శ్రీకాంత్‌. ‘రంగస్థలం’ తర్వాత తన నిజ జీవిత ఘటనలతో ‘దసరా’ కథ రాసుకున్నారు. ఆ కథ నిర్మాత సుధాకర్‌ చెరుకూరి, నానీలకు నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. తెలంగాణలోని గోదావరి ఖని సమీపంలో ఉన్న సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ‘దసరా’ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై, నాని కెరీర్‌లో తొలి వంద కోట్ల సినిమాగా నిలిచింది. శ్రీకాంత్‌ మలి చిత్రం కూడా నానీతోనే రూపొందనుందని టాక్‌.   

హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించిన వేణు యెల్దండిలో మంచి ఎమోషనల్‌ డైరెక్టర్‌ ఉండి ఉంటాడని ఎవరూ ఊహించి ఉండరు. ‘బలగం’ సినిమాతో తనలోని మంచి దర్శకుడ్ని ఆవిష్కరించుకున్నారు వేణు. వాస్తవానికి దగ్గరగా మరణం, భావోద్వేగాల చుట్టూ కథ రాసుకుని ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించారు.

ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ జంటగా ‘దిల్‌’ రాజు ప్రోడక్షన్స్‌లో హర్షిత్‌ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎవరూ ఊహించని వసూళ్లను రాబట్టింది. ఇక తనకు తొలి చాన్స్‌  ఇచ్చిన ‘దిల్‌’ రాజుప్రోడక్షన్‌లోనే మలి సినిమా చేసేందుకు కథ సిద్ధం చేసుకుంటున్నారు వేణు. 

చదివింది ఇంజినీరింగ్‌ అయినా డైరెక్టర్‌ కావాలనే కలతో హైదరాబాద్‌లో అడుగుపెట్టారు షణ్ముఖ ప్రశాంత్‌. తన సొంత కథలతోనే పలు షార్ట్‌ ఫిలింస్‌ తీశారాయన. ఆ సమయంలో సుహాస్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో సుహాస్‌ హీరోగా నటించిన ‘కలర్‌ ఫోటో’ చిత్రంలో కొన్నాళ్లు దర్శకత్వం విభాగంలో చేశారు. ఆ తర్వాత సుహాస్‌ హీరోగా చేసిన ‘ఫ్యామిలీ డ్రామా’ చిత్రానికి రైటర్‌గా చేశారు. ఆ టైమ్‌లో తాను సిద్ధం చేసుకున్న ‘రైటర్‌ పద్మభూషణ్‌’ కథని సుహాస్‌కి చెప్పడం.. ఆయనకి నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. సుహాస్, టీనా శిల్పరాజ్‌ జంటగా నటించారు. మదర్‌ అండ్‌ ఫాదర్‌ సెంటిమెంట్, ఎమోషనల్‌–కామెడీ డ్రామాతో తొలి హిట్‌ సాధించారు షణ్ముఖ ప్రశాంత్‌.   

చిత్తూరు జిల్లా మంగళంపేటకు చెందిన కల్యాణ్‌ శంకర్‌ ‘మ్యాడ్‌’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. స్వగ్రామంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో తెలుగు మీడియంలో చదువుకున్న కల్యాణ్‌ శంకర్‌ తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌ అందుకున్నారు. సంగీత్‌ శోభన్, నార్నే నితిన్, రామ్‌ నితిన్, శ్రీ గౌరీ ప్రియారెడ్డి, అనంతికా సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్‌ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్‌’. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర నిర్మించారు. విడుదలైన రెండు మూడు రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టింది. 

భీమవరానికి చెందిన క్లాక్స్‌ (అసలు పేరు ఉద్దరాజు వెంకటకృష్ణ పాండురంగ రాజు) తొలి చిత్రం ‘బెదురులంక 2012’తో హిట్‌ అందుకున్నారు. కార్తికేయ, నేహాశెట్టి జంటగా రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండస్ట్రీలోకి రాకముందు క్లాక్స్‌ పలు ఉద్యోగాలు చేశారు. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అనే ఇటాలియన్‌ సినిమా చూశాక ఇండస్ట్రీకి వెళ్లాలనే ఆలోచన కలిగింది. దర్శకులు సుధీర్‌ వర్మ, రామ్‌గోపాల్‌ వర్మ, దేవా కట్టాల వద్ద అసిస్టెంట్‌గా చేశారాయన. డైరెక్టర్‌ అజయ్‌ భూపతి ద్వారా హీరో కార్తికేయ పరిచయం కావడంతో ఆయనతో ‘బెదురులంక 2012’ తీసి హిట్‌ అందుకున్నారు.  


ఈ ఏడాది ఆఖరి నెలలో విడుదలైన ‘హాయ్‌ నాన్న’ చిత్రంతో దర్శకునిగా పరిచయమయ్యారు శౌర్యువ్‌. తొలి సినిమాతోనే హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారాయన. నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించారు. వైజాగ్‌కి చెందిన శౌర్యువ్‌ని ఇంట్లో వాళ్లు మెడిసిన్‌ చేయమన్నారు.

అయితే సినిమాలపై ఇష్టంతో మూవీ నేపథ్యం లేకున్నా పరిశ్రమలోకి వచ్చారాయన. కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ‘జాగ్వార్‌’, ‘అర్జున్‌ రెడ్డి’ తమిళ రీమేక్‌ ‘ఆదిత్య వర్మ’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేశారు. నాలుగేళ్ల క్రితమే ‘హాయ్‌ నాన్న’ కథ రాసుకున్నారు. ఈ కథ తొలుత నిర్మాతలకు, ఆ తర్వాత నానీకి నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. తండ్రీ కూతురు మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగాలతో రూపొందిన ఈ చిత్రం హిట్‌తో దూసుకెళుతోంది.

ఇంకా ‘వినరో భాగ్యము విష్ణుకథ’తో మురళీ కిశోర్‌ అబ్బూరు, ‘నరకాసుర’తో సెబాస్టియన్‌ నోవా అకోస్టా జూనియర్, ‘విమానం’తో శివప్రసాద్‌ యానాల, ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’తో శ్రీనివాస్‌ వింజనంపాటి వంటి దర్శకులు హిట్‌ అందుకున్నారు. వీరితో పాటు మరికొందరు కొత్త దర్శకులు తమ ప్రతిభని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. 

తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ సినిమాతో పూజా కొల్లూరు దర్శకురాలిగా పరిచయమయ్యారు. అమెరికాలో డైరెక్షన్‌ , స్క్రీన్‌ రైటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాల్లో డిగ్రీ పట్టాపొందారు పూజ. 30కి పైగా చిత్రాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలకు పని చేసిన పూజ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు.

సమాజానికి మంచి సినిమాలు అందించాలన్న లక్ష్యంతో ఇండియా వచ్చారామె. తొలి ప్రయత్నంగా సంపూర్ణేశ్‌ బాబు హీరోగా ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ సినిమా తెరకెక్కించారామె. తమిళంలో విజయవంతమైన ‘మండేలా’కు తెలుగు రీమేక్‌గా ఇది రూపొందింది. ప్రధానంగా ఓటు విలువని తెలియజెప్పేలా ఈ చిత్రం సాగుతుంది. సమాజంలోని అసమానతల్ని ఎత్తి చూపుతూ ఆలోచింపజేస్తుందీ చిత్రం. తొలి చిత్రంతో దర్శకురాలిగా మంచి మార్కులు తెచ్చుకున్న పూజా కొల్లూరు తన తర్వాతి చిత్రాలకు కథలు సిద్ధం చేసుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement