ఈ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ నేర్చుకుంటే లక్షల్లో జీతాలు! | Career Opportunities: How to Become Javascript Developer | Sakshi
Sakshi News home page

Software: ఈ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌తో అవకాశాలు బోలేడు!

Published Mon, Dec 20 2021 7:27 PM | Last Updated on Mon, Dec 20 2021 8:28 PM

Career Opportunities: How to Become Javascript Developer - Sakshi

వెబ్‌సైట్‌లలో యూజర్‌ ఇంటరాక్టివిటీకి ప్రాధాన్యం పెరుగుతోంది. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌లకు జావాస్క్రిప్ట్‌ను జోడించి గ్రాఫిక్స్, ఇంటరాక్టివిటీతో కూడిన డైనమిక్‌ వెబ్‌సైట్లకు ఆదరణ ఎక్కువ. దాంతో ఐటీ రంగంలో.. ముఖ్యంగా వెబ్‌ డెవలప్‌మెంట్‌లో జావాస్క్రిప్ట్‌ కీలక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌గా మారుతోంది. చిన్నచిన్న కంపెనీల నుంచి పెద్ద సంస్థల వరకూ.. జావాస్క్రిప్ట్‌ను వినియోగిస్తున్నాయి. దాంతో ఈ టెక్‌ స్కిల్స్‌ ఉన్న అభ్యర్థులకు డిమాండ్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో.. జావాస్క్రిప్ట్‌తో ప్రయోజనాలు.. ఈ కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ తీరుతెన్నులు.. నేర్చుకునేందుకు అర్హతలు.. కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం... 

జావాస్క్రిప్ట్‌ అనేది వెబ్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌తోపాటు ఉపయోగించే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌. ఎప్పటికప్పుడు మారుతూ డైనమిక్‌గా ఉండే వెబ్‌ పేజీలు, యూజర్స్‌తో ఇంటరాక్టివ్‌గా ఉండే వెబ్‌సైట్‌లు రూపొందించేందుకు జావాస్క్రిప్ట్‌ను ఉపయోగిస్తారు. ఇది వెబ్‌ అప్లికేషన్లు, మొబైల్‌ అప్లికేషన్లలో ఫ్రంట్‌ ఎండ్‌లో పనిచేస్తుంది. బ్యాక్‌ ఎండ్‌సేవల్లోనూ జావాస్క్రిప్ట్‌ డెవలపర్‌ది ప్రధాన పాత్ర. డెవలపర్‌ ఉద్యోగాల్లో మూడో వంతు ఉద్యోగాలు వీరికి సంబంధించినవే ఉంటున్నాయి. కాబట్టి జావాస్క్రిప్ట్‌ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే చక్కటి అవకాశాలు అందుకోవచ్చు.


జావాస్క్రిప్ట్‌ అంటే

జావాస్క్రిప్ట్‌ అనేది ఇంటరాక్టివ్‌ వెబ్‌ అప్లికేషన్‌లను రూపొందించడానికి డెవలపర్‌లు ఉపయోగించే డైనమిక్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌. వెబ్‌సైట్‌లలో ఉపయోగించే డ్రాప్‌డౌన్‌ మెనూ, ఏదైనా బటన్‌ను క్లిక్‌ చేయడం, పేజీలో రంగును మార్చడం వంటివి జావాస్క్రిప్ట్‌కు ఉదాహరణలు. జావాస్క్రిప్ట్‌ను వెబ్‌ అప్లికేషన్లు, గేమ్‌ డెవలప్‌మెంట్, గ్రాఫిక్స్‌ను రూపొందించడానికి ఉపయోగించే బహుళార్ధసాధక ప్రోగ్రామింగ్‌ భాషగా కూడా పేర్కొంటారు. జావాస్క్రిప్ట్‌ను ఒకసారి రాసి.. ఎన్నిసార్లయినా రన్‌ చేసే వెసులుబాటు ఉంది. 

అప్లికేషన్స్‌
జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్‌: ఆబ్జెక్టులను క్రియేట్‌ చేయడానికి హెచ్‌టీఎంఎల్‌ ట్యాగ్‌లను ఉపయోగిస్తారు. ఆ ఆబ్జెక్టును ఇంటరాక్టివ్‌గా మార్చడానికి జావాస్క్రిప్ట్‌ అవసరం ఉంటుంది. ఉదాహరణకు హెచ్‌టీఎంఎల్‌తో వెబ్‌సైట్‌లో ‘అప్‌లోడ్‌ ఫైల్‌’ కనిపించేలా చేయొచ్చు. దాన్ని క్లిక్‌ చేసినప్పుడు ఆ ఫైల్‌ను అప్‌లోడ్‌ చేయడానికి వీలుకల్పించేదే జావాస్క్రిప్ట్‌. అలాగే ఇమేజెస్, టెక్స్‌›్ట ఫీల్డ్‌ తదితర ఫీచర్లను హెచ్‌టీఎంఎల్‌తో క్రియేట్‌ చేసినా.. అవి ఇంటరాక్టివ్‌గా పనిచేయాలంటే..   జావాస్క్రిప్ట్‌ను హెచ్‌టీఎంఎల్‌ ఫైల్స్‌లో పొందుపరచాల్సి ఉంటుంది.  

సీఎస్‌ఎస్‌
జావాస్క్రిప్ట్, సీఎస్‌ఎస్‌లను వేర్వేరు విధాలుగా వెబ్‌పేజీలలో ఉపయోగిస్తారు. వెబ్‌సైట్‌లో ఆకర్షణీయమైన ఇంటర్‌ఫేస్‌ కోసం లే అవుట్‌ను రూపొందించడానికి సీఎస్‌ఎస్‌ సహాయపడుతుంది. వెబ్‌పేజీని ఇంటరాక్టివ్‌గా చేసేందుకు జావాస్క్రిప్ట్‌ ఉపయోగపడుతుంది. 
 
ఏపీఐ
అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌ ఇంటర్‌ఫేస్‌కు సంక్షిప్త రూపం..ఏపీఐ. అప్లికేషన్లను కమ్యూనికేట్‌ చేయడానికి మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఫోన్‌లో ఏదైనా అప్లికేషన్‌ను ఓపెన్‌ చేసినప్పుడు ఫోన్‌ నుంచి సర్వర్‌కు డేటా వెళ్లడం, కావాల్సిన సమాచారంతో డేటా మళ్లీ ఫోన్‌కు రావడం ఏపీఐ ద్వారా జరుగుతుంది. జావాస్క్రిప్ట్‌లో ఏపీఐలు సర్వర్, క్లయింట్‌ మధ్య ఇంటర్‌ఫేస్‌ను ఏర్పరుస్తాయి. వెబ్‌ అడ్మిన్‌ సూచనల ఆధారంగా పేజీని యాక్సెస్‌ చేయడానికి ఏపీఐలు, వినియోగదారులను అనుమతిస్తాయి.

∙యూజర్‌కు కనిపించే ఫ్రంట్‌ ఎండ్‌తోపాటు, బ్యాక్‌ ఎండ్‌లోనూ నోడ్‌జేఎస్‌తో జావాస్క్రిప్ట్‌ను ఉపయోగిస్తారు. వీటిద్వారా డెవలపర్లు డేటాబేస్‌ నుంచి డేటాను తిరిగి పొందవచ్చు, సేవ్‌ చేయవచ్చు. అంతేకాకుండా పేమెంట్‌లు చేయడం, సోషల్‌ మీడియా పోస్ట్‌లను సేవ్‌ చేయడం వంటివీ చేయొచ్చు. వెబ్‌పేజీల్లో అపరిమితమైన ఫంక్షన్ల ద్వారా జావాస్క్రిప్ట్‌ భాషను ఉపయోగిస్తారు. 

వెబ్‌ పేజీలలో జావాస్క్రిప్ట్‌
► మౌస్‌తో కదిలించినప్పుడు, క్లిక్‌ చేసినప్పుడు వచ్చే మార్పులు.
► పేజీలో హెచ్‌టీఎంఎల్‌ కంటెంట్‌ కలపడం, మార్చడం లేదా తీసివేయడం.
► టైపింగ్‌ చేస్తున్నప్పుడు జరిగే మార్పులు.
► ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ చేయడం, అప్‌లోడ్‌ చేయడం.
► కాచీలో డేటా నిల్వచేయడం.
► వెబ్‌సైట్‌ వీక్షకులతో ఇంటరాక్షన్, సందేశాలు పంపడం.
► మొబైల్‌ అప్లికేషన్లు, ఆన్‌లైన్‌ గేమ్‌లను రూపొందించడానికీ జావాస్క్రిప్ట్‌ ఉపయోగిస్తున్నారు. 


బ్రౌజర్‌ ఏదైనా

ఇటీవల కాలంలో జావాస్క్రిప్ట్‌ను చాలా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీనవల్ల వినియోగదారుడు వెబ్‌సైట్‌లో ఏదైనా క్లిక్‌ చేయగానే వేగంగా ప్రాసెస్‌ అవుతుంది. లోపాలు, బగ్‌ల ఆధారంగా పరీక్షించడం, సవరించడం జావాస్క్రిప్ట్‌తో సులభం. ఏ బ్రౌజర్‌ అయినా జావాస్క్రిప్ట్‌ కోడ్‌ను రన్‌ చేస్తుంది. 

ఎలా పని చేస్తుంది
వెబ్‌ బ్రౌజర్లలో జావాస్క్రిప్ట్, ఇతర కోడ్‌లను అనువదించే ఇంజన్‌లు ఉంటాయి. అవి జావాస్క్రిప్ట్‌లోని కమాండ్స్‌కు అనుగుణంగా డైనమిక్‌ చర్యలకు దోహదపడతాయి. బాగా రాసిన, ఆప్టిమైజ్‌ చేసిన కోడ్‌ ..వెబ్‌పేజీలను సమర్ధవంతంగా ఓపెన్‌ చే స్తుంది. సరిగ్గా లేని ఆదేశాలతో కూడిన జావాస్క్రిప్ట్‌ యూజర్‌ బ్రౌజర్‌ను నెమ్మదించేలా చేస్తుంది. 


ఎవరు నేర్చుకోవచ్చు

వెబ్‌డెవలప్‌మెంట్‌పై ఆసక్తి ఉన్నవారు ముందుగా హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌ నేర్చుకొని.. ఆ తర్వాత జావాస్క్రిప్ట్‌పై దృష్టిసారించాలి. ఆన్‌లైన్‌లోనూ అనేక ఉచిత మెటీరియల్, ట్యుటోరియల్స్‌ అందుబాటులో ఉన్నాయి. జావాస్క్రిప్ట్‌ కమాండ్స్‌(ఆదేశాలు) ఇంగ్లిష్‌ మాదిరిగా ఉండటం వల్ల దీన్ని నేర్చుకోవడం సులభం. జావాస్క్రిప్ట్‌లో ప్రాథమిక నైపుణ్యాలపై పట్టు లభించిన తర్వాత.. ప్రోగ్రామింగ్‌లో కెరీర్‌ ప్రారంభించొచ్చు. జావాస్క్రిప్ట్‌ స్టడీ గ్రూప్‌లలో చేరడం ద్వారా సృజనాత్మకత, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. 

కెరీర్‌ అవకాశాలు
జావాస్క్రిప్ట్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో నైపుణ్యం సొంతం చేసుకుంటే.. లక్షల్లో వేతనాలు పొందొచ్చు. అన్ని కంపెనీల్లో జావాస్క్రిప్ట్‌ వినియోగం పెరగడం వల్ల రానున్న రోజుల్లో జావాస్క్రిప్ట్‌ డెవలపర్‌లకు మరింత డిమాండ్‌ పెరగనుంది. నిపుణులైన జావాస్క్రిప్ట్‌ డెవలపర్‌లను చాలా కంపెనీలు ఫ్రంట్‌ ఎండ్‌ వెబ్‌ డెవలపర్, వెబ్‌ అప్లికేషన్‌ డెవలపర్, జావాస్క్రిప్ట్‌ డెవలపర్, యూఎక్స్‌ డెవలపర్, వెబ్‌ డిజైనర్, యూఐ డిజైనర్, ఫుల్‌ స్టాక్‌ డెవలపర్, డెవ్‌ఓప్స్‌ ఇంజనీర్‌లుగా నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా ఫ్రీలాన్సింగ్‌ ద్వారా డెవలపర్లుగా పనిచేయొచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement